గరుత్మంతుడి గర్వభంగం

దేవేంద్రుడి రథసారథి మాతలి. అతడు తన కూతురు గుణకేశికి సుముఖుడు తగినవాడని భావించి వరుడి తాత ఆర్యకుణ్ణి కలిశాడు. ఆ సర్పరాజు దుఃఖంతో తన కుమారుడు చికురుణ్ణి గరుత్మంతుడు

Published : 18 Aug 2022 01:28 IST

దేవేంద్రుడి రథసారథి మాతలి. అతడు తన కూతురు గుణకేశికి సుముఖుడు తగినవాడని భావించి వరుడి తాత ఆర్యకుణ్ణి కలిశాడు. ఆ సర్పరాజు దుఃఖంతో తన కుమారుడు చికురుణ్ణి గరుత్మంతుడు సంహరించాడని, మనవణ్ణి కూడా నెలరోజుల్లో చంపుతానన్నాడు కనుక తాను ఒప్పుకోలేనని చెప్పాడు. మాతలి తాను దేవేంద్రుణ్ణి అడిగి సుముఖుడు ఆయుష్మంతుడు అయ్యేట్టు చేస్తానన్నాడు. వాళ్లు వెళ్లేసరికి విష్ణువు కూడా ఇంద్రుడి దగ్గరే ఉన్నాడు. మాతలి చెప్పింది విని, ఇంద్రుడు విష్ణువు సాయం తీసుకుందామనుకున్నాడు. కానీ ఈ మాత్రానికే విష్ణువెందుకు? గరుత్మంతుడేగా అనుకుని తానే సుముఖుడికి దీర్ఘాయువు ప్రసాదించి కూతురి వివాహం జరిపించాడు మాతలి. అది తెలిసి గరుత్మంతుడికి కోపం వచ్చింది. నారాయణుడి సమక్షంలో ఉన్న ఇంద్రుడితో ‘మనిద్దరం కశ్యపుడి సంతానమే. నీ తల్లి అదితి. నా తల్లి వినత. ఇద్దరి లక్ష్యం రాక్షస సంహారం. నేను నీ కంటే ఎందులో తక్కువ? ఇద్దరం సమానమే కదా! నా నిర్ణయానికి ఎందుకు అడ్డొచ్చావు?’ అని నిలదీశాడు. ‘నీ ఘనతకి విష్ణువే కారణం’ అన్నాడు ఇంద్రుడు.

‘నా శక్తి సామర్థ్యాలు తెలియక మాట్లాడుతున్నావు. అదితి సంతానమైన దేవతల నందరినీ ఒక సన్నని ఈక మీద నిలపగలను’ అన్నాడు గరుత్మంతుడు కోపంగా. దాంతో విష్ణుమూర్తి వెటకారంగా నవ్వి ‘అంతవాడివా నువ్వు? నా సామర్థ్యంతో నడుపుతుంటే అలా అహంకరించటం తగునా?’ అంటూ గరుడుడి వీపు మీద చేయి వేశాడు. ఆ బరువుని తట్టుకోలేక సొమ్మసిల్లి, రెక్కలు చాస్తూ, నోరు తెరుచుకుని నేలమీద పడి ఆక్రందన చేశాడు గరుత్మంతుడు.

అప్పుడు విష్ణుమూర్తి దయతలచి గరుడుణ్ణి ఓదార్చి, ఈకలను సరిచేసి, ఎగరటానికి వీలుగా పైకి లేపి ‘ఇకపై గర్వం లేకుండా బుద్ధిగా ఉండు’ అన్నాడు. ‘బతుకు జీవుడా!’ అనుకుని గరుడుడు వెళ్లిపోయాడు. గర్వం ఎంతటి ఘనతనైనా తగ్గించి అవమానాల పాలు చేస్తుందని తెలిపే ఈ ఇతివృత్తాన్ని కణ్వ మహర్షి దుర్యోధనుడికి బోధించాడు.

- తుషార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని