ఐసీఎంఆర్‌లో పరిశోధనకు ఛాన్స్‌

న్యూదిల్లీకి చెందిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) బయోమెడికల్‌ రిసెర్చ్‌లో అగ్రగామి సంస్థ...

Published : 27 Apr 2020 00:03 IST

బయోమెడికల్‌, సోషల్‌ సైన్సెస్‌లో ఫెలోషిప్‌లు

సైన్స్‌ విభాగాల్లో పరిశోధన విద్యపై ఆసక్తి ఉన్నవారికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఓ అవకాశాన్ని కల్పిస్తోంది. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో కింద 150 ఫెలోషిప్‌లను అందిస్తోంది. జాతీయ స్థాయిలో ఆన్‌లైన్‌లో జరిగే ఐసీఎంఆర్‌-జేఆర్‌ఎఫ్‌ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్‌ ఇటీవలే విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

న్యూదిల్లీకి చెందిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) బయోమెడికల్‌ రిసెర్చ్‌లో అగ్రగామి సంస్థ. ప్రపంచవ్యాప్తంగా దీనికి పేరు ప్రఖ్యాతులున్నాయి. ఇది చండీగఢ్‌కు చెందిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌)తో కలిసి జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌లను అందిస్తోంది. మొత్తం ఫెలోషిప్‌ల సంఖ్య 150. జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ద్వారా అర్హత సాధించవచ్చు.

వీటిలో 120 బయోమెడికల్‌ సైన్సెస్‌ వారికి (మైక్రోబయాలజీ, ఫిజియాలజీ, మాలిక్యులార్‌ బయాలజీ, జెనెటిక్స్‌, హ్యూమన్‌ బయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఇన్ఫర్మాటిక్స్‌, బయోఫిజిక్స్‌, ఇమ్యునాలజీ, ఫార్మకాలజీ, నర్సింగ్‌, జువాలజీ, బోటనీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌, వెటర్నరీ మెడిసిన్‌) వారికి ఇస్తారు. అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌/ సాయిల్‌ సైన్సెస్‌ మొదలైన వారికి అవకాశముండదు. మిగిలిన 30 ఫెలోషిప్‌లను సోషల్‌ సైన్స్‌ (సైకాలజీ, సోషియాలజీ, హోమ్‌సైన్స్‌, స్టాటిస్టిక్స్‌, ఆంత్రపాలజీ, సోషల్‌ వర్క్‌, పబ్లిక్‌ హెల్త్‌/ హెల్త్‌ ఎకనామిక్స్‌) వారికీ ఇస్తారు. అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌ వారిని పరిగణనలోకి తీసుకోరు.

ఫెలోషిప్‌ మొత్తం నెలకు రూ.31,000. ఆన్యువల్‌ కాంటింజెన్సీ గ్రాంట్‌ ఏడాదికి రూ.20,000. జేఆర్‌ఎఫ్‌ను రెండేళ్లపాటు ఇస్తారు. 22 నెలల తరువాత రివ్యూ కమిటీ అసెస్‌మెంట్‌ చేస్తుంది. అందులో విజయవంతమైతే ఎస్‌ఆర్‌ఎఫ్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తారు. ఎస్‌ఆర్‌ఎఫ్‌లకు నెలకు రూ.35,000 చొప్పున చెల్లిస్తారు.

అర్హతలు

ఎంఎస్‌సీ/ ఎంఏ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసినవారు అర్హులు. జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ వారు 55%, ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూబీడీ వారు 50% మార్కులు సాధించి ఉండాలి.

వయసు 30.09.2020 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్‌సీ, ఎస్‌టీ వారికి అయిదేళ్లు, పీడబ్ల్యూబీడీ, మహిళలకు మూడేళ్లు వయఃపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. మొత్తం మార్కులు 150. పరీక్షలో రెండు సెక్షన్లు- ఆప్టిట్యూడ్‌, సబ్జెక్టుకు సంబంధించినది ఉంటాయి. సెక్షన్‌-ఎ నుంచి 50 ప్రశ్నలు సైంటిఫిక్‌ ఫినామినా ఇన్‌ ఎవ్రీడే లైఫ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ ఇన్‌ సైన్సెస్‌, కామన్‌ స్టాటిస్టిక్స్‌ అంశాల నుంచి ఉంటాయి. సెక్షన్‌-బిలో లైఫ్‌ సైన్సెస్‌, సోషల్‌ సైన్సెస్‌ నుంచి వస్తాయి. అభ్యర్థులు వీటిలో తమకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్ఛు ప్రతి దాని నుంచి 100 ప్రశ్నలుంటాయి. ఏవైనా 75 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులను కోత విధిస్తారు.

దరఖాస్తు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ వారికి రూ.1500, ఎస్‌సీ, ఎస్‌టీ వారికి రూ.1200. పీహెచ్‌ వారికి ఫీజులో మినహాయింపు ఉంది.

పరీక్ష కేంద్రాలు

బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, చండీగఢ్‌, చెన్నై, దిల్లీ, గువాహటి, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి, శ్రీనగర్‌, వారణాసి

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మే 27, 2020

పరీక్ష తేదీ: జులై 12, 2020

ఇతర వివరాలకు వెబ్‌సైట్లు http://pgimer.edu.in, https://icmr.nic.in/ లను సందర్శించవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని