వరాల వసంతం రంజాన్‌

‘నెలవంకా చూడవా మా వంక’ అంటూ కోట్లాది నయనాలు ఆకాశం వైపు ఆసక్తిగా చూస్తాయి. చంద్రుని దర్శనంతో రమజాన్‌ పవిత్ర మాసం ప్రారంభమవుతుంది. చంద్ర దర్శనం కాగానే దుఆ (ప్రార్థన) చదువుకుని అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపు కుంటారు ముస్లిములు.

Published : 31 Mar 2022 04:40 IST

‘నెలవంకా చూడవా మా వంక’ అంటూ కోట్లాది నయనాలు ఆకాశంవైపు ఆసక్తిగా చూస్తాయి. చంద్రుని దర్శనంతో రమజాన్‌ పవిత్ర మాసం ప్రారంభమవుతుంది. చంద్ర దర్శనం కాగానే దుఆ (ప్రార్థన) చదువుకుని అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలుపు కుంటారు ముస్లిములు.

ఇస్లామ్‌ ఆరాధనలో ముఖ్యమైంది రోజా. తెల్లవారుఝామున తిని, సుమారు 14 గంటలపాటు కఠిన ఉపవాస దీక్ష పాటిస్తారు. తమకు అల్లాహ్‌ శుభాశీస్సులు అందిస్తాడన్నది నమ్ముతారు. ‘వ్యాధిగ్రస్తులు, బాలింతలు, ప్రయాణంలో ఉన్నవారు, వృద్ధులకు ఉపవాసాల నుంచి మినహాయింపు ఉందని ఖురాన్‌ పేర్కొంది.

తెల్లవారుఝామున తినడాన్ని సహెరీ, ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్‌ అంటారు. ఖర్జూరాలతో ఉపవాసం విరమించడం ప్రవక్త (సఅసం) సంప్రదాయం. ఇఫ్తార్‌ తినిపించేవారి పాపాలను దేవుడు క్షమిస్తాడు, వారిని నరకాగ్ని నుంచి రక్షిస్తాడు.

ఇఫ్తార్‌ తినిపించిన, ఉపవాసం ఉన్న ఇద్దరికీ పుణ్యం లభిస్తుందన్నది ప్రవక్త ఉద్బోధ. తినకపోవడమే కాదు, చెడు లక్షణాలకు దూరంగా ఉంటేనే రోజా ఆశయం నెరవేరుతుందని ప్రవక్త (స) హెచ్చరిక. కళ్లు, నాలుక చెవులు, చేతులు, కాళ్లు- ఇలా శరీరంలోని అవయవాలన్నీ ఉపవాసం పాటించాలి.

‘మీలో ఎవరైనా ఉపవాసం పాటిస్తే, ఆ రోజున వారు వ్యర్థమైన మాటలు మాట్లాడ కూడదు. గలాటా చేయకూడదు. ఒకవేళ ఎవరైనా తమని దూషిస్తే లేక కయ్యానికి కాలుదువ్వితే వారితో ‘ఉపవాసంలో ఉన్నానండీ’ అని మన్ననగా చెప్పాలని ప్రవక్త (స) తెలియజేశారు. రమజాన్‌ నెలలో మొదటి పది రోజులు కారుణ్యం, తర్వాతి పది దినాలు మన్నింపు, చివరి పది రోజులు నరకం నుంచి విముక్తి కలిగించేవి.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని