అవధూత.. అనంత జ్ఞానప్రదాత

గురు తత్త్వం, దైవత్వం కలిసిన అరుదైన అవతారమూర్తి దత్తాత్రేయస్వామి. ఆయనను నమ్ముకుంటే గురువు, దైవం ఇద్దరూ అనుగ్రహించినట్లే. తపశ్శక్తికి ప్రతీక అత్రి మహర్షి, అసూయకు తావులేని సాధ్వీమణి అనసూయ.

Updated : 21 Dec 2023 04:21 IST

డిసెంబరు 26 శ్రీదత్త జయంతి

గురు తత్త్వం, దైవత్వం కలిసిన అరుదైన అవతారమూర్తి దత్తాత్రేయస్వామి. ఆయనను నమ్ముకుంటే గురువు, దైవం ఇద్దరూ అనుగ్రహించినట్లే. తపశ్శక్తికి ప్రతీక అత్రి మహర్షి, అసూయకు తావులేని సాధ్వీమణి అనసూయ. అలాంటి పుణ్య దంపతులకు కుమారుడై జన్మించాడు దత్తాత్రేయుడు. భగవంతుడి అంశతో పిల్లలు పుట్టాలంటే, తల్లిదండ్రులు ఎంత పుణ్యమూర్తులై ఉండాలో నిరూపించాడు. ధర్మబద్ధంగా జీవిస్తూ.. లౌకికమైన కోరికలు కోరుకునే వారికి, అవి తీరుస్తూనే, వారిని యోగమార్గంలోకి మరల్చే విశ్వగురు రూపం దత్తాత్రేయ స్వామి. బాల్యం నుంచే దత్తుడు లోకోత్తరమైన లీలల్ని ప్రదర్శిస్తూ, అశేష ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, ఎందరో మహర్షులకు యోగవిద్యను నేర్పిస్తూ ఉండేవాడు. కపిలుడిగా అవతరించినప్పుడు తల్లి దేవహూతికి  ఆత్మబోధ చేసినట్లే, దత్తాత్రేయుడిగా అవతరించినప్పుడు కూడా మాతృమూర్తి అనసూయకు ఆత్మవిద్యను ప్రబోధించాడు. లోకానికి తపస్సు, ఆధ్యాత్మిక సాధనల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు సహ్యాద్రి గుహల్లో తపస్సు ఆచరించాడు.

ఆ రూపం అపురూపం

దత్తాత్రేయుని రూపం అపురూపమైంది. అది సచ్చిదానంద రూపం. జడలు కట్టడం, పులిచర్మాన్ని ధరించటం వైరాగ్యం, తపస్సు, ధ్యానాలకు గుర్తు. భూమాతకు, ధర్మానికి ప్రతీక అయిన గోవు ఆయనను వెన్నంటే ఉంటుంది. అంటే దత్తాత్రేయుడు ధర్మరక్షకుడని, గోరక్షకుడని తేటతెల్లమవుతుంది. వారి వెంట ఉండే నాలుగు శునకాలు చతుర్వేదాలకు నిదర్శనం. అలాగే స్వామి భస్మధారణ నిరాడంబరత్వానికి, అక్షమాల భగవన్నామ జప ప్రాధాన్యానికి చిహ్నాలు. అందుకే ఆ దివ్యమూర్తిని మన మహర్షులు, భక్తులు..

సత్యరూప సదాచార సత్యధర్మ పరాయణ
సత్యాశ్రయ పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే

అంటూ నీరాజనాలు అర్పించారు. సకల ధర్మాలూ అడుగంటిపోయి, ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి ఆవరించిన కలియుగంలో దత్తాత్రేయుని ఆశ్రయించి శరణు వేడటమే కర్తవ్యమని గ్రహిస్తారు.

ఎందరికో వరప్రదాత

పురాణ కథను అనుసరించి.. ఒకసారి చతుర్ముఖ బ్రహ్మ వేదాలను మర్చిపోతే దత్తాత్రేయుడే ఆయనకు వేదదానం చేశాడు. మరొకప్పుడు జంభాసురుడనే రాక్షసుడి బాధ నుంచి దేవతలను ఆ స్వామే రక్షించాడు. కార్తవీర్యార్జునుడు దత్తుడి కోసం తపస్సు చేసి.. వెయ్యి చేతులు, నిత్యయౌవనం వరాలుగా పొందాడు. అదే విధంగా ప్రహ్లాదుడికి ముని రూపంలో ప్రత్యక్షమై ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఇలా అనంత కరుణాసముద్రుడై భక్తులకు జ్ఞానం, ఆనందం ప్రసాదించిందే దత్తాత్రేయ అవతారం. అందుకే అన్నమయ్య కూడా తిరుమల కొండపై ఏడుకొండల స్వామిలో దత్తాత్రేయుని దర్శించుకుని, కీర్తనలతో స్తుతించాడు.

దత్తుడి అవతారాలు

భారతావనిలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో దత్త సంప్రదాయం ఘనంగా ఉంది. దత్తాత్రేయుని మొదటి అవతారమైన శ్రీపాద వల్లభుడు పిఠాపురంలో ఆవిర్భవించటం ఈ నేల చేసుకున్న పుణ్యం. మనుషుల్లో పేరుకుపోయిన అజ్ఞానాన్ని, మనోమాలిన్యాలను, తన స్మరణ మాత్రం చేత తొలగించి, పునీతులను చేసే పుణ్యమూర్తి శ్రీవల్లభుడు. దత్తాత్రేయుని రెండో అవతారం శ్రీనరసింహ సరస్వతి. అంబ అనే భక్తురాలికి కుమారుడిగా ఆవిర్భవించిన రూపమిది. ఆ మహానుభావుడి మూడో అవతారం  మాణిక్‌ ప్రభు. దత్తుడి మరో రెండు అవతారాలు అక్కల్‌కోట మహారాజు, శిరిడీ సాయిబాబా. ఈ రెండు అవతారాల నుంచే దత్తావతారులు అవధూత  మార్గాన్ని అనుసరించటం ఆరంభమైంది. అవధూత అంటే శరీరం మీద ఆచ్ఛాదనతో సహా లౌకిక బంధాలన్నీ వదిలిన సన్యాసి. అందుకే వీరి తల్లిదండ్రుల వివరాలు, పుట్టిన తేదీ, ప్రదేశం తదితర వివరాలు అలభ్యం. ఇది దత్తాత్రేయస్వామి అవతార లీల. చివరికి వీరి పేర్లు కూడా ఇతరులు పెట్టినవే! ఉదాహరణకు శిరిడీ సాయిబాబా. మహారాష్ట్రలోని శిరిడీలో ముస్లిం వేషధారణతో.. పెళ్లివారితో పాటు బండి దిగిన వ్యక్తిని చూసి, అక్కడి ఖండోబా ఆలయ పూజారి ‘ఆవో సాయీ’ అని స్వాగతం పలికాడు. ఆ విధంగా సాయిబాబా ఈ లోకానికి పరిచయమై పూజలందుకుంటున్నారు.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని