పొడవైన గడ్డం ఎందుకు?

గురు రామ్‌దాస్‌ సిక్కుల నాలుగో గురువు. ఆయన వినయభూషణుడు. సౌమ్యంగా మాట్లాడేవారు. తన గురువైన గురు అర్జున్‌దేవ్‌ ఆదేశాలతో చారిత్రక అమృత్‌సర్‌ పట్టణాన్ని నిర్మించింది ఆయనే. రామ్‌దాస్‌ నిరాడంబరత గురించి విన్న గురునానక్‌ కొడుకు బాబా శ్రీచంద్‌,

Published : 23 Jun 2022 01:26 IST

సిక్కుసూక్తం

గురు రామ్‌దాస్‌ సిక్కుల నాలుగో గురువు. ఆయన వినయభూషణుడు. సౌమ్యంగా మాట్లాడేవారు. తన గురువైన గురు అర్జున్‌దేవ్‌ ఆదేశాలతో చారిత్రక అమృత్‌సర్‌ పట్టణాన్ని నిర్మించింది ఆయనే. రామ్‌దాస్‌ నిరాడంబరత గురించి విన్న గురునానక్‌ కొడుకు బాబా శ్రీచంద్‌, అమృత్‌సర్‌ బయల్దేరారు. తనను కలవడానికి 90 ఏళ్ల శ్రీచంద్‌ వస్తున్న సంగతి తెలిసి రామ్‌దాస్‌ చాలా ఆనందించారు. శ్రీచంద్‌కి అమృత్‌సర్‌లో ఘనస్వాగతం లభించింది. రామ్‌దాస్‌ ఆయనకు ఎదురెళ్లి స్వాగతం పలికి నమస్కరించారు. తనను సత్కరించిన తీరు, అక్కడి పరిస్థితులను చూశాక గురు రామ్‌దాస్‌ గురించి అందరూ గొప్పగా చెప్పుకునేది నిజమేనని అర్థమైంది శ్రీచంద్‌కి. వాళ్లిద్దరూ అనేక అంశాల గురించి మాట్లాడుకున్నారు. చివర్లో ‘నాయనా! రామ్‌దాస్‌! అంతా బానే ఉంది కానీ, నువ్వింత పొడవైన గడ్డం ఎందుకు పెంచావు?’ అనడిగారు శ్రీచంద్‌ నవ్వుతూ. గురు రామ్‌దాస్‌ కూడా నవ్వి ‘స్వామీ! మీ వంటి పుణ్యాత్ములు, దైవసేవకులు వచ్చినప్పుడు శిరస్సు వంచి, పాదాలనంటిన ధూళిని శుభ్రం చెయ్యాలంటే పొడుగ్గానే ఉండాలిగా మరి’ అంటూ వినమ్రంగా జవాబిచ్చారు. ఆ మాటలకు ప్రసన్న వదనంతో రామ్‌దాస్‌ వంక చూసిన శ్రీచంద్‌కు తండ్రి గురునానకే కనిపించారు.

జి.శ్రీనివాసు, ఆలమూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని