అల్లాహ్‌ను విశ్వసిస్తేనే..

పూర్వం రాజదర్బారులో ఓ మాంత్రికుడు ఉండేవాడు. వృద్ధాప్యం మీద పడటంతో తెలివైన బాలుణ్ణి తనకు అప్పగిస్తే, తానతనికి మంత్రతంత్రాలు నేర్పుతాను అన్నాడు.

Updated : 24 Aug 2023 05:42 IST

పూర్వం రాజదర్బారులో ఓ మాంత్రికుడు ఉండేవాడు. వృద్ధాప్యం మీద పడటంతో తెలివైన బాలుణ్ణి తనకు అప్పగిస్తే, తానతనికి మంత్రతంత్రాలు నేర్పుతాను అన్నాడు. రాజు మన్నించాడు. ఆ బాలుడు తాంత్రిక విద్య నేర్చుకోవటానికి వృద్ధుని ఆశ్రమానికి వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న మతాచార్యుని ఉపదేశాలు కూడా ఆలకించేవాడు. అవి అతన్ని ఆకట్టుకున్నాయి. రోజులు గడుస్తున్నాయి. అతడు అంధులు, కుష్టురోగులు, తదితరులకు వ్యాధి నయం చేసేవాడు. అయితే వాళ్లంతా అల్లాహ్‌ను విశ్వసించాలన్న షరతు విధించేవాడు. తన దగ్గరకు ఏ రోగివచ్చినా, ‘ఓ అల్లాహ్‌! నువ్వితని జబ్బును దూరం చెయ్యి’ అని ప్రార్థించేవాడు. వాళ్లకు ఆరోగ్యం చేకూరడంతో అతడి పేరు మార్మోగసాగింది. ప్రజలు బాలుణ్ణి అంతగా మెచ్చుకోవడం ఆ నిరంకుశ రాజుకు నచ్చలేదు. తన ప్రాముఖ్యత తగ్గినట్లనిపించి.. ఎందరో విశ్వాసులను హతమార్చాడు. చివరికి పర్వత శిఖరంమీది నుంచి బాలుణ్ణి తోసెయ్యమని భటులకు ఆదేశించాడు. అలా వెళ్తుండగా పసివాడు అల్లాహ్‌ను ప్రార్థించాడు. అంతే!  పర్వతం కంపించి భటులు కుప్పకూలారు. అతడు మాత్రం సురక్షితంగా ఉన్నాడు. రాజుకు మతి పోయింది. తర్వాత సముద్రంలో పడేయమన్నాడు. అక్కడా భంగపాటే. అతడు ప్రార్థించగానే పడవ మునిగిపోయింది. అతడు తప్ప అంతా చనిపోయారు. రాజు నివ్వెరపోయాడు. అప్పుడు బాలుడు- ‘నన్ను చంపాలన్నదే తమరి ధ్యేయమైతే అల్లాహ్‌ నామంతో బహిరంగ ప్రదేశంలో ప్రజలందరినీ సమావేశపరచి, నాపై బాణం సంధించండి’ అన్నాడు. రాజు అలాగే చేశాడు. వెంటనే పసివాడు మరణించాడు. ‘మేం కూడా ఇతడిలానే ప్రభువునే విశ్వసిస్తున్నాం’ అంటూ ధైర్యంగా చెప్పారు అక్కడ చేరిన ప్రజలు. తాను చనిపోతూ ప్రజలందరినీ అల్లాహ్‌ దాసులుగా మార్చాడు బాలుడు. ఖురాన్‌లోని ఈ గాథ అల్లాహ్‌ పట్ల విశ్వాసానికి మచ్చుతునక.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని