గర్భస్థ శిశువు నుంచి.. మోక్ష సాధన వరకూ..

నిర్వేదంలో మునిగిన అర్జునుడికి గీతోపదేశం చేసి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు కృష్ణపరమాత్ముడు. యుద్ధంలో విజయం సాధించినా.. బంధువులను కోల్పోవడం, రాజ్యస్థాపన, పనిభారం లాంటి దుఃఖాల వల్ల గీతలోని అంశాలు అంతగా గుర్తులేవు. అవన్నీ మరోసారి వినాలనే కుతూహలం కలిగింది. ఈసారి ‘అనుగీత’గా వివరించాడు జగన్నాథుడు.

Published : 16 Nov 2023 05:03 IST

నిర్వేదంలో మునిగిన అర్జునుడికి గీతోపదేశం చేసి కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు కృష్ణపరమాత్ముడు. యుద్ధంలో విజయం సాధించినా.. బంధువులను కోల్పోవడం, రాజ్యస్థాపన, పనిభారం లాంటి దుఃఖాల వల్ల గీతలోని అంశాలు అంతగా గుర్తులేవు. అవన్నీ మరోసారి వినాలనే కుతూహలం కలిగింది. ఈసారి ‘అనుగీత’గా వివరించాడు జగన్నాథుడు.

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. అశ్వమేధం కూడా పూర్తయింది. కృష్ణయ్య హస్తినకు వచ్చి నెలలు గడుస్తున్నాయి. ద్వారకలో నందుడు, యశోదమ్మ, మిత్రులు, గోపికలు- అందరి ఎదురుచూపులూ కన్నయ్య కోసమే. నల్లనయ్యకూ వారిని చూడాలనే ఉంది. ఎట్టకేలకు కృష్ణుడి ద్వారకా ప్రయాణానికి ధర్మజుడి నుంచి అనుమతి దొరికింది.

‘కృష్ణా! నేను కురుక్షేత్ర యుద్ధ సమయంలో నిరాశ నిస్పృహలకు లోనైనప్పుడు నా మనసు కలత తీరే విధంగా నువ్వు ఎన్నో గొప్ప మాటలు చెప్పావు! కానీ వాటిని మనసులో స్థిరం చేసుకోలేకపోయాను. దయచేసి మరోసారి వివరించ’మని అడిగాడు అర్జునుడు.
వేదాంత భావన అసలు స్వరూపాన్ని గుర్తించలేక.. తనకు రాజ్యమూ వద్దు, రాజ్యసుఖమూ వద్దు- అంటూ విషాదంలో మునిగాడు అర్జునుడు. అప్పుడు గీతోపదేశంతో కర్తవ్యం బోధించి, కర్తవ్యోన్ముఖుణ్ణి చేశాడు కృష్ణపరమాత్ముడు. అప్పటి అర్జునుడి మానసిక స్థితి, స్త్రీల శోకం, ధర్మరాజు నిర్వేదం, రాజ్యస్థాపన వంటి కారణాలతో కృష్ణుడు ప్రబోధించిన తత్వం లీలామాత్రంగానే గుర్తుంది. ప్రస్తుతం కలత తీరి ప్రశాంతంగా ఉన్న అర్జునుడికి ఆ విషయాలన్నీ మళ్లీ ఒకసారి తెలుసుకుందాం- అనిపించింది.

మిత్రరూపంలో ఉన్న పరమాత్ముడు.. నవ్వుతూ ఒక చేత్తో అర్జునుని కౌగిలించుకొని ‘నీకు బుద్ధి, శ్రద్ధా రెండు లేకుండా పోయాయి’ అంటూ ప్రేమగా మందలించాడు. ‘అర్జునా! ఆరోజు నీకు చెప్పిన వాక్యాలు ముక్తిసాధకాలు. అప్పటి నా మాటలు అవసరాన్ని బట్టి తమంత తాముగా వెలువడ్డవి’ అంటూ గీతాసారంగా కాశ్యపుడనే రుషికీ, ఒక సిద్ధునికీ మధ్య జరిగిన సంభాషణను వివరించాడు. అదే ‘అనుగీత’ పేరుతో ప్రసిద్ధి పొందింది. అనుగీత అంటే గీతను అనుసరించి వచ్చిందని భావం. ఇందులో కాశ్యప సిద్ధుల సంభాషణా రూపంలో- శరీర పోషణ, మనసును నిలకడగా ఉంచుకోవడం, ఆత్మ స్వరూపం, పరతత్వ సాధన మొదలైన అనేక విషయాలను అనుగీత బోధిస్తుంది.

శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తే..

‘ధర్మసాధనంబు తనువు’ అన్నారు. ఏ ధర్మాన్ని సాధించాలన్నా శరీరం ప్రధాన సాధనం. మోక్షం శారీరకమైంది కాకపోయినా దాన్ని సాధించటానికి శరీరం అవసరం. దేహం ఆరోగ్యంగా ఉంటే మనసు, వాక్కు రెండూ నియంత్రణలో ఉంటాయి. ఈ మూడూ కలిస్తేనే త్రికరణ శుద్ధి, యోగసిద్ధి. ఇది మోక్షానికి మార్గం. కాబట్టి వీటన్నిటికీ మూలమైన శరీరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్‌’ అని కదా ఆర్యోక్తి. అంటే ఏ ధర్మాన్ని సాధించాలన్నా ముందుగా శరీరాన్ని జాగ్రత్తగా పరిరక్షించుకోవాలి అని అర్థం. శరీర పోషణ, మనసు నిలకడగా ఉంచుకోవడం, ఆత్మ స్వరూపం, పరతత్వ సాధన ఈ నాలుగూ జీవితంలో క్రమంగా సాధించవలసిన అంశాలు. వాటిని ఎలా సాధించాలో అనుగీత చెబుతుంది. అందువల్ల మోక్షసాధనలో శరీర ప్రాధాన్యాన్ని అశ్రద్ధ చేస్తే వచ్చే అనర్థాలను విపులంగా వివరించింది అనుగీత. ఒక వ్యక్తి అత్యుత్సాహంతో తన స్థాయికి మించి కానీ, అలసత్వంతో తన స్థాయికి తగ్గి కానీ ప్రవర్తించకూడదు. శరీర పోషణకు ఎంతో ముఖ్యమైన ఆహార స్వీకరణలో కూడా స్థాయి, కాలం, గుణాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఎవరికి వారు తమ శరీరం- వాత, పిత్త, కఫ ప్రకృతుల్లో ఏదో గుర్తించి.. దానికి అనుగుణమైన ఆహారం తీసుకోవాలి. అందుకు విరుద్ధమైన ఆహారం తీసుకోవడం, అతిగా తినడం, సమయానికి తినకపోవడం- ఈ మూడింటిపై ఎవరు శ్రద్ధ పెట్టరో.. వారికి ఆహారమే శత్రువు అవుతుంది. రుతుచర్యను (రుతువును బట్టి జీవనశైలి) పాటించని శరీరంలో త్రిదోషాలు (వాత, పిత్త, కఫ) విజృంభించి ఆయా భాగాలను దెబ్బతీస్తాయి. ఆ బాధను కొంతకాలం భరించి నప్పటికీ శరీరం రోగగ్రస్తంగానే జీవిస్తుంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేని నాడు శరీరంలోని ప్రాణ శక్తులు తమ తమ స్థానాల్ని విడిచిపెట్టి వెళ్లిపోతాయి. అదే మరణమంటే! ఇలా త్రివిధ దోషాలు, ఒక్కొక్కదాని లక్షణం, అది విజృంభించినప్పుడు శరీరంలో వచ్చే మార్పులు, దాని పర్యవసానాలు తదితర అంశాలతో ముక్తికి మూలమైన శరీర తత్వాన్ని విస్పష్టం చేస్తుంది అనుగీత.

ఊర్ధ్వ లోకాల వివరణ

జీవులు తమ తమ కర్మల వల్ల స్వర్గ నరకాలను పొందుతారు. పాపం చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం ప్రాప్తిస్తాయి. అంతేతప్ప ఎవరూ కూడా ఎలాంటి బాదరబందీ లేకుండా మోక్షాన్ని పొందలేరు. స్వర్గనరకాలు అంతర్దశలే తప్ప అంతిమ లక్ష్యం కాదంటుంది అనుగీత. బృహస్పతి మొదలైన దేవగురువుల్లో కూడా రాగద్వేషాలు కనిపిస్తాయి. స్వర్గాన్ని చేరిన తర్వాత కూడా ధర్మరాజు మనసులో తన, పర భేదం ఉండిపోయి ముక్తికి దూరమవుతాడు. ఈ బంధాలన్నీ వదిలించుకునే ప్రయత్నంలో ధర్మరాజు ఆకాశగంగలో మునిగి, తపస్సుతో రాగద్వేషాది ద్వంద్వాలను వదిలించుకుని, ముక్తిని పొందినట్లుగా మహాభారత కథను ముగించాడు వ్యాసుడు.
స్వర్గ నరకాలతో పాటు చంద్రలోకం, సూర్యలోకం, నక్షత్ర లోకం- లాంటి మరికొన్ని ఊర్ధ్వలోకాలు, అక్కడి మంచిచెడులు, స్థితిగతులు, రాగద్వేషాలను అనుగీత వివరించింది. ప్రాణులకు సంబంధించిన శుక్లశోణిత సంయోగం, గర్భధారణ, ప్రాణశక్తి ప్రవేశం, పిండవృద్ధి, అవయవ ఆవిర్భావం, ప్రాణి పుట్టుక, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల్లో నిర్వహించాల్సిన విధులు, యోగ సాధన, ఆత్మతత్వం, మోక్ష సాధనల వివరణ ఉంది. అలాగే సంయమి, సమదర్శి, ఆత్మజ్ఞాని ఈ ముగ్గురూ మోక్ష సాధకులంటూ వారి లక్షణాలను తెలియజేసింది. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు సంయమి. అన్ని ప్రాణులను సమానమైన దృష్టితో చూసేవాడు సమదర్శి. తన స్వరూపాన్ని పరమాత్మ అంశగా తనను తాను తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని.

గీతా సారానికి సారూప్య కథారూపం

కాశ్యపుడి ప్రార్థన మేరకు సిద్ధుడు ఆత్మ స్వరూపాన్ని వివరిస్తూ ఉపనయన సమయంలో వటువుకు మొలతాడుగా వాడే ముంజగడ్డిలోని అతి సన్నటి పొరతో పోల్చి చెప్పాడు. వడ్లగింజ మొనలాగా అత్యంత సూక్ష్మంగా, బంగారు వర్ణంలో ప్రకాశించే ఆత్మ స్వరూపాన్ని దర్శించడానికి నిశిత పరిశీలన, నిశ్చల మనసు, దాని పట్ల ధ్యాస అవసరం. అవి ధ్యానం ద్వారా సాధ్యమవుతాయి. అందుకే ‘ధ్యాసే ధ్యానం’ అన్నారు జిల్లెళ్లమూడి అమ్మ. పరమాత్మ స్వరూపాన్ని వివరించే లలితా సహస్రనామం కూడా అమ్మవారిని ‘ధ్యానగమ్యా’ అని పేర్కొంది.

వీటితోపాటు అహింసా స్వరూపం, అక్షర స్వరూపం, వాక్కు స్వరూపం, పంచప్రాణాల తగాదా, మనసు-ఇంద్రియాల తగాదా- ఇలా అనేక విషయాల్ని విపులంగా బోధించింది అనుగీత. ‘భగవద్గీతను భారతీయ తాత్త్విక వేదాంత క్షీరసాగరం’ అన్నారు పెద్దలు. ఆ గీతా సారానికి సారూప్య కథారూపం అనుగీత.

డా.ఎస్‌.ఎల్‌.వి.ఉమామహేశ్వరరావు, త్రిపురాంతకం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని