హలీమా ఇంట శుభాల పంట

ప్రవక్త కాలంలో అరబ్‌ దేశాల్లో ధనికులు పాల తల్లులకు తమ పిల్లల బాధ్యతను అప్పగించే వారు. రెండేళ్ల తర్వాత ఎవరి పిల్లల్ని వారు తీసుకునేవారు.

Published : 13 Oct 2022 00:36 IST

ప్రవక్త కాలంలో అరబ్‌ దేశాల్లో ధనికులు పాల తల్లులకు తమ పిల్లల బాధ్యతను అప్పగించే వారు. రెండేళ్ల తర్వాత ఎవరి పిల్లల్ని వారు తీసుకునేవారు. ఎప్పటి లానే ఆరోజు కూడా సంపన్న తల్లులు తమ బిడ్డలను పాలతల్లులకు అప్పగించారు. బక్కచిక్కిన హలీమా అనే పాలతల్లికి ఎవరూ బిడ్డను ఇవ్వలేదు. అదే సమయంలో తండ్రిలేని ఒక పిల్లాణ్ణి ఎవరూ తీసుకోలేదు. అది చూసిన హలీమా ఒట్టి చేతులతో తమ ఊరు వెళ్లటం కన్నా ఆ బాలుణ్ణి తీసుకెళ్లడం మేలనుకుంది.

అందరూ నిరాకరించిన తన బిడ్డను హలీమా తీసుకెళ్తానంటే ఎంతగానో సంతోషించింది అమీనా. దారిలో కృశించిన స్తనాన్ని బిడ్డకు అందించింది హలీమా. ఆశ్చర్యంగా స్తనాలు పాలతో నిండాయి. పిల్లాడితోబాటు హలీమా కూతురు షీమా కూడా కడుపారా పాలు తాగింది. బిడ్డ రాకతో హలీమా ఇంట శుభాల పంటపడింది. చిక్కిశల్యమైన వారి ఒంటె దృఢంగా, చలాకీగా మారి, విస్తారంగా పాలు ఇస్తోంది. ‘హలీమా! ఈ పిల్లాడు దిక్కులేని వాడనుకున్నాం. కానీ మనకే దిక్కయ్యాడు. ఎంత అదృష్టవంతులం!’ అన్నాడు భర్త. హలీమా రెండేళ్లపాటు పాలిచ్చి పెంచిన ఆ శిశువు మరెవరో కాదు ఇస్లామ్‌ ప్రవక్త ముహమ్మద్‌ (స). తండ్రి అబ్దుల్లాహ్‌ చనిపోవడంతో తాత అబ్దుల్‌ ముత్తలిబ్‌, బాబాయి అబూతాలిబ్‌ బాధ్యత తీసుకున్నారు. పిల్లాడికి ఆరేళ్లు వచ్చేసరికి తల్లి అమీనా కన్నుమూసింది. అతడే 40ఏళ్ల వయసులో దైవ ప్రవక్తగా నియమితులయ్యారు.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని