ఆన్‌లైన్‌లో ఎంటెక్‌ ఎక్కడ మేలు?

బీటెక్‌ (సీఎస్‌ఈ) చదివి కంప్యూటర్‌ ఇంజినీర్‌గా చేస్తున్నా. ఎంటెక్‌/ ఎంఎస్‌ ఆన్‌లైన్‌లో చేయాలనివుంది.

Updated : 18 Apr 2023 00:31 IST

బీటెక్‌ (సీఎస్‌ఈ) చదివి కంప్యూటర్‌ ఇంజినీర్‌గా చేస్తున్నా. ఎంటెక్‌/ ఎంఎస్‌ ఆన్‌లైన్‌లో చేయాలనివుంది. మనదేశంలో/ యు.ఎస్‌.లో ఈ ప్రోగ్రామ్‌లను ఆన్‌లైన్‌లో ఏ యూనివర్సిటీలు అందిస్తాయి? వీటికి రెగ్యులర్‌తో సమాన హోదా ఉంటుందా?

ఎస్‌. సురేష్‌తేజ

* సాధారణంగా రెగ్యులర్‌గా చదివిన డిగ్రీలకూ, ఆన్‌లైన్‌ డిగ్రీలకూ సమానమైన హోదానే ఉంటుంది. కాకపోతే ఇంటర్వ్యూల్లో ఆన్‌లైన్‌ డిగ్రీలున్నవారితో పోలిస్తే రెగ్యులర్‌ డిగ్రీలు చదివినవారిపై కొంత సానుకూలత ఉండొచ్చు. దీన్ని అధిగమించాలంటే ఆన్‌లైన్‌ డిగ్రీ చదివేవారు, రెగ్యులర్‌ డిగ్రీ చదివినవారితో సమానంగా విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఎంటెక్‌/ ఎంఎస్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గా చేస్తేనే ప్రయోజనాలు ఎక్కువ. రెగ్యులర్‌గా చేసే అవకాశం లేకపోతే మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా చేయాలి. ఆన్‌లైన్‌/దూర విద్య డిగ్రీలు ఉద్యోగం చేస్తున్నవారికి ప్రమోషన్లు పొందడంలో ఉపయోగకరంగా ఉంటాయి.

బిర్లా ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ ఆన్‌లైన్‌ ఎంటెక్‌ కోర్సు చాలాకాలం నుంచి అందుబాటులో ఉంది. ఇండియన్‌ ఇన్‌స్ట్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ బెంగళూరు, ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ పాట్నా లాంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉద్యోగుల కోసం ఆన్‌లైన్‌ ఎంటెక్‌ కోర్సులను ప్రారంభించాయి. వీటితో పాటు మరికొన్ని ప్రైవేటు యూనివర్సిటీలూ ఆన్‌లైన్‌ ఎంటెక్‌ కోర్సులను అందిస్తున్నాయి. ఏదైనా కోర్సులో చేరేముందు, ఆ విద్యాసంస్థ వెబ్‌సైట్‌కి వెళ్ళి, మీరు చదవబోయే ఆన్‌లైన్‌ కోర్సుకు యూజీసీ/ ఏఐసీటీఈ గుర్తింపు ఉందో లేదో నిర్థారించుకోండి. ఆన్‌లైన్‌ కోర్సులను ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల నుంచి చేస్తేనే ఆ డిగ్రీలకు మంచి గుర్తింపు ఉంటుంది. ఇక చాలా విదేశీ యూనివర్సిటీలు ఆన్‌లైన్‌ ఎంఎస్‌ డిగ్రీలను అందిస్తున్నాయి. మీరు చదవాలనుకొంటున్న విశ్వవిద్యాలయపు అంతర్జాతీయ ర్యాంకింగ్‌, ట్యూషన్‌ ఫీజు, విశ్వసనీయత ఆధారంగా సరైన నిర్ణయం తీసుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని