అతిథి సేవ.. ఆధ్యాత్మిక తోవ

తల్లి, తండ్రి, గురువుల తర్వాతి స్థానం అతిథికిచ్చారు మన పెద్దలు. ఇంటికి విచ్చేసిన అతిథి అభ్యాగతులను సాక్షాత్తూ దైవస్వరూపంగా భావించాలని హితవు పలికారు. అతిథికి సేవచేసి తరించాలని వేదాలూ ఉపనిషత్తులూ పురాణాలూ ఇతిహాసాలూ నొక్కి వక్కాణిస్తున్నాయి.

Updated : 18 May 2023 04:58 IST

తల్లి, తండ్రి, గురువుల తర్వాతి స్థానం అతిథికిచ్చారు మన పెద్దలు. ఇంటికి విచ్చేసిన అతిథి అభ్యాగతులను సాక్షాత్తూ దైవస్వరూపంగా భావించాలని హితవు పలికారు. అతిథికి సేవచేసి తరించాలని వేదాలూ ఉపనిషత్తులూ పురాణాలూ ఇతిహాసాలూ నొక్కి వక్కాణిస్తున్నాయి.

శ్రీమహావిష్ణువు అంశతో జన్మించిన పృథుచక్రవర్తి జనరంజకంగా ప్రజల్ని పాలిస్తున్న కాలమది! ఓ శుభసందర్భాన సనకుడు, సనాతనుడు, సనందనుడు మొదలైన మహాసిద్ధులు ఆయన రాజప్రాసాదంలోకి విచ్చేశారు. యోగిపుంగవులు తమ భవనంలో అడుగు పెట్టగానే సామ్రాజ్యాధినేత ఎదురెళ్లి వినమ్రంగా ఆహ్వానించి సాదరంగా తోడ్కొని వచ్చాడు. ఆ బ్రహ్మ మానస పుత్రులను బంగారు గద్దెలపై ఆసీనులను చేశాడు. వారి పాదపద్మాలను కడిగిన జలాలను తలపై చల్లుకున్నాడు. గౌరవసూచకంగా తాను సాధారణ పీఠంపై కూర్చుని రాజభవనంలో సత్సంగాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తపో ధనులను ఉద్దేశించి ‘మంగళమూర్తు లైన మహాత్ములారా! పూర్వజన్మ పుణ్యవిశేషం వల్ల మిమ్మల్ని దర్శించగలిగాను. ఎవరి గృహంలోని చిరు ధాన్యాలు (తృణకణాలు), జలం, స్థలం, భృత్యవర్గం పూజ్యులైన వారి సేవకు ఉపయోగపడతాయో ఆ గృహస్థు పేదవాడైనా భాగ్యవంతుడే. మీ రాకవల్ల నాకు సర్వశుభాలూ కలుగుతాయి. అతిథి అభ్యాగతులు, భక్తుల పాదజలం సోకనివారి ఇల్లు సిరిసంపదలతో తులతూగు తున్నప్పటికీ, అది పాములు చుట్టుకున్న చెట్టులా భయం కలిగిస్తుంది’ అన్నాడు. అతిథి పూజకు ఎంతో విలువ ఉందంటూ అలా ప్రకటించాడు చక్రవర్తి. పృథువు రూపంలో గృహస్థుల ధర్మాన్ని గుర్తుచేశాడు భగవంతుడు. పెద్దలు ఆగమించినప్పుడు ఎంత వినయంతో మసలుకోవాలో, ఎలా సేవించాలో ఆచరించి చూపారు. పూజ్యులు, సజ్జనులకు ఆతిథ్యమిచ్చే గృహస్థులు నిరుపేదలైనా పరమ ధన్యులే! ఆ గృహాలు తీర్థస్థలాలే! అతిథులను సేవించని గృహస్థులు శ్రీమంతు లైనా ఏమీ లేనివారే! భక్తులు, భాగవతోత్తములు కాలు మోపని ఇళ్లు కాలసర్పాలు తిరిగే ‘భూత’భవనాలే... అంటోంది మన సనాతన ధర్మం.

ఆదరణతో ఆశీస్సులు

ఇంటికొచ్చిన అతిథులు నిరాదరణతో వెనుతిరిగితే మనకు అశుభం. చిరునవ్వుతో స్వాగతించి ఆతిథ్యమిస్తే పుణ్య ప్రదం. అందుకే భృగుమహర్షి... అతిథిర్యస్య భగ్నాశః గృహాత్‌ ప్రతినివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్ఛతి అంటూ అతిథిసేవ విశిష్టతను తెలియజేశాడు. ఏ ఇంటి నుంచి అతిథి నిరాదరణకు గురై నిరాశతో వెనుతిరుగుతాడో ఆ ఇంటివారికి తన పాపం ఇచ్చి, వారి పుణ్యం తీసుకెళ్తా డన్నది భావం. అతిథి పూజకు నోచని నివాసంలో పుణ్యం పాదరసంలా జారిపోతుంది. పాపం పాములా ప్రవేశిస్తుంది. మనమెన్ని సౌకర్యాలతో, ఎంత ఆడంబరంగా జీవిస్తున్నాం, పంచభక్ష్య పరమాన్నాలతో భుజిస్తున్నామన్నది కాదు.. మనింటికొచ్చిన వారికి ప్రేమను పంచుతూ, ప్రీతితో ఆతిథ్యం ఇవ్వడమే వైభవానికి ప్రతీక.

ఆ సేవలో తరించిన ధన్యాత్ములెందరో..

తాము శ్రీమంతులు కాకున్నా రెక్కల కష్టంతో అతిథులను ఆదరించి ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన వారెందరో! షిరిడీలో సాయిబాబా సంచరిస్తున్న తొలిరోజులు.. ఆయన సిద్ధపురుషుడని అప్పటికెవరూ గుర్తించలేదు. అక్కడ బాయజాబాయి అనే పేదరాలికి రోజు గడవటమే గగనం! అయినా రోజూ గంపలో రొట్టె, కూర పెట్టుకుని మైళ్ల కొద్దీ నడిచెళ్లి భక్తితో బాబాకు కొసరి కొసరి వడ్డించేది. ఆ సేవలను సాయి మరవలేదు. ఆమెకీ, ఆమె కుమారుడికీ తుదివరకూ అండగా నిలిచి ఆధ్యాత్మికోన్నతి ప్రసాదించాడు.

అలాగే అరుణాచలంలో ముత్తమ్మ అనే స్త్రీమూర్తి ఉండేది. రమణ మహర్షి ఇంట్లోంచి వచ్చేసి అనామకంగా తిరుగు తున్నప్పుడు పిలిచి అన్నం పెట్టిన భాగ్యశాలి ఆమె. చని పోయిన తన కొడుకు అచ్చం రమణుల లాగే ఉంటాడని ఆయనకు భోజనం పెట్టేది. ఆ ఔదార్యాన్ని రమణులు విస్మరించలేదు. అలా మహర్షిని ఆదరించిన ముత్తమ్మ కారణజన్మురాలిగా నిలిచింది.

అదేవిధంగా జగద్గురువు శంకరాచార్యులు కాలడి గ్రామంలో ఓ ఇంటికి భిక్షాటనకు వెళ్లారు. ఏమీ ఇవ్వలేక నిర్వేదానికి గురైంది ఇల్లాలు. చివరికి ఒక ఉసిరికాయను ఆయన పాత్రలో వేసి తన దయనీయస్థితికి కంటతడి పెట్టుకుంది. అది చూసి కదిలిపోయిన ఆదిశంకరాచార్యులవారు ఆ క్షణంలోనే శ్రీమహాలక్ష్మిని స్మరిస్తూ ఆశువుగా కనకధారా స్తోత్రం పఠించి ఆ సాధ్వి కళ్లముందు బంగారు కాసులు కురిపించారు. మహానుభావులకు ఇచ్చే ఆతిథ్యంతో గృహస్థులకు ఇలాంటి లౌకిక, పారలౌకిక భాగ్యాలెన్నో!

ఆతిథ్యంలో సమత్వం

అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో చందంగానో, వారి స్థితిగతులను బట్టి ఆతిథ్య పద్ధతులను మార్చడం కూడదు. అయోధ్యలో వేడుకల వేళ దశరథ మహారాజు- ‘పల్లెల నుంచి వచ్చే వారికి ఎలా మెలగాలో తెలియక పోవచ్చు. కానీ వాళ్లు అమాయక గ్రామీణులనీ, అయోధ్యావాసులు నాగరికత తెలిసినవారని భేదం చూపకండి! ఎవరినీ ఎన్నడూ నిర్లక్ష్యం చేయకండి’ అంటూ అతిథులందరినీ సమంగా ఆదరించ మని సేవకులకు సూచించేవాడట.

అతిథి సేవలో అంతర్వేది దర్శనం

ఆధునిక కాలంలో అతిథి సేవలో అపర అన్నపూర్ణగా పేరుతెచ్చుకున్నవారు డొక్కా సీతమ్మ. ఒకసారి ఆమె అంతర్వేది నరసింహ స్వామిని దర్శించుకునేందుకు బయల్దేరింది. మార్గమధ్యంలో ఓ చెట్టుకింద బండి ఆగింది. సరిగ్గా అప్పుడే కొందరు పిల్లాపాపలతో చెట్టు నీడన విశ్రమించారు. ఇంతలో పిల్లలు ఆకలంటూ ఏడుస్తుంటే.. ఓ పెద్దావిడ ‘ఏడవకండి! మనం సీతమ్మగారి ఊరిపొలిమేరల్లోనే ఉన్నాం. వాళ్లింటికి వెళ్లగానే ఆ చల్లనితల్లి కమ్మటి భోజనం పెడుతుంది’ అంటూ ఊరడించింది. సీతమ్మ మనసు ఆర్ద్రమయ్యింది. అంతర్వేది ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఇంటికి తిరిగొచ్చేసింది. వాళ్లు వచ్చేసరికల్లా వంట చేసి అందరి ఆకలి తీర్చి అతిథిసేవలోనే అంతర్వేది నరసింహ స్వామిని దర్శించుకుంది.

బి.సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని