వెయ్యేళ్ల నాటి ఆలయం

అర్ధాయువుతో జన్మించిన మార్కండేయుడు గోదావరి తీరంలో పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి ఆయనలో ఐక్యమయ్యాడు. అక్కడ వెలసిందే మార్కండేయస్వామి ఆలయం. ఇది దక్షిణ కాశీగా పేరొందిన రాజమహేంద్రవరంలో ఉంది. పురాణకథను అనుసరించి.. పూర్వం మార్కొండపాడు అనే గ్రామంలో మృకండముని ఉండే వారు.

Updated : 10 Mar 2022 05:14 IST

అర్ధాయువుతో జన్మించిన మార్కండేయుడు గోదావరి తీరంలో పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి ఆయనలో ఐక్యమయ్యాడు. అక్కడ వెలసిందే మార్కండేయస్వామి ఆలయం. ఇది దక్షిణ కాశీగా పేరొందిన రాజమహేంద్రవరంలో ఉంది.
పురాణకథను అనుసరించి.. పూర్వం మార్కొండపాడు అనే గ్రామంలో మృకండముని ఉండే వారు. నిత్యం పరమేశ్వరుని పూజించేవాడు. కానీ ఆయనకు సంతానం కలగలేదు. పిల్లల కోసం మృకండుడు ఘోర తపస్సు చేశాడు. ముని భక్తికి మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై ‘సంపూర్ణ ఆయుర్దాయం ఉన్నా, భర్తను అర్ధాంతరంగా కోల్పోయే అమ్మాయి కావాలా? పదకొండేళ్లకే ఆయువు తీరే తేజోవంతుడైన కుమారుడు కావాలా?’ అనడిగాడు. భర్త లేక కూతురు దుఃఖించడం వద్దులెమ్మని తేజోవంతుడైన కుమారుడే కావాలన్నాడు. ముని దంపతులకు పండంటి కొడుకు జన్మించగా, మార్కండేయుడని పేరు పెట్టుకుని, వేద విద్యలు నేర్పించారు. చిన్నవయసులోనే ఉపనయనం చేశారు. కుమారుడు కళ్ల ముందు ఆనందంగా తిరుగుతున్నా జరగబోయేది తలచుకుని దుఃఖిస్తూ బాలుడికి జన్మ రహస్యం వివరించారు. హతాశుడైన మార్కండేయుడు చివరి రోజుల్లో పరమేశ్వరుణ్ణి ఆరాధించదలచాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో గోదావరి తీరానికి వెళ్లాడు. ఇసుకతో శివలింగం చేసి తపస్సు చేశాడు. కైలాసనాథుడు ప్రత్యక్షమై మార్కండేయుని తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజరాజనరేంద్రుడు, చోళరాజులు స్వామివారిని పూజించినట్లు చరిత్ర చెబుతోంది. మార్కండేయుడు పూజించిన శివలింగమే మార్కండేయస్వామిగా పూజలందుకుంటోంది.

- సూర్యకుమారి యడ్లపల్ల్చి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని