పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే..?

డిగ్రీ పాసయ్యాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా లక్ష్యం. గ్రూప్‌-4కు ఎలా సన్నద్ధం కావాలి?  

Updated : 10 Jan 2023 05:21 IST

డిగ్రీ పాసయ్యాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా లక్ష్యం. గ్రూప్‌-4కు ఎలా సన్నద్ధం కావాలి? 

బి. వందన

* పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్స్‌ ఉద్యోగాలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తుంటారు. ఇంత పోటీని తట్టుకొని ఉద్యోగం సంపాదించాలంటే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం అవ్వాల్సిందే. జనరల్‌ నాలెడ్జ్‌, సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ల్లో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. ప్రాంతీయ భౌగోళిక, సామాజిక, సంస్కృతి, వారసత్వం, ఆర్ధికం, కళలు, సాహిత్యం, పాలన విధానాలపై అవగాహన ఏర్పర్చుకోండి. దీంతోపాటు భారత రాజ్యాంగం, భారత భౌగోళిక అంశాలు, భారత ఆర్ధిక వ్యవస్థ, భారత జాతీయోద్యమం అంశాలపై కూడా పట్టు సాధించండి. దైనందిన జీవితంలో సైన్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, అంతర్జాతీయ సంబంధాలు, సమకాలీన సంఘటనలపై కూడా ప్రశ్నలుంటాయి. విజయం సాధించాలంటే రోజుకు కనీసం 8 గంటలు చదవాల్సిన అవసరం ఉంది. కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించి గత సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అంకగణిత/ సంఖ్యా సామర్థ్యాలకు సంబంధించిన సూత్రాలను ఒకచోట రాసుకొని, రోజూ ప్రాక్టీస్‌ చేయండి.

ఏ  పోటీ పరీక్షలోనైనా సరైన సమాధానాన్ని ఒక నిమిషంలోపే గుర్తించగలిగే సామర్థ్యం ముఖ్యం. సోషల్‌ మీడియాలో వ్యాపించే నెగెటివ్‌ ప్రచారాలకు దూరంగా ఉండండి. ప్రామాణిక పుస్తకాల నుంచి సమాచారాన్ని సేకరించి మీరే సొంతంగా నోట్స్‌ తయారుచేసుకోండి. మార్కెట్‌లో/ సోషల్‌ మీడియాలో దొరికే స్టడీ మెటీరియల్‌ నాణ్యతను పరిశీలించాకే, దానిపై ఆధారపడండి. ప్రశాంతమైన మనసుతో, ఎలాంటి ఆందోళనకూ గురి అవ్వకుండా పరీక్షకు సన్నద్ధమై మీ లక్ష్యాన్ని చేరుకోండి.

 ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని