విచక్షణ అవసరం

కొందరు దొంగలు రాత్రివేళ పొలం గట్టు చేరారు. తాము దోచుకున్న ధనాన్ని పంచు కున్నారు. తొందరలో కొంత సొమ్ము వదిలి వెళ్లారు. తెల్లవారుతుండగా ఆ పొలం గుండా వెళ్తున్న గౌతమ బుద్ధుడు,

Published : 09 Jun 2022 01:23 IST

బుద్ధభూమి

కొందరు దొంగలు రాత్రివేళ పొలం గట్టు చేరారు. తాము దోచుకున్న ధనాన్ని పంచు కున్నారు. తొందరలో కొంత సొమ్ము వదిలి వెళ్లారు. తెల్లవారుతుండగా ఆ పొలం గుండా వెళ్తున్న గౌతమ బుద్ధుడు, ఆయన శిష్యుడు ఆ డబ్బును చూసి దూరంగా జరుగుతూ ‘ఎంత పెద్ద విషసర్పమో!’ అంటూ వెళ్లిపోయారు. అప్పుడే పొలంలో పనిచేయడానికి వచ్చిన ఒక రైతు వారి మాటలు విని ‘విషసర్పం అంటున్నారు. దాన్ని వెంటనే చంపేయాలి’ అనుకుంటూ పెద్దకర్రతో వచ్చి చూస్తే అక్కడ డబ్బు మూట కనిపించిందే తప్ప పాము లేదు. రైతు ఆనందంగా దాన్ని ఒక చెట్టు తొర్రలో దాచి తిరిగి పనిలో మునిగిపోయాడు. ఇంతలో రాజ భటులకు డబ్బు గురించి సమాచారం తెలిసి పొలం వద్దకు వచ్చారు. రైతు పాదాల గుర్తుల ఆధారంగా తొర్రలో చూస్తే డబ్బు దొరికింది. రైతును దొంగగా భావించి రాజు వద్దకు తీసుకెళ్లారు. బుద్ధుడి మాటలు గుర్తుకొచ్చిన రైతు ‘ఎంత పెద్ద విష సర్పమో’ అనసాగాడు పదేపదే. ఏమైందని అడగ్గా జరిగిందంతా చెప్పాడు. అందులో ఎంత నిజముందో తెలుసుకోవాలని రాజు బుద్ధుని కలిశాడు. ‘రైతే కాదు, మీరూ దోషులే’ అన్నాడు బుద్ధుడు. ఆశ్చర్యపోయిన రాజు ‘ఎలా స్వామీ?’ అన్నాడు. ‘నేర పరిశోధనలో విచక్షణ అవసరం. అది మీ భటులకు ఎంతమాత్రం లేదు. దొరికిన డబ్బును రైతు దాచాడు సరే! అడుగుల జాడ అక్కడే మొదలై అక్కడే ఆగితే ధనమెక్కడి నుంచి వచ్చింది, రైతెలా దొంగయ్యాడని మీరెవరూ ఆలోచించలేదు. విచక్షణ లేని పనులు పశ్చాత్తాపానికి దారితీస్తాయి’ అన్నాడు.

- లక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని