సాక్షాత్తూ సరస్వతి

స్వామి వివేకానంద 1897 జనవరిలో విదేశాల్లో తన దిగ్విజయ యాత్ర ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చారు. ప్రపంచ మేధావులంతా కీర్తించిన, విశ్వవిఖ్యాతిగాంచిన స్వామీజీకి బ్రహ్మరథం పట్టారు.

Updated : 15 Dec 2022 06:12 IST

నేడు శారదాదేవి జయంతి

స్వామి వివేకానంద 1897 జనవరిలో విదేశాల్లో తన దిగ్విజయ యాత్ర ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చారు. ప్రపంచ మేధావులంతా కీర్తించిన, విశ్వవిఖ్యాతిగాంచిన స్వామీజీకి బ్రహ్మరథం పట్టారు. అలాంటి వివేకానంద తమ గురుపత్ని శారదామాతను దర్శించటానికి కోల్‌కతాలోని దక్షిణేశ్వరం వెళ్లి సాష్టాంగ ప్రణామం చేశారు. ఆమె కూడా ప్రశంసించడంతో స్వామీజీ వినయంగా మోకరిల్లి ‘అమ్మా! ఈ కార్యసాధనకు కారణమెవరో నాకు తెలియదా? నీ కృపే లేకపోతే అది నాకు సాధ్యమయ్యేదేనా? నీ పాదరేణువు నుంచి వేలాదిమంది వివేకానందలను సృష్టించగలవు తల్లీ!’ అన్నారు. రామకృష్ణ మఠానికి శారదా మాతే మూలశక్తి. ఆ దివ్యజననిని అనుక్షణం స్మరించు కోవాలి అంటూ వివేకానంద స్వామి కొనియాడేవారు.

ఆధ్యాత్మికశక్తికి తోడు ఆత్మగౌరవం, ఆత్మ శక్తి, వివేకం, సహనం, సానుకూల దృక్పథం, కార్య దక్షతల సమాహారం శారదాదేవి. అందుకే ‘శారద సాక్షాత్తూ సరస్వతి. ఆ మాత తన నిజతత్వాన్ని మరగుపరచుకుని మసలుకుంటోంది’ అన్నారు రామకృష్ణ పరమహంస. బేలూరు మఠంలో శారదాదేవి అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశం గురించి రామకృష్ణ పరమహంస ప్రత్యక్షశిష్యులు స్వామి శివానంద ‘పురాణాల్లో సతీదేవి దేహాంగాలు పడిన 51 స్థలాలు శక్తి పీఠాలుగా వెలిశాయి. అలాగే శారదాదేవి దేహం దహనమైన ఈ స్థలం మహాశక్తిపీఠం’ అన్నారు. ఆ ప్రాంతం నేటికీ అంతే ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపచేస్తుందని భక్తుల విశ్వాసం. ఆమె ఆధ్యాత్మిక బోధలు నిత్యనూతనం. ‘నీకు మనశ్శాంతి కావాలంటే ఇతరుల దోషాలను ఎంచకు! నీ దోషాలను సరిదిద్దుకో! ప్రపంచాన్ని నీదిగా భావించటం నేర్చుకో. ఎవరూ పరాయివారు కాదు, అంతా నీవారే!’ అని చరమ సందేశాన్ని ఇచ్చిన శారదాదేవి అందరిలో దివ్యత్వాన్ని చూస్తూ, కులమతాలకు అతీతంగా మాతృప్రేమ పంచారు.                
బి.సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని