జ్ఞానంశిలలుగా ... భక్తికినెలవుగా... అరుణాచలం!

అరుణాచలం... అది శిలలసమూహం కాదు ప్రోదిచేసిన భక్తి రాశి పోసిన జ్ఞానం... అచలంగా సాకారమైన పరమ శివచైతన్యం... మహా భక్తులకు, పారమార్థిక జిజ్ఞాసువులకు కేంద్ర స్థానం. తమిళనాడులోని ఈ ప్రఖ్యాతక్షేత్రంలో కార్తిక పౌర్ణమినాడు జరిగే కృత్తికా దీపోత్సవం ఎంతో ప్రసిద్ధమైంది.

Published : 26 Nov 2020 01:02 IST

అరుణాచలం... అది శిలలసమూహం కాదు ప్రోదిచేసిన భక్తి రాశి పోసిన జ్ఞానం... అచలంగా సాకారమైన పరమ శివచైతన్యం... మహా భక్తులకు, పారమార్థిక జిజ్ఞాసువులకు కేంద్ర స్థానం. తమిళనాడులోని ఈ ప్రఖ్యాతక్షేత్రంలో కార్తిక పౌర్ణమినాడు జరిగే కృత్తికా దీపోత్సవం ఎంతో ప్రసిద్ధమైంది.
రుగ్వేదం ప్రకారం పరమశివుడు అరుణవర్ణ స్వరూపుడు. అందుకు నిదర్శనమే అరుణాచలం. అరుణగిరి ఓ ఆధ్యాత్మిక అయస్కాంతం. పంచభూతలింగాల్లో అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం. తిరువర్ణామలైలోని ఆయన సన్నిధిలో భక్తులు అగ్ని తాపాన్ని భరించలేరని... అందుకే పరమ కారుణ్యంతో, పరమేశ్వరుడు అరుణాచలమై నిలిచాడని పారమార్థికులు నమ్ముతారు. కేవలం ఆ గిరి దర్శనంతో, ప్రదక్షిణంతో పరమ శివుడు తన అనుగ్రహాన్ని కురిపిస్తాడని భావిస్తారు. అరుణాచలం ప్రాపంచిక బంధాల రుణ విముక్తి క్షేత్రమని కూడా పౌరాణికుల ప్రబోధం. జ్యోతిర్లింగాల్లో ఒకడైన అరుణాచలేశ్వరుడు ఎందరో సాధకులకు నిధానమై నిలుస్తున్నాడు. ఇక్కడ పారమార్థికోన్నతికి పరాకాష్టగా రమణమహర్షిని చెప్పొచ్చు. అరుణాచల క్షేత్ర స్మరణం  పావనత్వాన్నిస్తుందని స్వయానా శివుడే చెప్పినట్లు శివపురాణం చెబుతోంది.
* బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో పరమేశ్వరుడు పంచాక్షరాలతో కూడిన అరుణాచలం అనే పర్వతంగా ఆవిర్భవించాడన్నది పురాణ కథనం. మహాశివుడి మంత్రం కూడా నమఃశివాయ. పంచాక్షరీ మంత్ర జపానికి ఉన్న అనంతమైన శక్తి అరుణాచలం అన్న నామానికి కూడా ఉందని మహర్షులు చెబుతారు. అందుకే స్మరణ మాత్రముననే పరముక్తి ఫలద, కరుణామృత జలధి అరుణాచలమది... అని పాడుకుంటారు.
* ప్రపంచంలో ఎక్కడా కనిపించని విధంగా అరుణాచలంలో అచలమైన పర్వతమే మహేశ్వరుడిగా పూజలందుకుంటోంది. అరుణాచలేశ్వర ఆలయం గర్భగుడిలోని శివలింగానికి సమమైన ప్రాధాన్యం అరుణగిరికి కూడా ఉంది. అందుకే అరుణాచలంలో కొండకు ప్రదక్షిణ చేస్తారు. రమణ మహర్షి అరుణాచలేశ్వరుడి దర్శనంకన్నా ఆ గిరి ప్రదక్షిణకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. తమ వద్దకు వచ్చిన ప్రతి భక్తుడికీ గిరి ప్రదక్షిణ చేయమని చెప్పేవారు. అది కేవలం భౌతికమైన దేహప్రదక్షిణ కాదని, దాని వల్ల భక్తి, జ్ఞానం ఇనుమడిస్తాయని బోధించేవారు. శివనామస్మరణతో జ్యోతిర్లింగ స్వరూపమైన అరుణగిరికి చేసే ప్రదక్షిణ వల్ల మనస్సుకు శక్తి, ఆ పర్వతంలోని ఔషధాల ప్రభావం వల్ల శరీరానికి స్వస్థత చేకూరుతాయన్నది అనుభవైకవేద్యం.

* సమస్తలోకానికి అరుణాచలం హృదయస్థానమని చెబుతారు. ఈ కొండను కేవలం చర్మచక్షువులతో మాత్రమే కాదు జ్ఞాననేత్రాలతో చూడాలి. ఇక్కడ జ్ఞానమే ప్రధానం. సోహం భావన ద్వారా, అహం భావన దాటిపోయిన ఆత్మస్థితి కావాలి. సకల ముముక్షువులకు, భక్తులకే కాక జ్ఞానులకు కూడా ఈ అరుణాచలం పరమాధారం, చరమాశ్రయం.
* అరుణగిరి ఒక్కో యుగంలో ఒక్కో విధంగా విరాజిల్లిందని పురాణాల్లో ఉంది. కృత యుగంలో ఇది జ్యోతి లింగం అంటే అగ్నిపర్వతం. త్రేతాయుగంలో ఇది రత్నమయమై మాణిక్య వర్ణంతో భాసించింది. ద్వారపయుగంలో లోహకాంతులు వెదజల్లింది. కలియుగంలో అరుణవర్ణ గిరిగా మారింది. ఇది  ఏ యుగంలో ఏ రూపంలో కొలువైనా తన శక్తి సంపత్తుల్లో మార్పు ఉండదని, గౌతమ మహర్షికి పరమశివుడు వెల్లడించాడంటారు.
* అరుణగిరి అంతర్భాగంలో ఒకానొక ప్రదేశంలో ఓ గుహ ఉందని, దాని ముఖద్వారంలో ఉన్న మహావృక్షం కింద పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో కొలువున్నాడంటారు. ఎందరో దేవతలు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, మహాయోగులు ఆయనను సేవిస్తున్నారని చెబుతారు. అందుకే ఈ పర్వతం అనంతమైన ఆధ్యాత్మిక తరంగాలను వెదజల్లుతుంటుందంటారు. అరుణగిరి     శ్రీ చక్రంతో సమానమని, పరమేశ్వర ప్రతిరూపమని భావిస్తారు.
* అరుణాచలం వైరాగ్యానికి, పరిత్యాగానికి ప్రతీక. ఏ ఆడంబరం, వైభవం లేని దగ్గరే భగవత్తత్వం భాసిస్తుందని విస్పష్టం చేసే పర్వతమే అరుణాచలం. లౌకిక ప్రపంచం, పారమార్థికత ఒకే ఒరలో ఒదగని రెండు కత్తులలాంటివి. ఇహలోక సుఖాలు కావాలనుకుంటే పారమార్థికత రుచించదు. ‘పరమార్థంపై ఆసక్తి ఉంటే ప్రపంచ కోరికల్ని త్యజించు. పరమ జ్ఞానం మనిషిని మహోన్నతుడిని చేస్తుంది...’ ఇది అరుణాచలేశ్వరుడి సందేశం. అహంకార రాహిత్యమే, అరుణాచల ప్రదక్షిణకు అర్హత అని వేద పురాణాలు ఘోషిస్తున్నాయి.


అరుణాచలం జడమైన పర్వతం కాదు, జ్ఞానానికి, చైతన్యానికి స్థావరం.
- భగవాన్‌ రమణమహర్షి


పదహారో శతాబ్దానికి చెందిన విరూపాక్ష దేవ, గుహ నమశ్శివాయ శ్రీశైలానికి చెందిన వీరశైవ సాధువులు. సిద్ధపురుషులు. తమ ఇష్టదైవమైన మల్లికార్జునుడి ఆన మేరకు అరుణాచలం వచ్చి గిరిపై విరూపాక్ష గుహలో ఎన్నో ఏళ్లు తపస్సు చేశారు. గురువులై ఆధ్యాత్మిక బోధనలు చేశారు. వారు తపస్సు చేసిన విరూపాక్ష గుహలోనే రమణమహర్షి 1902 నుంచి 1905 వరకు తపోదీక్షలో ఉన్నారు. గుహ నమశ్శివాయ చరిత్రను రమణులు స్వయంగా రచించారు.


దర్శనాత్‌ అభ్రసదసి, జననాత్‌ కమలాలయే
కాశ్యాంతకు మరణాన్‌ ముక్తిః, స్మరణాత్‌ అరుణాచలే

అభ్రసదసి అంటే చిదంబర క్షేత్ర దర్శనం, కమలాలయం అంటే తిరువారూర్‌లో పుట్టడం, కాశీలో మరణం ముక్తినిస్తే అరుణాచలమనే పేరు స్మరించడం కూడా జన్మరాహిత్యాన్నిస్తుందని చెబుతారు.


*  కృత్తికానక్షత్రయుక్త పౌర్ణమినాడు అరుణగిరిపై అఖండ జ్యోతిగా దర్శనమిస్తానని పరమశివుడు వరమిచ్చినట్లు చెబుతారు. మానవ నేత్రాలు ఆ వెలుగును దర్శించలేవు కాబట్టి కార్తిక పౌర్ణమినాటి సాయంత్రం కొండ శిఖరంపై జ్యోతిని వెలిగిస్తారు.


-సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని