గుణపాఠం

ఆలయంలో పురాణ కాలక్షేపం జరుగుతోంది. స్వామీజీ పాండిత్యం అనంతం. చెప్పే తీరు కూడా అమోఘంగా ఉండేది. ఆరోజు ఉపన్యాసం పూర్తయ్యాక సందేహాలుంటే అడగమన్నారాయన.

Published : 13 Oct 2022 00:27 IST

ఆలయంలో పురాణ కాలక్షేపం జరుగుతోంది. స్వామీజీ పాండిత్యం అనంతం. చెప్పే తీరు కూడా అమోఘంగా ఉండేది. ఆరోజు ఉపన్యాసం పూర్తయ్యాక సందేహాలుంటే అడగమన్నారాయన. ఓ కొంటె కుర్రాడు లేచి ‘స్వామీ! తమరు సర్వజ్ఞులు కదా! నా చేతుల్లో ఓ గువ్వ ఉంది. అది బతికుందో, చనిపోయిందో చెప్పండి’ అన్నాడు.

కుర్రాడివేళాకోళం స్వామీజీకి బాగానే అర్థమైంది. తాను కనుక గువ్వ బతికే ఉందని చెబితే క్షణంలో దాని పీక నులిమి చని పోయిన గువ్వను చూపిస్తాడు. తాను చనిపోయిందంటే రెండు చేతులూ విప్పి గువ్వను ఎగరేస్తాడు. ఇతడికి గుణపాఠం నేర్పాలి... అనుకున్నారు.
క్షణం కళ్లు మూసుకుని చిరునవ్వు చిందించారు. ఆయనేం చెబుతారోనని కుర్రాడితోబాటు అందరూ ఎదురుచూస్తున్నారు. స్వామీజీ తల పంకించి ‘నాయనా! చూసే కళ్లు చెప్పలేవు. మాట్లాడే పెదాలు చూడలేవు. అడిగావు కనుక చెబుతాను, విను.. ఆ గువ్వ చావుబతుకులు నా చేతుల్లో లేవు, నీ గుప్పిట్లోనే ఉన్నాయి’ అనేసి ధ్యానముద్రులయ్యారు.

అక్కడున్న పెద్దాయన కల్పించుకుని ‘అతి తెలివి అథోగతికి, విపరీతబుద్ధి వినాశనానికి దారితీస్తాయి. గురువుగారు ఆక్షేపించకుండానే గుణపాఠం నేర్పించారు’ అన్నాడు. కొంటె కుర్రాడు తల దించుకుని అక్కణ్ణించి వెళ్లిపోయాడు.

- ఉప్పు రాఘవేంద్ర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని