దేవుడిచ్చిన యోగ్యతాపత్రం

యోబు అనే భక్తుడికి దేవుడు- ‘ఇతడు సత్యవంతుడు, న్యాయవంతుడు, భక్తి కలిగి, చెడు వైపు చూడనివాడు’ అంటూ (యోబు 1:8) యోగ్యతాపత్రం ఇచ్చాడు. భక్తులను ప్రలోభపెట్టి పెడ తోవ పట్టించే సాతానుకు అది నచ్చలేదు.

Published : 07 Dec 2023 00:07 IST

యోబు అనే భక్తుడికి దేవుడు- ‘ఇతడు సత్యవంతుడు, న్యాయవంతుడు, భక్తి కలిగి, చెడు వైపు చూడనివాడు’ అంటూ (యోబు 1:8) యోగ్యతాపత్రం ఇచ్చాడు. భక్తులను ప్రలోభపెట్టి పెడ తోవ పట్టించే సాతానుకు అది నచ్చలేదు. అతడు దైవం వద్దకు వెళ్లినప్పుడు.. ‘పాపాలకు దూరంగా ఉండే యోబును గమనించావా?’ అనడిగాడు దేవుడు. ‘అతడికి ఆస్తులు, అనుకూలమైన భార్యాబిడ్డలను అనుగ్రహించావు. నిన్నెలా మర్చిపోతాడు?’ అంది సాతాను.

దేవుడి అనుమతితో అతడి సర్వస్వాన్నీ నాశనం చేసింది సాతాను. ఇంత జరిగినా ప్రశాంతతను కోల్పోక.. ‘దేవుడే ఇచ్చాడు, తనే తీసుకున్నాడు’ అన్నాడు యోబు. కానీ తన ఓటమిని అంగీకరించడం ఇష్టంలేని సాతాను.. ‘అతని దేహాన్ని కాపాడుతున్నావు. ఎలాంటి అనారోగ్యం లేనప్పుడు.. ఇక నిన్నెందుకు విస్మరిస్తాడు?’ అంది దేవుడితో. ‘సరే, ప్రాణ హాని తప్ప మరేదైనా కలిగించు’ అంటూ మరోసారి అనుమతించాడు దేవుడు. యోబుకు ఒళ్లంతా కురుపులతో దుర్భర బాధ కలిగించింది సాతాను. అది చూసిన భార్య ‘ఇప్పటికైనా దేవుణ్ణి దూషించు’ అంది. కానీ యోబు- అలా మూర్ఖంగా మాట్లాడకూడదు అన్నాడే గానీ.. దైవాన్ని సందేహించలేదు.

మనల్ని నిందారహితులుగా, పవిత్రంగా చూడాలన్నదే దేవుడి వాంఛ. ఎప్పుడూ అదే చెప్పేవాడు. తన మధురవాక్కుతో మనల్ని నీతిమంతులుగా చేయాలనుకునేవాడు.

యోబుది గొప్ప అదృష్టం! మనం కూడా అలాంటి యోగ్యతాపత్రం పొందేందుకు ప్రయత్నిద్దామా!

పి.అవనీశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని