విరామం సమస్యగా మారుతుందా?

బీటెక్‌-ఈఈఈ బ్రాంచ్‌ రెండేళ్లు చదివి మధ్యలో మానేశాను. రెండేళ్లు ఖాళీగా ఉండి ఇప్పుడు బీకామ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాను. ఖాళీగా ఉండటం ఉద్యోగ సాధనలో సమస్యగా మారుతుందా?

Published : 23 Mar 2022 00:25 IST

బీటెక్‌-ఈఈఈ బ్రాంచ్‌ రెండేళ్లు చదివి మధ్యలో మానేశాను. రెండేళ్లు ఖాళీగా ఉండి ఇప్పుడు బీకామ్‌ చివరి సంవత్సరం చదువుతున్నాను. ఖాళీగా ఉండటం ఉద్యోగ సాధనలో సమస్యగా మారుతుందా?

- ఎన్‌. సునీల్‌కుమార్‌

* ఒకప్పుడు ఉద్యోగ దరఖాస్తుల్లో చదువు మధ్యలో ఖాళీ ఉంటే ‘అది ఎందుకు ఉంది, ఆ ఖాళీ సమయంలో మీరు ఏం చేశారు?’ అని అడిగేవారు. కానీ ఇటీవలి కాలంలో అలాంటి విషయాలను పెద్దగా అడగటం లేదు. కాకపోతే ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఆ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం  చెప్పే ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూల్లో చాలామంది అభ్యర్ధులు చదువులో ఇలాంటి విరామాలతో వస్తున్నారు కాబట్టి, మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. విరామాలకు ముఖ్యంగా కుటుంబ సమస్యలు, ఆర్ధిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చదువుతున్న కోర్సుపై ఆసక్తి లేకపోవడం లాంటివి ఎక్కువగా చెబుతూ ఉంటారు. ఇంటర్వ్యూ నిర్వహించేవారు కూడా మీ పరిధిలో లేని కారణాలకు మిమ్మల్ని బాధ్యుల్ని చేయరు. మీ విషయ పరిజ్ఞానం, సమస్యా పరిష్కార శక్తి, భావప్రకటన సామర్థ్యం గ్యాప్‌ లేకుండా చదివినవారికంటే మెరుగ్గా ఉంటే- మీ ఉద్యోగ సాధనకు ఎలాంటి సమస్యా ఉండదు.


ఆ పరీక్షలకు అర్హత ఉందా?

అంబేడ్కర్‌ యూనివర్సిటీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. గ్రూప్స్‌/ సివిల్స్‌ పరీక్షలు రాయడానికి నాకు అర్హత ఉంటుందా?

- ఈ. సంతోష్‌

* డిగ్రీ పూర్తయిన తరువాత నిరభ్యంతరంగా మీరు గ్రూప్స్‌/ సివిల్స్‌తో పాటు డిగ్రీ అర్హత ఉన్న పోటీ పరీక్షలన్నిటికీ అర్హులు అవుతారు. యూజీసీ గుర్తింపు ఉన్న యూనివర్సిటీలు అందిస్తున్న అన్ని డిగ్రీలూ ప్రభుత్వ ఉద్యోగాలకు చెల్లుబాటు అవుతాయి. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లు రెగ్యులర్‌, డిస్టెన్స్‌, ఓపెన్‌ యూనివర్సిటీల నుంచి పొందిన డిగ్రీలను సమానంగానే పరిగణిస్తాయి. అత్యుత్తమ పరిశోధన సంస్థల్లో, కొన్ని ప్రత్యేకమైన ఉద్యోగాలకు మాత్రం రెగ్యులర్‌ సైన్స్‌ డిగ్రీని అర్హతగా పేర్కొంటున్నారు. జాతీయ విద్యావిధానం-2020 పూర్తి స్థాయిలో అమలైన తరువాత రెగ్యులర్‌, డిస్టెన్స్‌, ఓపెన్‌, ఆన్‌లైన్‌ డిగ్రీల మధ్య పెద్దగా తేడా ఉండదు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని