డెబ్బైఏడు సార్లైనా క్షమించాలి!

సహనశీలత గురించి క్రీస్తుప్రభువు చెప్పిన ప్రవచనం- ‘సహనంగా ఉండేవారు ధన్యులు. తాము స్వేచ్ఛగా ఉండటమేగాక తోటివారి మధ్య మనస్పర్థలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తారు. వారు దేవుని పిల్లలు’..

Updated : 05 Aug 2021 04:49 IST

సహనశీలత గురించి క్రీస్తుప్రభువు చెప్పిన ప్రవచనం- ‘సహనంగా ఉండేవారు ధన్యులు. తాము స్వేచ్ఛగా ఉండటమేగాక తోటివారి మధ్య మనస్పర్థలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తారు. వారు దేవుని పిల్లలు’.. ఇలా చెప్పడమే కాదు ఆచరించి చూపారు. ముప్పై కొరడా దెబ్బలతో క్రీస్తు సిలువ ప్రస్థానం యెరూషలేము వీధుల్లో మొదలై గొల్గొతా కొండపై ముగిసింది. వీపు మీద సిలువ భారం, కాళ్లూచేతులకు మేకులు, దేహం రక్తసిక్తం. తలపై ముళ్ల కిరీటం, పైన సూర్యతాపం. ఇవి భౌతిక బాధలయితే మానసిక హింసకు పరాకాష్ఠగా ముఖం మీద ఉమ్మి ‘నువ్వు యూదుల రాజువా?’ అని హేళనగా మాట్లాడటం.. ఇంత బాధపెట్టినా సహించడమే కాదు, తనను హింసించినవారి కోసం ప్రార్థించాడు. ప్రేమతో సహనంతో మెలిగేవారికి కళ్లముందు స్వర్గం సాక్షాత్కరిస్తుంది. ద్వేషం, అసూయ, క్రోధం లేని ఆ ప్రపంచం అమృతతుల్యం. ఇదే సహనశీలతకు లభించే బహుమానం. పూజగదిలో ఉన్నప్పుడు సోదరుడితో విరోధం సంగతి జ్ఞాపకం వస్తే కాసేపు ప్రార్థన ఆపి, అతనిలో నాలుగు మంచి గుణాలను గుర్తు చేసుకో! ప్రార్థన కన్నా సహనం ముఖ్యం. శత్రువుని ప్రేమించడం, శపించేవారిని దీవించడం, ద్వేషించేవారికి సాయంచేయడం.. ఇదంతా సాధ్యమా? అనే సందేహం వద్దు అంటున్నారు ప్రభువు.

ఒకసారి పేతురు ‘ప్రభూ! నా సోదరుడు తప్పు చేస్తే ఎన్నిసార్లు అతడ్ని క్షమించాలి? ఏడుసార్లా?’ అన్నాడు. ‘కాదు, డెబ్బయ్యేడుసార్లు’ అన్నాడు యేసు. దీని అర్థం సహనంతో శత్రువును జయించాలని, ప్రతీకారంతో పోరాడే కన్నా ప్రేమించటం మిన్న అన్నారాయన. సహనం ఉన్నచోట, నిందించుకోవటం, దండించుకోవడం ఉండదు. అది మనుషుల మధ్యే కాదు, కుటుంబాలు, దేశాల మధ్య కూడా. సహనంతో సముద్రాన్ని జయించవచ్చు, శాంతిని, ప్రేమను పొందవచ్చు.

- ఎం.సుగుణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని