Updated : 26 Aug 2021 06:36 IST

మహామాయావి.. సర్వాంతర్యామి

ఆగస్టు 30 కృష్ణాష్టమి

ఆబాలగోపాలాన్నీ అలరించే పిల్లనగ్రోవి, సమ్మోహపరచే నెమలిపింఛం, చెరగని దరహాసం తరగని ప్రేమామృతం, రాయబార చాతుర్యం, కార్యదక్షతా చాకచక్యం వెరసి సకల జగాన్నీ పాలించే కృష్ణపరమాత్మ.

దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థం మళ్లీమళ్లీ అవతరించిన ఆ దేవదేవుడి శక్తులు అనంతం. వాటిల్లో ఆంతరంగిక, బాహ్య, తటస్థ అనేవి ముఖ్యమైనవి. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఆంతరంగిక శక్తితో, భౌతిక ప్రపంచాన్ని బాహ్య శక్తితో వ్యక్తపరుస్తాడు. తటస్థ శక్తికి చెందిన జీవాత్మలకు ఆంతరంగిక, బాహ్య శక్తుల్లో దేనినైనా ఆశ్రయించే వెసులుబాటు ఉంటుంది. మహా మాయ ప్రభావంతో జీవాత్మలు ఆయా సందర్భాల్లో కష్టాలపాలవుతాయి. ఈ పరిస్థితి నుంచి విముక్తి కలిగించేందుకే భగవంతుడు లోకాన అవతరించి తన దివ్య లీలలు ప్రదర్శిస్తుంటాడు.

గోవర్ధన లీల

యాదవులపై కోపించిన దేవేంద్రుడు భయంకర వర్షంతో బీభత్సాన్ని సృష్టించాడు. ఆ ఆపద నుంచి రక్షించేందుకు నల్లనయ్య గోవర్ధనగిరిని ఛత్రంలా ఎత్తిపట్టాడు. ఏడేళ్ల చిన్నికృష్ణయ్య చిటికెన వేలిపై భారీ పర్వతాన్ని ఏడు రోజులపాటు ఎలా ఎత్తిపట్టగలడు? ఇదే యోగమాయ.

నవనీతచోరుడు

తనకోసం ప్రత్యేకమైన పద్మగంధీ గోవుల పాలను సిద్ధం చేసినా, కృష్ణుడు మాత్రం పొరుగిళ్లలో వెన్నను దొంగిలించి ఆస్వాదించేవాడు. ఒకరోజు వారంతా వచ్చి కృష్ణుడి ఆగడాల గురించి ‘తాను వెన్న దొంగిలించడమే గాక, కోతులకూ పంచిపెడతాడు. కుండలు అందకుండా ఉట్టిలో పెడితే వాటిని రాళ్లతో పగలగొడుతున్నాడు. చీకటిగదిలో దాచినా దివ్య కాంతి వెలుగుతోంది, పాలూపెరుగూ మాయమవుతున్నాయి’ అంటూ ఫిర్యాదు చేశారు. పక్కనే నిలబడి తనకేమీ తెలీదని అమాయకంగా చూస్తోన్న కన్నయ్యను ఏమీ అనలేక చిరునవ్వు చిందించింది యశోదమ్మ.

దామోదర లీల

దామ అంటే తాడు, ఉదర అంటే పొట్ట. తల్లి యశోద తాడుతో కృష్ణుని పొట్టను కట్టేయడమే దామోదర లీల. యశోదమ్మ వెన్న కోసం పెరుగును చిలుకుతుండగా చిన్నికృష్ణుడు పాల కోసం వచ్చాడు. ఆమె కొడుకును ప్రేమగా ఒళ్లో పడుకోబెట్టుకుని పాలిచ్చింది. కన్నయ్యను వాత్సల్య రసభావనతో సేవించిన భక్తురాలు యశోదమ్మ! ధర్మాలన్నీ భగవంతుణ్ణి తండ్రిగా పేర్కొంటాయి. కానీ భగవంతుడ్నే పుత్రునిగా భావించిన విశిష్ట సందర్భం అది! కృష్ణుడు తనవద్ద పాలు సేవిస్తుండగా, అవతల పొయ్యిమీద పద్మగంధీ గోవుల నుంచి సేకరించిన పాలు పొంగిపోవడం చూసి లోనికి పరుగెత్తింది యశోదమ్మ. దాంతో గోపాలుడికి కోపమొచ్చి, వెన్నకుండ మీదికి రాయిని విసిరాడు. ఆ కుండ మరో కుండపై పడి అలా అన్ని కుండలూ పగిలి వాటిలోని పాలు, పెరుగు, వెన్నలు నేలపాలయ్యాయి. అందుకు తల్లి మందలిస్తుందని వెన్న తీసుకొని దూరంగా పరిగెత్తి కోతులకు పంచిపెడుతూ తాను కూడా తినసాగాడు. యశోదమ్మ వెంబడించగా పరుగు తీశాడు. ఆనక అలసిపోయి పట్టుబడ్డాడు. తల్లి రోకలికి కట్టేయాలని ఎంత ప్రయత్నించినా రెండంగుళాల తాడు తక్కువైంది. చివరికి కట్టేసేందుకు తనే ఒప్పుకున్నాడు. ఆపై చెట్ల రూపాల్లో ఉన్న గంధర్వుల శాప విమోచనం మొదలైన అంశాలన్నీ దామోదర లీలలో భాగమే.

16108 భార్యలు

దేవదానవుల మధ్య ఎప్పుడూ విరోధమే. ఒకసారి నరకాసురుడు మణిపర్వతమనే ప్రాంతాన్ని ఆక్రమించు కోవడమే గాక వరుణదేవుని ఛత్రాన్ని, దేవతల తల్లి అయిన అదితి కర్ణాభరణాలను దోచుకెళ్లాడు. ఇంద్రుడు శరణు వేడగా, శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి ప్రాగ్జ్యోతిషపురం వెళ్లాడు. యుద్ధంలో నరకాసురుని వధించాడు. అతడివద్ద బందీలుగా వున్న 16100 మంది యువరాణులకు విముక్తి కలిగించాడు. కృష్ణుని దివ్యత్వానికి ముగ్ధులైన వారంతా భక్తితో ప్రార్థిస్తూ తమను స్వీకరించమని కోరారు. ప్రతి జీవిలో పరమాత్మగా ఉన్న కృష్ణుడు వారి నిష్కల్మష భక్తిని చూసి పత్నులుగా అంగీకరించాడు. వైదిక కాలపు కట్టుబాట్ల వల్ల స్త్రీ ఒక్కరాత్రి ఇంట్లో లేకున్నా, ఇక ఆమెనెవరూ పెళ్లాడేవారు కాదు. నరకాసురుడు 16100 మంది యువరాణులను అపహరించి రోజుల తరబడి తన భవనంలో బంధించాడు. ఆ స్థితిలో కృష్ణుడు వారిని వివాహమాడి అందరికీ రాణి స్థానం కల్పించాడు. అదే మాధవుని అవ్యాజ కృప. అష్ట భార్యలకు వీరు జతకాగా 16108 మంది పత్నులయ్యారు. దేవదేవుడు అందరు కృష్ణులుగా మారి ఏకకాలంలో ప్రతి రాణితో కలిసుండేవాడు. కనుకనే కన్నయ్య మది దోచే మాయావి, సర్వాంతర్యామి. యోగమాయతో కూడిన ఆధ్యాత్మిక జీవన మాధుర్యాన్ని చూపేందుకే ఈ లీలలు. భాగవతాన్ని పఠించడం, భగవన్నామాలను జపించడం ద్వారా మహామాయ ప్రభావం నుంచి విముక్తులమవుతాం. దివ్యానందాన్ని పొందుతాం.

- సత్యగౌర చంద్రదాస ప్రభు, అధ్యక్షుడు, హరేకృష్ణ మూవ్‌మెంట్‌; ప్రాంతీయ అధ్యక్షుడు, అక్షయపాత్ర


పారిజాతం ఎవరి సొంతం?!

వేణుమాధవుడు.. వెన్నదొంగగా అలరించినా, గోవర్ధనగిరిని పైకి ఎత్తినా, కాళింది పడగ మీద నాట్యం చేసినా, శిశుపాలుని వధించినా, భస్మాసురుని అంతమొందించినా, కంసుని హతమార్చినా ప్రతిదీ లోకకల్యాణార్థమే. ఆఖరికి పారిజాత సుమం కోసం అలిగిన సత్యభామకు ఆ చెట్టునే తెచ్చిచ్చిన ఘటన కూడా అంతే.

కరోజు గోవిందుడు చంద్రకాంత శిలమీద ఆసీనుడై రుక్మిణీదేవితో సరాగాలాడుతున్నాడు. అది చూసిన కలహభోజనుడు నారదమహర్షి ఊరికే ఉండడు కదా! నందనవనంలో ఒక పారిజాత పుష్పాన్ని తెంపుకుని ద్వారకకు దిగి వచ్చాడు. దాన్ని రుక్మిణికి ఇవ్వకుండా మాయా నాటక సూత్రధారి కృష్ణుడి చేతికిచ్చాడు. అలా ఇవ్వడంలో ఉన్న అంతరార్థం కృష్ణుడికి తెలుసు. ఆ సమమంలో అకక్కడ రుక్మిణి చెలికత్తెలతోపాటు సత్యభామ చెలికత్తె కూడా ఉంది.

ఎనిమిదిమంది సతీమణులు ఉన్న  నల్లనయ్య చేతిలో ఒక్కటే పారిజాత కుసుమం ఉంది. దాన్ని పక్కనే ఉన్న రుక్మిణికి ఇవ్వడం న్యాయం. కనుక మాధవుడు ఆమెకే ఇచ్చాడు.

కలహభోజనుడు కల్పించుకుని ‘అమ్మా రుక్మిణీ! నందకిశోరునికి తానంటేనే కృష్ణునికి ఇష్టమని, తానే గొప్ప సౌందర్యవతినని సత్యభామకు అహంకారం. కానీ నల్లనయ్య మహిమాన్వితమైన ఈ పుష్పాన్ని నీకే ఇచ్చాడు. ఈ సంగతి తెలిస్తే ఇక సత్యభామకు గర్వభంగం తప్పదు’ అన్నాడు నవ్వుతూ. ఆ మాటలు విన్న సత్యభామ చెలికత్తె ఊరుకుంటుందా?! చెంగున వెళ్లి భామ చెవిలో వేసింది.

సత్యకు కోపం వస్తుందని తెలిసి నారదుడు వెళ్లిపోగానే ఆమె వద్దకు వెళ్లాడు కన్నయ్య. ఊహించినట్లే సత్యభామ నారదుని, కృష్ణుడ్ని కూడా నిందించింది.

కృష్ణుడు ఎంతగానో లాలించి, ఆమెని శాంతపరచాడు. ‘పారిజాత పుష్పానిదేముంది, ఆ చెట్టునే ఇస్తానంటూ అసాధారణ వాగ్దానం చేశాడు. సత్యభామతో కలిసి గరుడ వాహనమెక్కి స్వర్గానికి వెళ్లాడు. ఇంద్రుడ్ని జయించి, పారిజాత వృక్షాన్ని తెచ్చాడు. ఇష్టసఖి ఉద్యానవనంలో నాటించాడు. కొన్నాళ్లకది తిరిగి స్వస్థానం స్వర్గానికే చేరింది. పారిజాతం ఎవరి సొంతమూ కాదు, లోకోపకార వృక్షమని చాటడమే ఈ కృష్ణలీల పరమార్థం.  

- పారుపల్లి వెంకటేశ్వరరావు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని