శ్రీకృష్ణాయనమః

పరబ్రహ్మ, పరమేశ్వర, శ్రీమహావిష్ణువుల పూర్ణావతారం శ్రీకృష్ణుడు. ఆయన పరమయోగీశ్వరుడు.. అంతర్యామి.

Published : 17 Aug 2023 00:07 IST

రబ్రహ్మ, పరమేశ్వర, శ్రీమహావిష్ణువుల పూర్ణావతారం శ్రీకృష్ణుడు. ఆయన పరమయోగీశ్వరుడు.. అంతర్యామి. అందుకే గోపికలు పనులన్నీ వదిలి కృష్ణుని ఆశ్రయించడం, కృష్ణుడి రూపమాధుర్యంతో పాటు వేణు గానామృతాన్ని భగవద్గీతలో చూస్తాం. ‘శోకగ్రస్తులైన కలియుగ ప్రజలు పరబ్రహ్మ దగ్గరకు వెళ్లే శక్తి లేదు, కరుణామయుడైన భగవంతుడే దివి నుంచి భువికి దిగివచ్చి యమునాతీర బృందావనంలో మురళీగానంతో పిలుస్తున్నాడు, ఆ వేణుగోపాలుడే పరబ్రహ్మ స్వరూపం అని భాగవతం పేర్కొంది.

శాంతి, దాస్య, సఖ్య, వాత్సల్య, మాధుర్య రసాల మేలు కలయిక అయిన భాగవత కథలు విన్నవారికి మేలు కలుగుతుంది. విశుద్ధ ప్రేమను కృష్ణుడికి సమర్పిస్తే దుఃఖాలు తొలగి ఆనందప్రాప్తి, సంతృప్తీ కలుగుతాయి.

కృష్ణుడు మోక్షప్రదాత. పసికందుగా ఉన్న తనకు విషపూరిత చనుబాలనిచ్చి తనను చంపబోయిన పూతనకు కూడా మోక్షం ప్రసాదించాడు. కృష్ణుడి చేతిలో హతులైన శిశుపాల, బకాసుర, ధేనుకాసుర, తృణావర్త, శకటాసుర.. తదితరులందరూ మోక్షం పొందారు. భీష్మాచార్యుడు తాను చనిపోవాలనుకున్న రోజున విష్ణు సహస్ర నామావళి పారాయణ చేసి మోక్షం పొందాడు. కృష్ణుడి స్నేహారాధన కారణంగా రుక్మిణి, అర్జునుడు, విదురుడు, అక్రూరుడు, కుచేలుడు, ఉద్ధవుడు తదితరులతో పాటు గోపగోపికలు, నందుడు, యశోదలు మోక్షం పొంది జీవన్ముక్తులయ్యారు. ఆయన సర్వాంతర్యామి. అన్నింటా వ్యాపించి ఉన్నాడు. అన్నీ ఆయనలో ఇమిడి ఉన్నాయి. రాధావల్లభుడు శాంతికాముకుడు. ధర్మంవైపే మొగ్గు చూపాడు. కానీ ధర్మ రక్షణార్థం యుద్ధానికి వెనుకాడలేదు. కృష్ణుడి మాటలు చేతలు సార్వకాలికాలు, సార్వదేశికాలు. వాటిలో ప్రపంచ కల్యాణమార్గం నిర్దేశితమైంది. శ్రీకృష్ణుణ్ణి అనుసరించేవారు సుఖశాంతులతో జీవిస్తారనడంలో అతిశయం లేదు. తనను ఆశ్రయించినవారికి ఆనందాన్ని ప్రసాదిస్తాడు కృష్ణపరమాత్ముడు.

బాలకుమారి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని