త్వమేవ శరణం

దేవుడికి నమస్కరించినంతలో మనకు తృప్తి కలగదు. టెంకాయ కొడతాం. నైవేద్యం పెడతాం. కేశాలు అర్పిస్తాం. కాలి నడకన కొండెక్కుతాం. గుంజీలు తీస్తాం. ఇంకెన్నో మొక్కులూ, ముడుపులూ చెల్లిస్తాం. కానీ ఆధ్యాత్మిక వేత్తలు ప్రబోధించిన భక్తి ఇందుకు భిన్నమైంది, మహోన్నతమైంది.

Updated : 03 Aug 2023 04:32 IST

దేవుడికి నమస్కరించినంతలో మనకు తృప్తి కలగదు. టెంకాయ కొడతాం. నైవేద్యం పెడతాం. కేశాలు అర్పిస్తాం. కాలి నడకన కొండెక్కుతాం. గుంజీలు తీస్తాం. ఇంకెన్నో మొక్కులూ, ముడుపులూ చెల్లిస్తాం. కానీ ఆధ్యాత్మిక వేత్తలు ప్రబోధించిన భక్తి ఇందుకు భిన్నమైంది, మహోన్నతమైంది.

‘సా తస్మిన్‌ పరమ ప్రేమరూపా’ అంటుంది నారద భక్తి సూత్రం. దైవం పట్ల లగ్నమైన చిత్త పరిపాకమే భక్తి. రాతిలో నిక్షిప్తమైన అగ్ని వ్యక్తం కావాలంటే రాపిడి అవసరం. మన అంతరంగంలో అంతర్గతంగా, అవ్యక్తంగా ఉన్న దైవస్వరూపం వ్యక్తం అయ్యేందుకు జపం, తపం, పూజ, భజన, ధ్యానం, జ్ఞానం లాంటివి సాధనాలు. ఇవన్నీ భక్తికి బాహ్య రూపాలు. రుషులు, సాధకులు, సిద్ధులు పరమాత్మను చేరుకోవడానికి అనేక మార్గాలు చూపారు. వాటిల్లో భక్తిమార్గం కూడా ఒకటి. ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు- అని భక్తులు నాలుగు విధాలు- అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు.

చతుర్విధా భజంతే మాం జనాః
సుకృతినోర్జునః ఆర్తోరర్థార్థి
జిజ్ఞాసో జ్ఞానీచ భరతర్షభా

కష్టం వచ్చినప్పుడు తలచుకునేవారొకరు, కావలసింది అడిగేవారొకరు, తెలుసుకోవాలి అనుకునేదొకరు, తెలుసుకున్నవారు మరొకరు. అందరూ భక్తులే. ఒక్కొక్కరిదీ ఒక్కో దారి.

అహంకారంతో, అధికార బలంతో పరివారాన్ని వెంటబెట్టుకొని సరస్సులో దిగిన గజేంద్రుడు మొసలికి పట్టుబడ్డాక నాదనుకున్న బలం సన్నగిల్లి, నావారనుకున్న బలగం దూరమైనప్పుడు ఆర్తితో భగవంతుని స్మరించాడు. అభిమానం వదలక, అహంకారం విడవక ‘కలడు కలండనువాడు కలడో లేడో’నన్న సందేహాస్పద మనసుతో పరమాత్మను పలకరించాడు. అయ్యవారు కూడా అమ్మవారితో చదరంగం ఆడుతూ కూర్చున్నాడే కానీ పట్టించు కోలేదు. శరీరంలో శక్తి ఉడిగి నేను అన్న అహం, నాది అన్న మమకారం రెండూ వదిలిపోయి ‘నీవే తప్ప ఇతః పరంబెరుంగన్‌.. రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!’ అని వేడుకున్నాడు. ‘అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ’ అంటూ గజేంద్రుడు శరణాగతితో ప్రార్థించగానే, భార్యకొంగు చేతిలో ఉందన్న స్పృహ అయినా లేకుండా ఆర్తుడైన భక్తుణ్ణి రక్షించడానికి పరిగెత్తుకు వచ్చాడు పరమాత్మ. ఇటువంటి పరిపూర్ణ ఆర్తే వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదిని కాపాడింది.

గోపికల మధురభక్తి

కొందరు రుషులు ఎవరికి వారే.. తమదే నిజమైన భక్తి అనుకుంటున్నారు. వారిలో అసలైన భక్తులెవరో తెలుసు కోవాలనుకున్న మిత్రునితో కృష్ణపరమాత్మ- తనకు తలనొప్పిగా ఉంది.. ఎవరైనా భక్తుడి పాదధూళిని తన శిరస్సుపై రాస్తే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది, పాదధూళి తీసుకు రమ్మన్నాడు. విషయం విని కృష్ణయ్య పరిస్థితికి తల్లడిల్లారే కానీ, పాపం తగులుతుందనే భయంతో ఒక్కరూ పాదధూళిని ఇవ్వలేదు. ఈసారి కృష్ణయ్య గోకులానికి కబురంపాడు. విషయం తెలుసుకున్న గోపికలు పరమాత్మ శిరస్సుపై పాద ధూళి ఉంచడం వల్ల తమకు శాశ్వత నరకం సంభవించినా సరే, కృష్ణయ్యకు శిరోభారం తగ్గడమే ముఖ్యమంటూ గుట్టలు గుట్టలుగా ధూళిని సేకరించి ఇచ్చారు. భగవంతుణ్ణి తమకు మేలుచేయమని కోరడం సాధారణ స్థాయి, ఆ స్వామి శ్రేయస్సు ఆశించడం మధురభక్తిలో అత్యున్నత స్థాయి. ఇక్కడ గోపిక అంటే గొల్లపడుచు కాదు, ఆధ్యాత్మిక చైతన్యానికి అర్రులు చాచిన భక్తునికి ప్రతీక.

భక్తి వ్యాపారం కాదు

ప్రయోజనాన్ని ఆశించి పరమాత్మను ఆశ్రయించేవాడు అర్థార్థుడు. తన ఆశ నెరవేరితే కానుక సమర్పిస్తాననే భావన అర్థార్థి లక్షణం. అది వ్యాపారమే కానీ భక్తి కాదు. అసలు భగవంతుణ్ణి ఏదైనా ఇవ్వమని ప్రార్థిస్తే అది మాత్రమే ఇస్తాడు. లేదంటే మనకు అవసరమైంది ఇస్తాడు. బహుశా దైవం ఇవ్వాలనుకున్నది మనం అడిగే దానికన్నా ఉన్నతమైంది కావచ్చు. సవతితల్లి తనను తండ్రి తొడపై కూర్చోనివ్వలేదన్న ఆర్తితో, కూర్చోవాలన్న కోరికతోనే సాధన ప్రారంభించాడు ధ్రువుడు. భగవంతుని ఆశ్రయించిన తర్వాత ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసినప్పుడు.. ఆ బాలుడికి తండ్రి ఒడినే కాదు, ఆకాశవీధిలో అత్యున్నత స్థానాన్ని ప్రసాదించాడు పరమాత్మ.

పరీక్షిత్తు జిజ్ఞాస

పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోవాలనే కోరికే జిజ్ఞాస. దాహార్తితో ఉన్న పరీక్షిత్తు సంయమనాన్ని కోల్పోయాడు. చచ్చిన పామును మెడలో వేసి తపోనిష్ఠలో ఉన్న శమీకుణ్ణి అవమానించాడు. తండ్రికి జరిగిన పరాభవానికి నొచ్చుకున్న శమీకుని కుమారుడు.. తన తండ్రిని అవమానించినవాడు ఏడు రోజుల్లో పాముకాటుతో మరణిస్తాడని శపించాడు. చావు తథ్యమని తెలుసుకున్న పరీక్షిత్తు జీవితాన్ని రక్షించుకునే ప్రయత్నం కాకుండా, సార్థకం చేసుకోవడం గురించి ఆలోచించాడు. శుకమహర్షిని ఆశ్రయించాడు. ‘మహర్షీ! నేను ఏడు రోజుల్లో చనిపోతానని బెంగలేదు. కానీ ఈ ఏడురోజుల్లో ఏది వింటే మళ్లీ చావాల్సిన అవసరం లేదో అది నాకు ప్రసాదించండి’ అంటూ వేడుకున్నాడు. అలా పరమాత్మ గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో, భాగవత శ్రవణం చేసి తనతోపాటు భవిష్యత్‌ తరాలకు కూడా ముక్తి మార్గాన్ని చూపిన పరీక్షిత్తు అసలుసిసలైన జిజ్ఞాసభక్తుడు.

భీష్ముడి భక్తి

అన్నీ తెలిసి అధర్మపక్షాన పోరాడిన వాడు భీష్ముడు. దుర్యోధనుడు తనను అనుమానించి, అవమానించాడన్న ఆవేశంతో ఆప్తులైన పాండవ సైన్యాన్ని అల్లకల్లోలపరిచాడు. ఆయుధం చేత పట్టనని మాటిచ్చిన పరమాత్మచేత కూడా ఆయుధం పట్టించాడు. ధర్మపరిరక్షణ కోసం ఇచ్చిన మాటను త్యజించి తనపైకి లంఘించి వస్తున్న జగన్నాథుని శరణువేడి మనఃపూర్వకంగా మృత్యువును ఆహ్వానించిన భీష్మ పితామహుడు జ్ఞానభక్తుడు. వామనరూపంలో ఉన్నది మహావిష్ణువని గురువు చెప్పినప్పటికీ, మూడో అడుగు తలపై పడుతుందనీ, దానివల్ల తన అస్తిత్వం ప్రశ్నార్థకమవుతుందని తెలిసినప్పటికీ ఇచ్చిన మాటకోసం తనను తాను పరమాత్మకు సమర్పించు కున్న జ్ఞానభక్తుడు బలి చక్రవర్తి. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆర్తి అర్థార్థిగా, అర్థార్థి జిజ్ఞాసిగా, జిజ్ఞాసి జ్ఞానిగా క్రమపరిణామం చెందే స్థితి మనకు కనిపిస్తుంది. ఈ చతుర్విధ భక్తులు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన- ఇలా నవవిధ భక్తిమార్గాల్లో దేని ద్వారానైనా పరమాత్మను చేరవచ్చు.

డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వర రావు, త్రిపురాంతకం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని