Updated : 12 Aug 2021 03:39 IST

నైతిక విలువలతోనే మనశ్శాంతి

భోగభాగ్యాల కంటే ప్రశాంతత ముఖ్యం. అందుకు నిదర్శనంగా పాత నిబంధనలోని (ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌) దావీదు జీవితాన్ని గుర్తుచేసుకుందాం..
గొర్రెల కాపరిగా ఉన్న దావీదు కొన్నాళ్లకు దైవ నిర్ణయం మేరకు ఇజ్రాయిల్‌ రాజయ్యాడు. యుద్ధ వీరుడిగా, సంకీర్తనకారుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఒకరోజు రాజభవనంలో నిలబడి వుండగా కింద సైనికుడి నివాసంలో స్నానం చేస్తున్న అతడి అందమైన భార్యను చూసి మోహావేశానికి గురయ్యాడు. ఆమెని తన భవనానికి తెచ్చుకున్నాడు. సైనికాధికారికి చెప్పి తాను ఇష్టపడిన స్త్రీ భర్త యుద్ధంలో ముఖ్యుడు కాకున్నా, అతన్ని సైన్యంలో ముందు వరుసలో నిలబెట్టించి, మరణించేలా చేశాడు.
అపరాధభావం దావీదును దహించింది. మానసిక వేదనకు గురయ్యాడు. అప్పట్నుంచీ ఆమెతో సుఖం అనుభూతికి రాలేదు. పశ్చాత్తాపంతో మనసులోని ఆవేదనను పాటగా రాసి ప్రభువుకు నివేదించాడు. ‘దేవా! నా హృదయాన్ని పరిశుద్ధం చెయ్యి! చంచల స్వభావాన్ని తొలగించి, స్థిరమైన మనసును ప్రసాదించు’ అని ఆక్రోశించాడు. నీతివంతమైన స్వచ్ఛమైన ఆనందం కావాలంటూ ఆవేదన చెందాడు. ‘పరిహారంగా జంతు బలులను నువ్వు ఆశించవు. పశ్చాత్తాపంతో తునాతునకలైన హృదయమే నీకు అర్పిస్తున్నాను’ అంటూ భావోద్వేగంతో ప్రార్థించాడు. తన మనస్తాపమంతా దేవుడి సన్నిధిలో కుమ్మరించాడు. ఇక తర్వాత ఏ పాపం చేయకుండా నీతిగా జీవించాడు.
అప్పటికే భార్యా పిల్లలున్న దావీదు రాజు తాను చేసిన తప్పు వల్ల మనశ్శాంతిని కోల్పోవడమే కాకుండా, కుటుంబపరంగా ఎన్నో కష్టాల పాలయ్యాడు. కన్న కొడుకే రాజ్యం కోసం తండ్రిని చంపాలని చూశాడు. ఈ అనుభవాల నేపథ్యంలో మరో కీర్తనలో ‘పక్షిలాగా నాకు రెక్కలుంటే ఎంత బాగుండేది.. గువ్వలా ఎగిరిపోయి, ఆకాశంలో శాంతంగా ఉందునే’ అని వేదన చెందాడు. భౌతిక బాధలే కాదు, ఆధ్యాత్మిక మార్గనిర్దేశం లేదని చింతిస్తూ- ‘దేవుడే నాకు కాపరిగా ఉంటే ఎంత సంతోషమో కదా.. హాయిగొలిపే పచ్చిక బయళ్ల్లలో విశ్రాంతి నిస్తాడు, జలాశయాల దగ్గర సేదదీరుస్తాడు, నీతి మార్గాన్ని నిర్దేశిస్తాడు’ అంటాడు. దేశానికి రాజు అయ్యుండి, సిరి సంపదలూ పేరు ప్రతిష్టలూ ఉన్నప్పటికీ మనశ్శాంతి కోసం తపించాడు. నైతిక విలువలు ముఖ్యమంటూ హితవు చెప్పాడు.

- రూఫస్‌ కొలికపూడి
 


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని