గ్రీన్‌కార్డును హైదరాబాద్‌లో సరెండర్‌ చేయవచ్చా?

అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరుతో పాఠకుల నుంచి ‘ఈనాడు’ ప్రశ్నలను ఆహ్వానించింది. వాటికి హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలను అందించారు.

Published : 04 Mar 2020 01:24 IST

అమెరికా వీసాలకు సంబంధించి వివిధ అంశాలపై ‘అమెరికాయానం’ పేరుతో పాఠకుల నుంచి ‘ఈనాడు’ ప్రశ్నలను ఆహ్వానించింది. వాటికి హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ అధికారులు సమాధానాలను అందించారు.

సాఫ్ట్‌వేర్‌ రంగంలో పదేళ్ల అనుభవం ఉంది. హెచ్‌-1బి వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? - మోహన్‌ నున్నా

జవాబు: మీ కోసం అమెరికాలోని కంపెనీ హెచ్‌-1బి పిటిషన్‌ దాఖలు చేయాలి. అమెరికా డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ దాన్ని ఆమోదించాలి. ఆ తర్వాతే హెచ్‌-1బి వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. హెచ్‌-1బి పిటిషన్‌ సమాచారం కోసం https://www.uscis.gov/ చూడండి. ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ షెడ్యూల్‌ తదితర సమాచారం కోసం www.ustraveldocs.com/in ను పరిశీలించండి.

నేను హైదరాబాద్‌లో ఉంటున్నాను. నా గ్రీన్‌కార్డును హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌లో సరెండర్‌ చేయవచ్చా? - కృష్ణమూర్తి ఇలపావులూరి

జ: హైదరాబాద్‌ అమెరికన్‌ కాన్సులేట్‌లో గ్రీన్‌కార్డు సరెండర్‌ సదుపాయం లేదు. గ్రీన్‌కార్డును సరెండర్‌ చేయాలంటే ఐ-407 దరఖాస్తును నేరుగా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌), ఈస్ట్రన్‌ ఫామ్స్‌ సెంటర్‌కు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు తదితర సమాచారం కోసం https://wwwuscis.gov/i-407 పరిశీలించండి.

మా పర్యాటక వీసాలు ఈ ఏడాది జులై వరకు చెల్లుబాటు అవుతాయి. కాలం తీరడంతో కొత్త పాస్‌పోర్టు తీసుకున్నాం. జులై వరకు మా వీసాలు చెల్లుతాయా? లేదా వీసా కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా? - టి. వెంకట రామ్మోహన్‌

జ: వీసా చెల్లుబాటు కాలం ఇంకా ఉంది కాబట్టి మీరు అమెరికా ప్రవేశ ప్రాంతం వరకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ప్రయాణ సమయంలో కొత్త, పాత పాస్‌పోర్టులను వెంట ఉంచుకోవాలి. రెండు పాస్‌పోర్టులను వెంట తెచ్చుకోవటానికి ఇష్టం లేకపోతే నూతన వీసా పొందాలి. మరింత సమాచారం కోసం www.ustraveldocs.com/in ను చూడండి. అమెరికాలోకి అనుమతించాలా? వద్దా? అనుమతిస్తే ఎంత కాలం వరకు? అనే విషయాలకు సంబంధించి ప్రవేశ ప్రాంతంలోని అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులదే తుది నిర్ణయం.

15 నెలల కిందట నా పర్యాటక వీసా కాలం ముగిసింది. వీసా పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేద్దామనుకుంటున్నాను. ఇంటర్వ్యూ మినహాయింపు లేదా డ్రాప్‌ బాక్స్‌ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చా? అందుకు సంబంధించిన ప్రక్రియ ఏమిటి? - రవిరాజ్‌ కె

జ: వీసా గడువుతీరి ఏడాది దాటింది కాబట్టి సాధారణ ప్రక్రియలో వీసా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.వివరాలకు www.ustraveldocs.com/in ను చూడండి. వీసా దరఖాస్తు కేంద్రంలో వేలిముద్ర, కాన్సులేట్‌లో ఇంటర్వ్యూలకు అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. మరింత సమాచారాన్ని 040-4625 8222, 0120-4844644 నంబర్లలో లేదా support-india @ustraveldocs.com ద్వారా పొందవచ్ఛు.


* మరింత సమాచారం కోసం హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వెబ్‌సైట్‌ http://hyderabad.usconsulate.gov ను పరిశీలించవచ్ఛు.

* హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం అందించే వీసా తదితర సేవలకు సంబంధించి ప్రశ్నలను పాఠకులు usvisa@eenadu.net కు మెయిల్‌ చేయవచ్ఛు.

- ఈనాడు, హైదరాబాద్‌●


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని