శివకేశవులను ద్వేషిస్తే నరకమే..

శివ, కేశవులు రూపంలో వేరైనా, నిజానికి అభిన్న స్వరూపులు. వారి మధ్య భేదాన్ని ఎంచకూడదన్నది ఈ శ్లోకభావం.

Published : 15 Jun 2023 00:49 IST

శివాయ విష్ణు రూపాయ
  శివ రూపాయ విష్ణవే
  శివస్య హృదయం విష్ణుః
  విష్ణోస్య హృదయం శివః

శివ, కేశవులు రూపంలో వేరైనా, నిజానికి అభిన్న స్వరూపులు. వారి మధ్య భేదాన్ని ఎంచకూడదన్నది ఈ శ్లోకభావం.
మద్భక్తో శివ విద్వేషీ మద్వేషీ శంకర ప్రియః
తావుభౌ నరకం యాతి యావచ్చంద్ర దివాకరః

నా భక్తుడు శివుణ్ణి ద్వేషించినా.. శివభక్తుడు నన్ను ద్వేషించినా.. వారికి నరక ప్రవేశం తప్పదు. సూర్య చంద్రాదులు ఉన్నంతవరకు వారక్కడే ఉంటారన్నది విష్ణుమూర్తి వచనం. పార్వతీదేవి విష్ణువుకు సోదరి. నారాయణుడే శివపార్వతుల వివాహం జరిపించాడు. మధురై నగరంలో మీనాక్షి, సుందరేశ్వరుల కల్యాణాన్ని ఆ దేవదేవుడే నిర్వహించినట్లు ఆలయ శిల్పాలు తెలియజేస్తాయి.
శివపూజా దురంధరుడైన నారాయణుడు ప్రదోష సమయంలో కైలాసానికి వెళ్లి శివ తాండవం చూసి ఆనందిస్తాడట. ఇక మహాశివుడి గురించి చెప్పాలంటే.. అతడు పరమోత్కృష్ట వైష్ణవోత్తముడు. ఆ ఇద్దరూ ఒకరినొకరు ధ్యానిస్తుంటారని పురాణకథనాలున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలైన అరుణాచలం, కాంచీ పురం, చిదంబరం, తిరుచ్చెందూరు తదితర దేవాలయాల్లో విష్ణుమూర్తి విగ్రహాలను కూడా దర్శించవచ్చు. ఇక కాంచీపురం, కుంభకోణం, తిరుచ్చిరాపల్లి, రామేశ్వరం లాంటి పుణ్యస్థలాలు శివకేశవ క్షేత్రాలుగా అలరారుతున్నాయి.

పరాశరం సచ్చిదానందమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని