ఎవరు ధర్మాత్ముడు?

ఒకసారి ‘గురువర్యా! ధర్మాత్ముడైన రాజు ఎవరో కాస్త తెలియజేయండి’ అంటూ సూతమహర్షిని అడిగాడో ముని. అప్పుడు ‘లోకంలో ఎందరు రాజులున్నా ధర్మాత్ముడైన రాజు మాత్రం జనమేజయుడే. రాజు అన్ని పనులూ చేయ నవసరం లేదు.

Updated : 25 May 2023 00:43 IST

ఒకసారి ‘గురువర్యా! ధర్మాత్ముడైన రాజు ఎవరో కాస్త తెలియజేయండి’ అంటూ సూతమహర్షిని అడిగాడో ముని. అప్పుడు ‘లోకంలో ఎందరు రాజులున్నా ధర్మాత్ముడైన రాజు మాత్రం జనమేజయుడే. రాజు అన్ని పనులూ చేయ నవసరం లేదు. కర్తవ్యాలను నిర్వర్తిస్తే చాలు. దేశరక్షణ మొదటిది. తాను కానీ, తన పరివారం కానీ ప్రజల కష్టాలు తీర్చడం రెండోది. వీటిని సమర్థంగా పోషించాడాయన. సంవత్సరం పొడవునా యజ్ఞయాగాదులు నిర్వహించి లోక శ్రేయస్సు కలిగించేవాడు. ఆయనోసారి సత్రయాగం తలపెట్టినప్పుడు ఆవరణను పరిచారకులు శుభ్రం చేయ సాగారు. అప్పుడు సరమ దేవత కొడుకు సారమేయుడు శునక రూపం ధరించి అక్కడి ఏర్పాట్లు చూస్తున్నాడు. కుక్క యజ్ఞభూమిలో ఉండటం అపశకునం కనుక దాన్ని రాజు సోదరులు శ్రుత, భీమ, ఉగ్రసేనులు గాయపరిచి తరిమేశారు. సరమకు విషయం తెలిసి రాజు వద్దకు వచ్చి ‘ఏ తప్పూ చేయని నా బిడ్డను నీ తమ్ముళ్లు గాయపరిచారు కనుక నీకూ, నీ ప్రజలకూ, నీ సోదరులకూ పాపం కలుగుతుంది. దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి’ అని శపించి వెళ్లింది. రాజు ఆలోచించాడు. అంటే వ్యాధులూ, వరదలూ, భూకంపాలూ రావచ్చు. అలాంటి ప్రమాదాలు సంభవించకుండా ప్రకృతిని ప్రసన్నం చేసు కోవాలనుకున్నాడు. సోమవ్రశుడు అనే పురోహితుడి సాయంతో వైపరీత్యాల నుంచి కాపాడుకున్నాడు. అందుకే మహాభారత కథ జనమేజయుడు, అతణ్ణి ధర్మమార్గాన నడిపించిన శునకంతో ఆరంభమైంది. అదే కుక్క యమ ధర్మరాజు రూపంలో పాండవులను ధర్మమార్గాన నడిపి భారతానికి సమాప్తం పలికింది. ఈ కారణంగానే భారతం ధర్మంతో, శునకంతో మొదలై అవే అంశాలతో పరిసమాప్త మయ్యింది. అందువల్ల శక్తి ఉంది కదాని బలహీనులను అవమానించకూడదు. అదే ఈ కథలో సందేశం’ అంటూ వివరించాడు సూతమహర్షి.

ఉమాబాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు