గోదా కల్యాణం

మాసాల్లో మార్గశీర్షం, మార్గశీర్షంలో ధనుర్మాసం శ్రేష్ఠం. ఇది శ్రీమహా విష్ణువుకూ శ్రీరంగనాథుడికీ అన్వయం. మహాభారత కాలంలో సంవత్సరం మార్గశీర్షంతోనే ప్రారంభమయ్యేది.

Updated : 15 Dec 2022 06:09 IST

మాసాల్లో మార్గశీర్షం, మార్గశీర్షంలో ధనుర్మాసం శ్రేష్ఠం. ఇది శ్రీమహా విష్ణువుకూ శ్రీరంగనాథుడికీ అన్వయం. మహాభారత కాలంలో సంవత్సరం మార్గశీర్షంతోనే ప్రారంభమయ్యేది. గోదాదేవి రంగనాథుల వివాహం భోగినాడు జరిగింది. ఆయనకు ప్రీతిపాత్రురాలైన ఆండాళ్‌ విష్ణుచిత్తుడి ఇంట వెలిసింది. బాల్యం నుంచీ పూలమాల అల్లి తలలో ధరించి.. దాన్ని మనసారా స్వామివారికి అలంకరించేది. అదంతా చూసి ఆ పేద బ్రాహ్మణుడు మురిసిపోయాడు. రంగ నాథుడు తిరుపల్లాండు, కూతురు తిరుప్పావు.
భాగవతుడుగా (పెరియాశ్వార్‌) ప్రసిద్ధుడైన విష్ణుచిత్తుడు పరతత్వం శుల్కంగా పాండ్యరాజు వేలాడదీసిన ధనాన్ని కైవసం చేసుకుని ‘గురుముఖమనధీత్యుడు’ అనే బిరుదు సంపాదించాడు. ద్వాపరంలో గోపికలు కాత్యాయనీ వ్రతం చేసి శ్రీకృష్ణుణ్ణి పొందగలిగారు. కలియుగంలో గోదాదేవి సిరినోము ఆచరించి రంగనాథునికి అర్ధాంగి అయ్యింది. యశోదాదేవి సోదరుడైన కుంభుని పుత్రిక నీలాదేవి గోదాని పూజించి, పాశురాలతో స్వామిని కీర్తించి ‘చూడికొడుత్తా.. పారి కొడుత్తార్‌..’ అంటూ అభినందనలు అందుకుంది. గోదాచరితను శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యదగా రచించి చరితార్థుడయ్యాడు.
సదా గోదాం స్మరామ్యేవ మచ్చిత్తాబ్జ విహారిణీమ్‌
సదా తామేవగాయామి కరుణావరుణాలయామ్‌

అంటూ భక్తులు గోదాదేవిని పారవశ్యంతో స్మరించి తరిస్తారు.
 ఉప్పు రాఘవేంద్ర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని