పర్యటనం... ప్రమోదం పుణ్యప్రదం

మనసుకు ఆనందాన్ని, శరీరానికి ఉత్తేజాన్నీ ఇచ్చే పర్యటన ఈనాటిది కాదు. పురాణాలూ ఇతిహాసాల్లో యాత్రా విశేషాలెన్నో ఉన్నాయి. దేశాటనతో పరిధి విస్తృతమవుతుంది.. లోకంపోకడ తెలుస్తుంది.. జీవితానుభవం చేకూరుతుంది.. తత్త్వం బోధపడుతుంది.. జీవనపథం నిర్ధారణ అవుతుంది.. భగవత్‌ సాన్నిహిత్యం అనుభూతికొస్తుంది.. ఇది విజ్ఞుల మాట. కనుకనే ఎప్పుడూ ఉన్నచోటే ఉండేకంటే అవకాశం కల్పించుకుని లోక సంచారం చేయమంటారు.

Updated : 24 Mar 2022 06:16 IST

మనసుకు ఆనందాన్ని, శరీరానికి ఉత్తేజాన్నీ ఇచ్చే పర్యటన ఈనాటిది కాదు. పురాణాలూ ఇతిహాసాల్లో యాత్రా విశేషాలెన్నో ఉన్నాయి. దేశాటనతో పరిధి విస్తృతమవుతుంది.. లోకంపోకడ తెలుస్తుంది.. జీవితానుభవం చేకూరుతుంది.. తత్త్వం బోధపడుతుంది.. జీవనపథం నిర్ధారణ అవుతుంది.. భగవత్‌ సాన్నిహిత్యం అనుభూతికొస్తుంది.. ఇది విజ్ఞుల మాట. కనుకనే ఎప్పుడూ ఉన్నచోటే ఉండేకంటే అవకాశం కల్పించుకుని లోక సంచారం చేయమంటారు. ‘దేశమన్నా చూడాలి కోశమన్నా(అమరకోశం) చూడాలి’ అనే నానుడి కూడా ప్రచారంలో ఉంది.

రెండు శతాబ్దాల క్రితం ఏనుగుల వీరాస్వామయ్య మద్రాసు నుంచి కాశీ నగరాన్ని సందర్శించాలని వందమంది బంధుమిత్రులతో కలిసి కాలినడకన బయల్దేరాడు. పదిహేను నెలలకు పైగా జరిగిన ఆ పర్యటనలో ఎన్నో గ్రామాలూ పట్టణాలూ దర్శించారు. ఆ పర్యటన విశేషాలను క్రోడీకరించి ‘కాశీ యాత్రాచరిత్ర’గా ప్రచురించారు. వాహన సదుపాయం, సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే ఆయన అవలోకనం అద్భుతమనిపిస్తుంది. నాటి జీవనవిధానం ముందు తరాల్ని అబ్బురపరుస్తుంది.

పూర్వం పుణ్య క్షేత్రాలను దర్శించిరావడానికి నెలల కొద్దీ సమయాన్ని వెచ్చించేవారు. పర్యటనలతో పుణ్యం పురుషార్థం రెండూ సిద్ధిస్తాయని నమ్మేవారు. కాలినడకతోనే కొండకోనలూ కారడవులూ దాటుకుంటూ సుదూర ప్రాంతాలు చూసివచ్చేవారు.

యాత్రా దర్శనం మనోక్లేశాలను నయం చేస్తుందంటూ పురాణేతిహాసాలు కీర్తించాయి. ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధంలో ఆప్తులను చేతులారా దూరం చేసుకున్నాననే వ్యథతో అప్పటికే అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి నమస్కరించాడు. తన మనసులోని సందేహాలను బయటపెట్టాడు. బదులుగా భీష్ముడు అనేక ధార్మిక రహస్యాలను తెలియజేసి.. ‘కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గం మన లోలోపల ఉండి విధ్వంసాలకు కారణమవుతుంది. కనుక వాటిని విడిచి యాత్రలకు బయల్దేరాలి. సద్బుద్ధితో, సన్మార్గంలో చేసిన పర్యటనలు సత్ఫలితాలిస్తాయి’ అంటూ వివరించాడు.

భీష్ముడి ద్వారా యాత్రా విశిష్టత తెలుసుకున్న ధర్మరాజు పర్యటనలతో మనసును తేలిక చేసుకున్నాడు.

పాండవ కౌరవుల మధ్య యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేని బలరాముడు దేశాటనకు బయల్దేరాడు. నైమిశారణ్యంలో ప్రవేశించినప్పుడు మునీంద్రులు ఆయనకు ఎదురెళ్లి స్వాగత మర్యాదలు జరిపారు. కొంతకాలం తర్వాత పల్వలుడునే రాక్షసుణ్ణి బలరాముడు హతమార్చాడు. అప్పుడు తపోసిద్ధి పొందిన ఎందరో రుషులు బలరాముణ్ణి కీర్తించి, పవిత్ర జలాలతో అభిషేకించారు. అందమైన పద్మమాలలు మెడలో వేసి అలంకరించారు. మేలైన వస్త్రాలను బహూకరించారు. దైవ సమానులైన మునుల సత్కారాన్ని అందుకునే అదృష్టం యాత్రతో దక్కినందుకు ఆనందించాడు బలరాముడు.

అంత నభిషిక్తు జేసి యత్యంత సురభి
మంజులామ్లాన కంజాత మాలికయును
నంచితాభరణములు దివ్యాంబరములు
నర్థి నిచ్చిన దాల్చి యా హలధరుండు

ధర్మరాజు ద్రౌపది కలిసున్న సమయంలో అర్జునుడు ఇంట్లోకి వెళ్లినందుకు, పాండవుల ప్రతిజ్ఞకు భంగం కలిగింది. నియమం ప్రకారం ఏడాదిపాటు అర్జునుడు తీర్థయాత్రలు చేశాడు. అప్పుడే పార్వతి శివుడితో యుద్ధం చేయ గల వీరుడెవరని అడిగింది. తనతో సమానుడు అర్జునుడని, అతని శక్తి యుక్తులు చూపిస్తానంటూ బోయ దంపతులుగా వెళ్లారు. శివునితో యుద్ధంచేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు అర్జునుడు.

అగస్త్యుడు చెప్పిన పుణ్యక్షేత్రాలు

ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు సాధించాలనే సంకల్పంతో పుణ్య కార్యాలు ఆచరిస్తారు. అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రకు పవిత్రతీర్థాలను దర్శించుకోవడం వల్ల ఇహంలో పరంలో మేలు జరుగుతుందని చెప్పి కొన్నింటి పేర్లు తెలియజేశాడు. తీర్థాలలో ప్రయాగ శ్రేష్ఠమైందన్నాడు.

ప్రథమం తీర్థ రాజం తు ప్రయాగాఖ్యం సువిశ్రుతమ్‌
కామికం సర్వ తీర్థానాం ధర్మార్థ కామ మోక్షదమ్‌

ప్రయాగతోపాటు నైమిశారణ్యం, కురుక్షేత్రం, హరిద్వార్‌, ఉజ్జయిని, అయోధ్య, మధుర, ద్వారక, గంగ, సింధు, సాగరసంగమం, కంచి, త్రయంబకం మొదలైన పవిత్ర స్థలాలు ముక్తిదాయకాలని అగస్త్య మహర్షి తెలియజేశాడు.

నదీ జలాలకు పవిత్రత ఎందుకంటే...

ఒక మారుమూల గ్రామంలోని కాలువ నీరు, కాశీనగరంలో గంగాజలం ఒకే విధంగా కనిపిస్తుంది. కానీ పవిత్రతలో భిన్నత్వం ఎలా వస్తుందంటే...

ప్రభావాదద్భుతద్భూమేః
సలిలస్య చ తేజసః
పరిగ్రహాన్మునీనాం చతీర్థానాం పుణ్యతమా స్మృతాః

భూమికి గల అద్భుత ప్రభావం, నీళ్లలో ఉండే తేజస్సు, మునీంద్రుల నివాసం కారణంగా నీరు పవిత్రంగా మారుతుందని స్కాంద పురాణంలోని ఈ శ్లోకానికి అర్థం. అందుకే కష్టనష్టాలను లక్ష్యపెట్టక తీర్థయాత్రలు చేసేవారు.
పుణ్యక్షేత్రాలలో తలవెంట్రుకలను అర్పించడం తనను తాను సమర్పించుకోవడమని పద్మ పురాణం వివరిస్తోంది.

తీర్థోపవాసః కర్తవ్యః శిరోముండనం తథా
శిరోగతాని పాపాని యాంతి ముండనం తోయతః

తీర్థ క్షేత్రాలలో ఉపవాసం ఆచరించడం మంచిది. తలనీలాలు కూడా అర్పించాలి. అందువల్ల చేసిన పాపాలు నశిస్తాయి. అహంకారాన్ని తొలగించమనే భక్తుడి వేడుకోలు కేశ సమర్పణంలో దాగుంది.

అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి
పుణ్యక్షేత్ర కృతం పాపం వజ్రలేపో భవిష్యతి

తెలిసీ తెలియక చేసిన పాపాలు పుణ్యస్థలాల సందర్శనతో నశిస్తాయి. కానీ అక్కడ పాపం చేస్తే ఆ దోషం ఎన్నటికీ పోదని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవుని దర్శించాలనే పవిత్ర భావనతో ఆలయాలకు వెళ్తారు. భయంతోనో, భక్తితోనో మనసులోని కల్మషాలను బయటే వదిలేస్తారు. అందువల్ల పుణ్యక్షేత్రాల పరిధిలో సానుకూల తరంగాలు వెల్లడవుతుంటాయి. ఆలయంలో ప్రవేశించినపుడు సద్భావనలు పరిమళించడానికి ఇదొక కారణమని సైన్స్‌ చెబుతుంది. భక్తి మాట అటుంచితే పర్యటనలతో దైనందిన ఆందోళనలు మాయమై విజ్ఞానం, వినోదం సొంతమవుతాయి.

- రామచంద్ర కనగాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని