పరమశివుడి అనుమతి

సీతాపహరణం తర్వాత రామలక్ష్మణులు దండకారణ్యంలో సంచరిస్తుంటే.. వాళ్లకో మనోహరమైన ప్రాంతం కనిపించింది. సీతమ్మవారి జాడ తెలిసేవరకూ అక్కడే నివసించాలనుకున్నాడు శ్రీరాముడు. అతడి సంకల్పాన్ని బలపరిచాడు లక్ష్మణుడు.

Published : 07 Dec 2023 00:13 IST

సీతాపహరణం తర్వాత రామలక్ష్మణులు దండకారణ్యంలో సంచరిస్తుంటే.. వాళ్లకో మనోహరమైన ప్రాంతం కనిపించింది. సీతమ్మవారి జాడ తెలిసేవరకూ అక్కడే నివసించాలనుకున్నాడు శ్రీరాముడు. అతడి సంకల్పాన్ని బలపరిచాడు లక్ష్మణుడు. ‘సోదరా! నాతో ఏకీభవించినందుకు సంతోషం. అయితే ఇదెవరిదో తెలుసుకోవాలి. వారి అనుమతి లేకుండా ఉండటం భావ్యం కాదు కదా! కనుక చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూడు, వారితో మాట్లాడుదాం’ అన్నాడు రాముడు. వెంటనే లక్ష్మణుడు పరిసరాలను పరిశీలిస్తూ కొంత దూరం వెళ్లగా.. ఉసిరి, మారేడు చెట్ల మధ్యన శివాలయం కనిపించింది. కానీ అక్కడెవరూ లేరు.

తిరిగొచ్చి సంగతి తెలియజేశాడు. ‘అయితే ఈ ప్రాంతానికి పరమ శివుడే అధిపతి అయ్యుంటాడు. ఆయన అనుమతి తీసుకో లక్ష్మణా’ అన్నాడు రాముడు. లక్ష్మణుడు శివాలయం వద్దకు వెళ్లి, శివుడి ఆజ్ఞకై అర్థించాడు. వెంటనే శివలింగం నుంచి ఉజ్వలంగా ఉన్న మూర్తి వెలువడి, అద్భుతంగా నృత్యం చేసి అదృశ్యమైంది. అలా ఎందుకు జరిగిందో, దాని భావం ఏమిటో లక్ష్మణుడికి అర్థం కాలేదు. సోదరుడి వద్దకు వచ్చి విషయం చెప్పాడు. రాముడు చిన్నగా నవ్వి.. ‘సోదరా! శివుడి ఆజ్ఞ లభించింది! కుటీరం నిర్మించు’ అన్నాడు.

‘ఆజ్ఞ ఎప్పుడు లభించింది?’ ఆశ్చర్యంగా అడిగాడు లక్ష్మణుడు.

‘లక్ష్మణా! మితిమీరిన స్వార్థం, జిహ్వ చాపల్యం, కామ వికారాలే కష్టాలకు మూలం. వీటిని గనుక నియంత్రించుకోగలిగితే.. ఇక్కడే కాదు- ఎక్కడైనా సుఖంగా జీవించవచ్చు! ఈ మూడింటినీ మనం నిగ్రహించుకోగలమని పరమశివుడు గ్రహించాడు. కనుకనే నృత్య భంగిమలో దర్శనమిచ్చి తన అంగీకారాన్ని తెలియజేశాడు’ అంటూ వివరించాడు శ్రీరాముడు.          

చోడిశెట్టి శ్రీనివాసరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని