గోవుల్ని రక్షించుకుందాం!

ప్రకృతిలోని చెట్టూ చేమా, రాయీ రప్ప, పక్షులు, జంతువులు, మనకు అన్నీ పూజనీయాలే. కానీ అగ్రస్థానం మాత్రం గోవుదే. సర్వ దేవతా స్వరూపమే గోవు. ముప్పయి మూడు కోట్ల దేవతలకు నిలయం గోవు శరీరం అన్నది మన నమ్మకం.

Published : 09 Jun 2022 01:23 IST

ప్రకృతిలోని చెట్టూ చేమా, రాయీ రప్ప, పక్షులు, జంతువులు, మనకు అన్నీ పూజనీయాలే. కానీ అగ్రస్థానం మాత్రం గోవుదే. సర్వ దేవతా స్వరూపమే గోవు. ముప్పయి మూడు కోట్ల దేవతలకు నిలయం గోవు శరీరం అన్నది మన నమ్మకం. గోవును మాతగా కొలుచుకుంటాం. ఏ పశువున్తైనా కర్రతో అదిలించాలి, బెదిరించాలి. కానీ మన చేతిలో కర్రను చూస్తేనే బెదిరే సాధుజీవి గోవు. ఏ జీవి మలమూత్రాలైనా దుర్భరమే. కానీ గోమయం పవిత్రం. దీనితో భూశుద్ధి జరుగుతుంది. ఆవు పాలతోబాటు, మల మూత్రాల్లోనూ ఔషధ విలువలున్నాయి. 

బ్రాహ్మణులు ‘స్వాహా’కారంతో చేసే యజ్ఞ విధుల్లో గోమాత ప్రమేయం ఉంటుంది. కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో జమదగ్ని ఆశ్రమానికి ఆతిథ్యం కోసం వచ్చినప్పుడు, తన వద్దనున్న కామధేనువు సృష్టించిన పదార్థాలను వడ్డించాడు జమదగ్ని. కోరినదల్లా సృష్టిస్తున్న కామధేనువుపై కన్నుబడి రాజునన్న గర్వంతో దాన్ని తస్కరించి బలవంతంగా తీసుకువెళ్లాడు. ఇది తెలిసి గోమాతను హింసించిన కార్తవీర్యునిపై కోపోద్రిక్తుడైన పరశురాముడు తన పరశుతో(గొడ్డలి) వెయ్యి చేతులు నరికి అతని సెన్యాన్ని మట్టుపెట్టి ఆ గోవును తిరిగి తండ్రికి అప్పగించాడు.

పాండవులు విరాటుని కొలువులో అజ్ఞాతవాసంలో ఉన్న సమయం. కీచకుని మరణవార్త తెలుసుకున్న దుర్యోధనుడు పాండవులను కనిపెట్టదలచాడు. అందుకోసం రాజ్యానికి ఉన్న బలమైన పశు సంపద మీద ‘ఉత్తర గోగ్రహణం’ పేరుతో దండయాత్ర చేశాడు. కానీ అర్జునుడు అతని ఆటలు సాగనివ్వక గోగణాన్ని కాపాడాడు.

ఆవుల మందలో తిరిగే గోపబాలకుడైన అల్లరి కృష్ణయ్యను గురించిన కథలెన్నో విన్నాం. సంతులేని దిలీప మహారాజు అతని గురువు సలహాతో గోక్షీరాన్ని సేవించగా రఘుమహారాజు జన్మించి రఘువంశం ఏర్పడింది.

ఆవు నిజాయితీనీ రుజువర్తనాన్నీ తెలిపే కథలెన్నో! పంచతంత్రంలోని ‘ఆవు-పులి’ కథ పిల్లలకెంతో ఇష్టం. ఆలయం తర్వాత అంత పవిత్రమైన ప్రదేశం గోశాల. షోడశ దానాల్లో గోదానం ఉత్తమమైంది. అర్హులైన వారికి గోదానం చేస్తే మరణానంతరం వైతరణి దాటడం సులభమవుతుందంటారు పెద్దలు. గోవు బతికున్నప్పుడే గాక విగతజీవిగా మారాక కూడా చర్మంతో డమరుకం తయారుచేయడానికి, శృంగాలతో ఈశ్వరాభిషేకానికి, తనలోని గోరోజనం అనే సుగంధ ద్రవ్యంతో భగవదారాధనకూ ఉపయోగపడుతుంది. సాధువుల, గోవుల రక్షణలో సదా ఉంటానంటూ భాగవతంలో స్వయంగా భగవంతుడే చెప్పాడు.

‘గాడిద పాలు కడివెడైనా ఉపయోగం లేదు, గంగిగోవు పాలు గరిటెడైనా చాలు’ అన్నాడు వేమన. తల్లి పాలు లేని లోటును తీరుస్తాయి ఆవు పాలు. గోవును బాధిస్తే పాపాన్ని మూట గట్టుకోవడమే. లోకం సుభిక్షంగా సుసంపన్నమై ఉండాలంటే గోవులు క్షేమంగా ఉండాలి.

- డాక్టర్‌ అమృత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని