గంగాదేవి శోకం

శరతల్పం మీద మృత్యువు కోసం ఎదురుచూస్తున్నాడు భీష్ముడు. శ్రీకృష్ణుడు, వ్యాసమహర్షి, ధర్మరాజు తదితరులు వెళ్లి ఉత్తరాయణం ప్రవేశించిందని చెప్పారు.

Published : 06 Jul 2023 00:36 IST

శరతల్పం మీద మృత్యువు కోసం ఎదురుచూస్తున్నాడు భీష్ముడు. శ్రీకృష్ణుడు, వ్యాసమహర్షి, ధర్మరాజు తదితరులు వెళ్లి ఉత్తరాయణం ప్రవేశించిందని చెప్పారు. తన ప్రాణం విడవటం తన చేతిలోనే ఉన్న భీష్ముడు అందాకా ఆత్మను అడ్డగించి ఉంచాడు. శరీరాన్ని విడిచేందుకు కృష్ణుడి అనుమతి లభించి, ఆ క్షణం ప్రాణం త్యజించాలి అనుకోగానే ఆయన ఆత్మ శిరస్సును ఛేదించుకుని అగ్నికణంలా ప్రకాశిస్తూ ఆకాశమార్గాన పయనించి అంతర్థానమైంది. భీష్ముడి పార్థివ శరీరానికి శాస్త్రీయంగా అగ్ని సంస్కారం నిర్వహించారు.

అప్పుడు గంగాదేవి నదీ జలం నుంచి స్త్రీ రూపంలో బయటికొచ్చి రోదిస్తూ ‘నా పుత్రుడి గురించి రెండు మాటలు చెబితే, కాస్తయినా గుండెభారం తగ్గుతుందని మాట్లాడుతున్నాను.

భీష్ముడంతటి గొప్పవాడు లోకంలో మరెవరూ లేరు. అతడిదెంత ఉత్తమ నడవడికో అందరికీ తెలుసు. మహా పట్టుదల ఉన్నందునే భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. భూమి ఉన్నంతకాలం గుర్తుండేలా మాట నిలబెట్టుకుని ఆదర్శంగా నిలిచాడు. పితృభక్తిని చాటడంలో ముందుస్థానంలో ఉంటాడు. పండితులకు ప్రియమైనవాడు, విద్యావంతుడు. కాశీరాజు కుమార్తె అంబ విషయంలో పరశు రాముణ్ణే ఓడించినవాడు. అంతటి శక్తి సంపన్నుడు సామాన్యుడైన శిఖండి చేతిలో ఓడిపోయాడు. శరతల్పం మీద మృత్యువు కోసం ఎదురుచూశాడు. ఇవన్నీ చూసి కూడా నా గుండె ఇంకా బద్దలవ్వ లేదంటే నాది స్త్రీ హృదయం కాదేమో, వజ్రంతో రూపొందినంత కఠినమైనది కాబోలు’ అంది.

ఆమె వేదన విన్న శ్రీకృష్ణుడు, వ్యాసమహర్షి భీష్ముడి జన్మ కారణం గుర్తుచేయడమే కాకుండా అతడు వసువుల్లో కలిసిపోయిన సంగతి చెప్పి ఊరడించారు.

శరత్‌ చంద్రిక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని