భీష్ముడి రాజనీతి

శ్రీకృష్ణుడు ఆదేశించగా అంపశయ్యపై ఉన్న భీష్ముని వద్దకు ధర్మసూత్రాలు నేర్చుకునేందుకు వెళ్లాడు ధర్మరాజు. రాజనీతి గురించి బోధించేముందు, ‘వత్సా! ప్రభువైనవాడు కొన్ని నియమాలు ఆచరించాలి.

Updated : 15 Dec 2022 06:10 IST

శ్రీకృష్ణుడు ఆదేశించగా అంపశయ్యపై ఉన్న భీష్ముని వద్దకు ధర్మసూత్రాలు నేర్చుకునేందుకు వెళ్లాడు ధర్మరాజు. రాజనీతి గురించి బోధించేముందు, ‘వత్సా! ప్రభువైనవాడు కొన్ని నియమాలు ఆచరించాలి. సత్యాన్ని ఆశ్రయించాలి. లేదంటే ఎవరూ విశ్వసించరు. మిత్రులు కూడా శంకిస్తారు. అప్పుడు శత్రువులు లబ్ధి పొందుతారు. పాలకులకు సరసం, కోపం రెండూ తగవు. అతి సరసుడైతే ఎవరూ లెక్కచెయ్యరు. అతి ఆగ్రహం చూపితే భయంతో దరిచేరరు. దాంతో యదార్థాన్ని గ్రహించలేరు. ధర్మరక్షణే పాలకుల ముఖ్య కర్తవ్యం. అందులోనే ప్రజారక్షణ, పరమహితం ఉన్నాయి. ప్రజల సుఖదుఃఖాలను తనవిగా భావించడం ప్రభువు కర్తవ్యం.     సర్వదా క్షమించడం, సర్వదా దండించడం వల్ల అపరాధుల సంఖ్య అధికమౌతుంది. రాజు వ్యసనాలకు బానిస కాకూడదు. లేదంటే దుర్మార్గులు లాభపడతారు. సేవకులను ఎగతాళి చేస్తే వాళ్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించరు. తిరస్కారభావమూ కలుగుతుంది. ఎప్పుడు యుద్ధం చెయ్యాలి? ఎప్పుడు సంధి చేసుకోవాలి- అంటే ప్రభువు                  ఆదిలోనే అనుభవజ్ఞులు, విశ్వాసపాత్రులైన మంత్రులతో ఆలోచించి లోకరక్షణ దిశగా ప్రవర్తించాలి’ అంటూ వివరించాడు భీష్మపితామహుడు. ఇవి ఎప్పటికీ అనుసరణీయమే.

గోవిందం ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని