Updated : 01 Mar 2022 12:37 IST

Maha Shivaratri: పంచారామ క్షేత్రం.. అమరావతి

 

క్షేత్రం:  అమరేశ్వరస్వామి దేవస్థానం

ప్రదేశం: అమరావతి, గుంటూరు జిల్లా,   ఆంధ్రప్రదేశ్‌ 

కొలువైన దైవం : బాల చాముండికా సమేత అమరలింగేశ్వర స్వామి

అమరావతి, న్యూస్‌టుడే: ఒకవైపు కృష్ణమ్మ పరవళ్లు, మరోవైపు ప్రాచీన చరిత్ర, బోధి ధర్మాలకు నెలవైన అమరావతిలో దక్షిణ కాశీగా పిలిచే పంచారామా ప్రథమ క్షేత్రం అమరేశ్వరాలయం ఉంది. అమరావతి పంచాయతన శైవక్షేత్రం అజరామరమైనది. దేవతల నివాస నగరంగా ప్రసిద్ధి. నవ్యాంధ్ర రాజధానికి సమీపంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. 

స్కంద పురాణంలో దేవదానవులు క్షీర సాగరాన్ని మదించిన సమయంలో పొందిన అమృత లింగాన్ని శివుడి వర ప్రభావితుడైన తారకాసరుడనే రాక్షసుడు తస్కరించుకెళ్లి తన కంఠమున ధరించి దేవతలను బాధించసాగాడు. పరమేశ్వరుడికి దేవతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారిని రక్షించేందుకు శివుడు దేవ సేనాధిపతి అయిన కుమారస్వామిని తారకాసుర సంహారానికి పంపుతాడు. కుమార స్వామి యుద్ధం చేసి అతనిని అంతమొందించి కంఠమున ఉన్న అమృత లింగాన్ని ఛేదించగా లింగం ఐదు శకలములై ఐదు ప్రదేశాల్లో పడుతుంది. అందులో మొదటి శకలం పడిన అమరావతి ప్రాంతం అమరేశ్వరాలయంగా భాసిల్లుతోంది. దేవేంద్రుడే స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటి ఆలయాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అభివృద్ధి చేశారని చరిత్రకారులు చెబుతారు. ఆయన వంశీయులే ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

అద్వితీయం అమరేశ్వరుడి దివ్య స్వరూపం 

అమరేశ్వరుడిని దర్శిస్తే సకల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. శివుడు అభిషేక ప్రియుడు కావడంతో స్వామి వారికి నిత్య కల్యాణం, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. క్షేత్రంలో కొలువైన అమరేశ్వరుడు తొమ్మిది అడుగుల ఏకశిలా లింగంతో భక్తులకు దర్శనమిస్తారు. రుత్వికులు ఏడు అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెట్టుపై నుంచి స్వామికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. పానవట్టంపై మరో శివలింగాన్ని ప్రతిష్ఠించి పంచామృతాలతో అభిషేకాలు చేస్తున్నారు. ఆలయంలో 23 ఉపాలయాలు ఉన్నాయి. అమరేశ్వరుడికి తూర్పున మహిషాసురమర్దినిదేవి, పడమర జ్వాలాముఖి అమ్మవారు, ఉత్తరాన బాలచాముండికా మాత, దక్షిణాన అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నారు. ఆలయం వెలుపల స్వామివారి ప్రత్యేక రథశాల ఉంది. 

మహాశివరాత్రి కైంకర్యాలు ఇలా..

మార్చి ఒకటో తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేకువజామున నాలుగు గంటల నుంచి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. రాత్రి తొమ్మిది గంటలకు మహన్యాస పారాయణ ప్రారంభించి లింగోద్భవ కాలంలో మహా రుద్రాభిషేకం నిర్వహిస్తారు. వేకువజామున ఒంటిగంటకు చిలుక, గజవాహనంతో ఎదురుకోలోత్సవం నిర్వహిస్తారు. మూడు గంటలకు బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి కల్యాణం జరుగుతుంది. 3న నిత్య అవపోసన, బలిహరణ నిర్వహిస్తారు. 4న చూర్ణోత్సవం, వసంతోత్సవం, పూర్ణాహతి నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి ధ్వజా అవరోహణతో బ్రహోత్సవాలు ముగుస్తాయి. 

నయనానందకరం దివ్య రథోత్సవం

అమరేశ్వరాలయంలో నిర్వహించే దివ్య రథోత్సవంలో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. మార్చి రెండో తేదీన నిర్వహించే అమరేశ్వరుడి దివ్య రథోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తారు. ప్రత్యేకంగా అలంకరించిన దివ్యరథంపై స్వామి వారి ఉత్సవ మూర్తులను ఉంచి అత్యంత వైభవంగా క్రతువు నిర్వహిస్తారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు