మనసులో పూజించినా మహత్తరమే!

ఓ రైతు తన జాతకచక్రాన్ని జ్యోతిష్యుడికి చూపాడు. జాతకం ప్రకారం ఆ రాత్రి ఎనిమిదింటికి రైతు చనిపోవాల్సి ఉంది. ఆ చేదు నిజాన్ని చెప్పలేక మర్నాడు రమ్మన్నాడు. జ్యోతిష్యుడి ఇంటి నుంచి రైతు తన ఊరికి బయల్దేరాడు. ఇంతలో ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. దాంతో దగ్గర్లో ఉన్న పాడుబడిన శివాలయంలోకి పరుగెత్తాడు.

Published : 11 Jan 2024 00:11 IST

రైతు తన జాతకచక్రాన్ని జ్యోతిష్యుడికి చూపాడు. జాతకం ప్రకారం ఆ రాత్రి ఎనిమిదింటికి రైతు చనిపోవాల్సి ఉంది. ఆ చేదు నిజాన్ని చెప్పలేక మర్నాడు రమ్మన్నాడు. జ్యోతిష్యుడి ఇంటి నుంచి రైతు తన ఊరికి బయల్దేరాడు. ఇంతలో ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. దాంతో దగ్గర్లో ఉన్న పాడుబడిన శివాలయంలోకి పరుగెత్తాడు. కోవెలలో చెట్లూచేమలు పెరిగాయి. సాలీడులు గూళ్లు కట్టాయి. భక్తుల నిరాదరణతో శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని ఎలా పునరుద్ధరించాలా అని మనసులోనే పరిపరి విధాల ఆలోచించసాగాడు. ‘అయ్యో! నా దగ్గరే ధనముంటే ఈ ఆలయాన్ని ఇలా ఉండనిస్తానా! గోపురంపై కలశాన్ని ప్రతిష్ఠించే వాణ్ణి. ఆలయంలో నిత్యపూజలు, కుంభాభిషేకం లాంటి ఉత్సవాలూ నిర్వహించేవాణ్ణి. భక్తులకు సకల ఏర్పాట్లూ చేసేవాణ్ణి’ అనుకుంటూ పైకప్పు వంక చూస్తే.. పగిలిన రాళ్ల మధ్య నల్లతాచు ఉంది. రైతు భయంతో బయటకు వచ్చాడో లేదో.. వానకు నానిన పైకప్పు పడిపోయింది. అతడికి రెండు విధాలుగా ప్రాణాపాయం తప్పింది. మర్నాడు తన వద్దకు వచ్చిన రైతును చూసి జ్యోతిష్యుడు ఆశ్చర్యపోయాడు. తన లెక్క తప్పిందేమోనని మరోసారి పరిశీలిస్తే.. రైతు మరణం అనివార్యమని, శివాలయ నిర్మాణ పుణ్యం తోడైతే తప్ప, అతడు మృత్యువు నుంచి తప్పించుకోలేడని స్పష్టమైంది. రైతును అడిగితే.. జరిగినదంతా చెప్పాడు. అతడు ఆలయం గురించి చేసిన ఆలోచనే మహా పూజగా పుణ్యఫలాన్ని ప్రసాదించిందని జ్యోతిష్యుడికి అర్థమైంది.

శైవ సాధువులైన అరవై ముగ్గురు నయనార్‌లలో ఒకరైన పుసలార్‌ నయనార్‌ జీవితచరిత్రలోని ఈ రైతు ఉదంతం హిందూధర్మంలో ప్రస్తావించే మానసపూజ విశిష్టతకు తార్కాణం.

చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని