ఏది చదివితే మేలు?

ఇంటర్‌ (ఎంపీసీ) చదువుతున్నాను. దీని తర్వాత డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌.. ఏది చదివితే ఉద్యోగావకాశాలు బాగుంటాయి?

Updated : 06 Apr 2022 06:23 IST

ఇంటర్‌ (ఎంపీసీ) చదువుతున్నాను. దీని తర్వాత డిగ్రీ లేదా ఇంజినీరింగ్‌.. ఏది చదివితే ఉద్యోగావకాశాలు బాగుంటాయి?

- జార్జి ముల్లార్‌

ఇంటర్‌ చదివిన తరువాత మీకున్న చాలా అవకాశాల్లో డిగ్రీ, ఇంజినీరింగ్‌ అనేవి రెండు ముఖ్యమైన మార్గాలు. ఇప్పుడు మీరు తీసుకోబోయే నిర్ణయం మీ భావి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇలాంటి కెరియర్‌ నిర్ణయం తీసుకోవడానికి ముందు మీ జీవితాశయం ఏమిటి? మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది? గతంలో మీరు రాసిన వార్షిక పరీక్షల్లో ఎన్ని మార్కులు పొందారు? మీ బలాలూ బలహీనతలూ ఏమిటి? మీ ముందున్న అవకాశాలూ, సవాళ్లు ఏమిటి? చదువుకు అయ్యే ఖర్చుకు ఎంత కాలం మీ కుటుంబ సహకారం ఉంటుంది?- ఇలాంటి విషయాలపై అవగాహన పొందాక ఏ కోర్సు చదవాలో నిర్ణయించుకోండి.

ప్రతి కోర్సుకూ చాలా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇంజినీరింగ్‌ చదివినవారికి ఉద్యోగం రాకపోవచ్చు; సాధారణ డిగ్రీ చదివినవారు ఐఏఎస్‌ కూడా అవ్వొచ్చు. ఏ కోర్సు చదివినా దాన్ని ఇష్టంతో, ప్రణాళికాబద్ధంగా చదివి, ఆ రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి కావలసిన విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలను అలవర్చుకోవాలి. అప్పుడే అద్భుతమైన భవిష్యత్తు సొంతమవుతుంది. మీకు పరిశోధన రంగంపై ఆసక్తి ఉంటే డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలతో పాటు విదేశాల్లో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధన చేసి, దేశం గర్వించే శాస్త్రవేత్త అవ్వొచ్చు. అలాకాకుండా డిగ్రీ తరువాత కానీ, పీజీ తరువాత కానీ పోటీ పరీక్షలు రాసి మంచి ఉద్యోగం పొందవచ్చు. ఇంజినీరింగ్‌ విషయానికొస్తే ప్రవేశ పరీక్షలో మంచి ప్రతిభను కనపర్చి, ప్రముఖ విద్యాసంస్థలో ఈ కోర్సుని బాగా చదివితే మంచి వేతనంతో ఉద్యోగం సాధించవచ్చు. ఇంజినీరింగ్‌ రంగంలో పరిశోధనపై ఆసక్తి ఉంటే ఎంటెక్‌, పీహెచ్‌డీ చేసి, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తగా స్థిరపడవచ్చు. డిగ్రీ అర్హత ఉన్న చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు సాధారణ డిగ్రీతో పాటు ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందినవారు కూడా అర్హులే. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని