యమధర్మరాజే విదురుడిగా..

ధృతరాష్ట్ర గాంధారులను చూసేందుకు పాండవులు వెళ్లారు. అక్కడ విదురుడు లేడేమని అడిగాడు ధర్మరాజు.‘విదురుడు ఆశ్రమంలో ఉండడు.

Published : 20 Jul 2023 01:11 IST

ధృతరాష్ట్ర గాంధారులను చూసేందుకు పాండవులు వెళ్లారు. అక్కడ విదురుడు లేడేమని అడిగాడు ధర్మరాజు.
‘విదురుడు ఆశ్రమంలో ఉండడు. ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. అతడికి గాలీ నీరే ఆహారం. ఒక్కోసారి అదీ తీసుకోడు. అరుదుగా కనిపించి మాయమవుతుంటాడు’ అని బదులిచ్చాడు ధృతరాష్ట్రుడు. అంతలోనే వచ్చిన విదురుడి ఒళ్లంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. ధర్మరాజుని చూడగానే పరుగు తీశాడు విదురుడు. ధర్మరాజు వెంబడించాడు. ఉన్నట్టుండి విదురుడు ఆగిపోయి, ధర్మరాజు కళ్లలోకి చూస్తూ యోగశక్తితో తన ఇంద్రియశక్తిని అతడిలో ప్రవేశపెట్టి, కింద పడిపోయాడు. మరుక్షణం ధర్మరాజులో మహా శక్తి వచ్చింది. తనలో మార్పుకి ఆశ్చర్యపోతూనే విదురుడి పార్థివ దేహానికి అగ్నిసంస్కారం చెయ్యబోయాడు ధర్మరాజు. అంతలో అశరీరవాణి ‘యతి అయిన విదురుడి శరీరాన్ని దహనం చేయరాదు. అలాంటి ప్రయత్నం వద్దు’ అని పలకడంతో అక్కణ్ణించి ఆశ్రమానికి వెళ్లాడు ధర్మరాజు.

అక్కడ వ్యాసమహర్షికి విషయం వివరించాడు ధర్మరాజు. వ్యాసుడు తల పంకించి ‘మాండవ్య మహర్షి శాపం, బ్రహ్మదేవుడి ఆజ్ఞల ఫలితంగా యమధర్మరాజు శూద్ర కులంలో విదురుడిగా జన్మించాడు. అందుకే యముడి లక్షణాలైన న్యాయం, నిర్మల బుద్ధి అతడికి వచ్చాయి. నువ్వు కూడా యముడి అంశే అయినందున యోగబలంతో విదురుడు నీలో ఐక్యమయ్యాడు’ అంటూ వివరించాడు.

శరత్‌ చంద్రిక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని