ఏది అవివేకం

అది సత్యసుందరం... అది ధీరగంభీరం... అది అఖండ చైతన్యవంతం అది అనంత శక్తి సమన్వితం... అది నీకేం కావాలో చెబుతుంది...

Updated : 06 Jul 2022 16:23 IST

జనవరి 12 స్వామి వివేకానంద జయంతి

అది సత్యసుందరం... అది ధీరగంభీరం... అది అఖండ చైతన్యవంతం
అది అనంత శక్తి సమన్వితం... అది నీకేం కావాలో చెబుతుంది...
అది నీవేం చేయాలో బోధిస్తుంది... అది నీకు నీవెవరో తెలియపరుస్తుంది... అదే వివేక వాణి...

ప్రాక్‌పశ్చిమ దేశాలన్నిట్లోనూ   వేదాంత భేరిని మోగించిన స్వామి వివేకానందుడి ప్రతి మాట, ప్రతి సందేశం ఆయన జీవితానుభవంలోంచి వచ్చినవే. అందుకే అవి సమాజంపై అంత ప్రభావం చూపించాయి. ప్రతి మనిషికీ భారతీయ తత్త్వచింతన వెలుగులో కొత్త దారి చూపాయి.

ఏది గొప్ప హృదయం ?

ప్రేమలేని హృదయంతో పారమార్థికంగానూ ముందుకు సాగలేం. హృదయం లేని జ్ఞానం వృథా. సాటి మనిషి కష్టాన్ని చూసి చలించకుండా ఎన్ని ఉపదేశాలిచ్చినా అవి లక్ష్యాన్నిచేరలేవు.

దయగల మందిరమే దైవ నిలయమని ఆయన ప్రతి సందర్భంలోనూ చెప్పేవారు. ఆయన అలాగే జీవించారు. స్వామి ఒకసారి కోల్‌కతాలో తన కళాశాల మిత్రులతో కలిసి ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు గిరీష్‌ చంద్రఘోష్‌ స్వామితో ‘సోదరా! నువ్వు వేదాలు, ఎన్నో శాస్త్రాలు అధ్యయనం చేశావు. ఈ దేశంలో తాండవిస్తున్న పేదరికానికి, అభాగ్యుల శోకాలకు ఆ గ్రంథాల్లో పరిష్కారమార్గం ఎక్కడైనా కనిపించిందా?’ అని ప్రశ్నించారు. ఆనాటి సమాజ దీన స్థితిని గిరీష్‌ వర్ణిస్తుంటే స్వామి ఉద్వేగభరితుడయ్యాడు. కళ్లవెంట నీళ్లు ధారలు కడుతుంటే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. అప్పుడు గిరీష్‌ మిగిలిన మిత్రులతో ఇలా అన్నారు... ‘చూశారా! నేను ఆయన పాండిత్యం, వాగ్దాటిని చూసి గౌరవించడం లేదు. మానవాళి అనుభవిస్తున్న దుఃఖాన్ని చూసి చలించిపోయిన అతని కరుణాంతరంగాన్ని చూసి దాసోహమవుతున్నా’నన్నారు.

భక్తి అంటే?

నీ భక్తి, భగవధారాధన ఆలయంతో ప్రారంభమైతే ఫర్వాలేదు. కానీ అక్కడితో ఆగిపోతేనే అసంపూర్ణం. కనిపించే ప్రతి జీవిలో భగవంతుడిని చూడడమే నిజమైన భక్తి.

... ఇక్కడ ఆలయాలు అనవసరమని, అర్చనలు చేయొద్దని స్వామి ఉద్దేశం కాదు. మన పారమార్థిక ప్రయాణం అక్కడితో ఆగిపోకూడదని ఆయన మనోభావన. ఒకసారి బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌ ప్రాంతంలో నెలకొన్న కరవు కాటకాలు, చిన్నారుల ఆకలిచావుల గురించి సోదర సన్యాసి స్వామి అఖండానంద విదేశాల్లో ఉన్న వివేకానంద స్వామికి ఉత్తరం రాశారు. వెంటనే స్వామీజీ ఆయనను ఆ ప్రాంతంలోనే ఉండిపొమ్మని చెబుతూ... ఏ ఆధ్యాత్మిక సాధనలూ అవసరం లేదు. వారి ఆకలి తీర్చే ఏర్పాటు చేయమని ఆదేశించారు. తమ గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస బోధించిన ‘జీవ సేవే శివ సేవ’ అన్న నినాదాన్ని గుర్తు చేశారు. అఖండానంద ఆజన్మాంతం అభాగ్యుల సేవే భగవధారాధనగా భావించి ఆ సేవా కార్యక్రమాల్లోనే ఉండిపోయారు.

ఎవరు గురువు?

నా పేరు ప్రఖ్యాతుల్లో నా ప్రత్యేకత ఏమీ లేదు. నా గురుదేవులు తలుచుకుంటే మట్టిలోంచి నాలాంటి వివేకానందులను వేలాది మందిని తయారు చేయగలరు.

ఎంతటి కారణజన్ముడికైనా గురువు మార్గనిర్దేశం అనివార్యమని అనేవారు స్వామి వివేకానంద. నిస్వార్థానికి, త్యాగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే గురువు, అచంచల విశ్వాసం, అకుంఠిత దీక్ష ఉన్న శిష్యుడు రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తారంటారాయన. స్వయంగా స్వామి తమ గురువరేణ్యులు రామకృష్ణ పరమహంసకు శరణాగతులయ్యారు. ఆ గురువు ఆథ్యాత్మిక సంపదకు వారసుడిగా నిలిచారు. రామకృష్ణ పరమహంస మూలవిరాట్టు అయితే స్వామి వివేకానంద ఉత్సవమూర్తియై ఆధ్యాత్మిక జ్ఞానకాంతిని నలుదిశలా ప్రసరింపజేశారు.

మోక్షమెలా?

మనిషికి మేలు చేయి... అదే మోక్షానికి మేలు దారి...

ఆధునిక కాలంలో ఆధ్యాత్మికోన్నతికి సంబంధించి స్వామి సులువైన మార్గాన్ని నిర్దేశించారు. సాటి మనిషిని ఆదుకోవడమే మోక్షమార్గమని ఆయన చెప్పేవారు. ‘ఆత్మనోమోక్షార్థం జగత్‌ హితాయ చ’ అన్న నినాదంతో రామకృష్ణ సంఘానికి శ్రీకారం చుట్టారు. మన మనుగడకు సహకరిస్తున్న సాటి సమాజ హితానికి సహకరించడం కూడా ఆధ్యాత్మిక సాధనేనని ఆయన స్పష్టం చేశారు. కోల్‌కతాలో కలరా వ్యాపించి ప్రజలు మృత్యువుపాలవుతుంటే స్వామి చలించిపోయారు. వారి వైద్య సేవల కోసం బేలూరు మఠం నిర్మాణానికి కేటాయించుకున్న స్థలాన్ని అమ్మడానికి కూడా సిద్ధపడ్డారు. మనిషి కష్టాన్ని తీర్చని ఏమందిరంతోనూ పనిలేదన్నది ఆయన సిద్ధాంతం.

- సైదులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని