ఆంజనేయం మహావీరం

ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధికుశలుడు, గొప్ప పరాక్రమవంతుడు, ప్రభుభక్తి పరాయణుడు.. ఇలా హనుమంతుడిని ఎంత ప్రశంసించినా తక్కువే. ఆంజనేయుడే తనకు ఆదర్శమన్నాడు స్వామి వివేకానంద.

Published : 10 Aug 2023 00:19 IST

ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధికుశలుడు, గొప్ప పరాక్రమవంతుడు, ప్రభుభక్తి పరాయణుడు.. ఇలా హనుమంతుడిని ఎంత ప్రశంసించినా తక్కువే. ఆంజనేయుడే తనకు ఆదర్శమన్నాడు స్వామి వివేకానంద. హనుమ జన్మతః బలవంతుడు. చతుర్ముఖబ్రహ్మ, దేవేంద్రుడు తదితరులనుంచి వరాలు పొంది, వజ్రాయుధం ధాటికి కూడా హతం కాకుండా నిలిచిన ధీమంతుడు. సోదరుడు వాలికి భయపడి నిస్సహాయుడై తిరుగుతున్న సుగ్రీవుడికి ధైర్యం చెప్పి, రాముడితో స్నేహం చేయించి వానర రాజ్యానికి అధిపతిని చేసిన ఆపద్బాంధవుడు. పతి వియోగ దుఃఖం భరించలేక ఆత్మాహుతికి సిద్ధపడిన సీతమ్మకు రామయ్య క్షేమం తెలియజేసి.. ఆమెని ఆ ప్రయత్నం నుంచి విరమింపచేశాడు. ఇంద్రజిత్తు చేసిన అస్త్ర ప్రయోగానికి, నిశ్చేష్టులైన వానరులందరినీ కాపాడిందీ హనుమంతుడే. సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుడికి ప్రాణదాత అయ్యాడు. రామ రావణ యుద్ధంలో తన రుద్ర తేజాన్ని ప్రదర్శించాడు. లంకలో ప్రవేశించాక తనపై దాడి చేసిన రాక్షసవీరుల్ని హతమార్చాడు. తన తోకకు అంటించిన నిప్పుతో బంగారు మేడలతో అలరారుతున్న లంకా నగరాన్ని భస్మీపటలం చేశాడు. వినయ విధేయతలు, కృతజ్ఞతాభావం హనుమంతుడిలో దర్శిస్తాం. ధర్మ రక్షణ కోసం రాముడు అవతరిస్తే, ఆయన సేవ చేసేందుకు హనుమంతుడు అవతరించాడు. తన ధర్మకార్యం ముగియగానే హనుమంతుడు గంధమాదన పర్వతంపై తపోనిష్టుడై భక్తులను అనుగ్రహించాడే తప్ప, రాముడితోపాటు అయోధ్యలో ఉండి రాజభోగాలు అనుభవించలేదు. ధర్మ కార్యంలో తన అవసరం ఉన్నప్పుడల్లా రాముడికి తోడుగా నిలిచాడు. రామరావణ యుద్ధంలో విజయకారకుడు హనుమంతుడు.

గోవిందం ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని