మిత్రులకు దూరంగా ఎలా?

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. కోరుకున్న కాలేజీలోనే సీటు వచ్చింది కానీ టెన్త్‌, ఇంటర్‌ స్నేహితులు లేకుండా కాలేజీకి వెళ్లాలనిపించడం లేదు. ఈ మూడేళ్లూ ఎలా చదవాలో..?

Updated : 11 Jul 2023 06:11 IST

డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నా. కోరుకున్న కాలేజీలోనే సీటు వచ్చింది కానీ టెన్త్‌, ఇంటర్‌ స్నేహితులు లేకుండా కాలేజీకి వెళ్లాలనిపించడం లేదు. ఈ మూడేళ్లూ ఎలా చదవాలో..?

మానస

* డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారంటే మీ వయసు దాదాపు 18 ఏళ్లు ఉండొచ్చు. టెన్త్‌, ఇంటర్‌లలో మీతో చదువుకున్న స్నేహితులు/ స్నేహితురాళ్ళు వేర్వేరు కళాశాలల్లో చదువుతూ ఉండటమనేది చాలా సహజమైన విషయం. కానీ, మీరు స్నేహితులు లేకుండా కళాశాలకు ఎలా వెళ్లాలంటూ దిగులు పెట్టుకొని చదువుకు దూరమై, భవిష్యత్తునూ, సమయాన్నీ వృథా చేసుకొంటున్నారు.

జీవితమనే ప్రయాణంలో వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం. వీరిలో కొంతమందితో జీవితకాలం ప్రయాణం చేయాలనిపిస్తుంది. మరికొందరిని మళ్లీ జీవితంలో కలవాలని అనుకోం. అదృష్టవశాత్తూ మీకు మంచి స్నేహితులు చిన్నతనంలోనే దొరికారు. మిత్రులు ఎప్పుడూ బలం కావాలి కానీ, బలహీనత కాకూడదు. కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఇంతగా విస్తరించిన ఈ రోజుల్లో భౌతిక దూరం అనేది సమస్యే కాదు. ఫోన్‌తో నిమిషాల్లో కావాల్సినవారితో మాట్లాడొచ్చు.

మీరు, మీ స్నేహితులు వేర్వేరు కళాశాలల్లో చదవడం అనే విషయాన్ని ఒక సమస్యగా కాకుండా- ఓ మంచి అవకాశంగా భావించండి. మీరంతా అవకాశం ఉన్నప్పుడల్లా కలవడం, మీరు నేర్చుకొన్న విషయాలను చర్చించడం చేయొచ్చు.

జాగ్రత్తగా గమనిస్తే-  మీ ప్రస్తుత కళాశాలలో కూడా మీ మనసుకు నచ్చిన మిత్రులు దొరికే అవకాశం ఉంది. ఈ కొత్త నేస్తాలతో మీ జీవితం ఇంకా ఆనందంగా ఉండొచ్చు. జీవితంలో స్నేహితులు ఒక భాగమే కానీ, జీవితమే స్నేహితులు కాదు. వాళ్లు  లేరని మీరు కాలేజీకి వెళ్ళడం మానేస్తే, వాళ్లంతా బాగా చదువుకొని ప్రయోజకులై, భవిష్యత్తులో మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం కూడా ఉంది. కొత్త కళాశాల, కొత్త పరిచయాలు, కొత్త జీవితాన్ని అనుభవంలోకి తీసుకొస్తాయి. మీ ఆలోచనా విధానంలో మార్పులు వచ్చి, జీవితంలో ఉన్నత స్థితికి చేరుకొన్నాక, ప్రస్తుతం మీరున్న ఈ స్థితిని గుర్తుకు తెచ్చుకొని మీరే నవ్వుకుంటారు!

జీవితం చాలా విలువైంది. తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకొనివుంటారు. స్నేహితులూ, సినిమాలూ, సోషల్‌ మీడియా అని సమయం వృథా చేసుకోకుండా కోర్సుపై శ్రద్ధపెట్టి జీవితానికి ఒక అర్థాన్ని కల్పించుకోండి. ఒకవేళ ఇంటర్‌ తరువాత అత్యుత్తమ విద్యాసంస్థలో మెడిసిన్‌/ఇంజినీరింగ్‌ చదివే అవకాశం వచ్చుంటే, మిత్రులు మీతో ఉండరని, ఆ అవకాశాల్ని కచ్చితంగా వదులుకునేవారు కాదు కదా?  

జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని బలంగా అనుకొంటే- మీ స్నేహితులూ, శ్రేయోభిలాషులూ ఎప్పుడూ మీతోనే, మీ మనసులోనే ఉంటారు. ఇవన్నీ అర్థం చేసుకొని, కళాశాలకు రోజూ వెళ్లి బాగా చదువుకోండి. కుటుంబానికీ, స్నేహితులకూ, గర్వకారణమయ్యేలా కృషి చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని