అనుభూతి.. ఆస్వాదన..

ఇద్దరు మిత్రులు పండ్లు తిందామని ఓ మామిడి తోటకు వెళ్లారు. పండ్లు విరగకాశాయి. ఇద్దరిలో ఓ వ్యక్తి కలమూ కాగితమూ తీశాడు. తోటలో అటూ ఇటూ తిరుగుతూ ఎన్ని చెట్లున్నాయి.

Published : 29 Jun 2023 00:09 IST

ఇద్దరు మిత్రులు పండ్లు తిందామని ఓ మామిడి తోటకు వెళ్లారు. పండ్లు విరగకాశాయి. ఇద్దరిలో ఓ వ్యక్తి కలమూ కాగితమూ తీశాడు. తోటలో అటూ ఇటూ తిరుగుతూ ఎన్ని చెట్లున్నాయి. వాటికెన్ని కొమ్మలున్నాయి, ఆకులెన్ని, కాయలెన్ని- అంటూ లెక్కించటం మొదలుపెట్టాడు. రెండో వ్యక్తి ప్రశాంతంగా తోటంతా ఒకసారి తిరిగి చూశాడు. ఓ చెట్టు వద్ద ఆగి పండిన పండ్లను కోశాడు. కింద కూర్చొని నింపాదిగా తినసాగాడు. ఆ తీయదనాన్ని ఆస్వాదించసాగాడు. ఇంతలో తోటమాలి వచ్చి ఇద్దరినీ గమనించాడు. మొదటి వ్యక్తిని ఉద్దేశించి ‘ఇక్కడేం చేస్తున్నావయ్యా? అసలు తోటలోకి ఎందుకొచ్చావు?’ అనడిగాడు. ‘మామిడిపండ్లు తిందామని’ అన్నాడతను. ‘మరి నీ మిత్రుడిలా పండ్లు కోసుకుని హాయిగా తినకుండా లెక్కిస్తున్నావేంటి? కొమ్మలూ కాయల లెక్కలతో ఏం సాధించావు? తోటకు వచ్చామా! పండ్లు కోశామా, కడుపారా తిన్నామా అన్నట్లుండాలి!’ అన్నాడు.

శిష్యులకు ఈ కథ చెప్పి ‘నిరంతర సంశయాలతో ఒరిగేదేమీ లేదు. వాదోపవాదాలతో పారమార్థిక పురోగతిని సాధించలేం. భగవంతుడు లెక్కలకు అందడు. నమ్మి అనుభూతి చెందితేనే అర్థమవుతాడు’ అన్నారు రామకృష్ణ పరమహంస. 

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని