ఐటీఐ తర్వాత బీటెక్‌ చదవాలంటే..?

మా తమ్ముడు ఈమధ్యే ఐటీఐ పాసయ్యాడు. ఇప్పుడు బీటెక్‌లో చేరడానికీ లేదా విదేశాల్లో చదవడా ఈ కోర్సు తర్వాత విద్యా, ఉద్యోగావకాశాలు ఏముంటాయి?

Updated : 13 Jul 2023 05:34 IST


మా తమ్ముడు ఈమధ్యే ఐటీఐ పాసయ్యాడు. ఇప్పుడు బీటెక్‌లో చేరడానికీ లేదా విదేశాల్లో చదవడా ఈ కోర్సు తర్వాత విద్యా, ఉద్యోగావకాశాలు ఏముంటాయి?

జి.నరేష్‌

ఐటీఐ అనేది పదో తరగతి తరువాత చదివే ఒకేషనల్‌ కోర్సు. దీని కాల వ్యవధి రెండు సంవత్సరాలు. ముఖ్యంగా దీనిలో నైపుణ్యాల శిక్షణ ఇస్తారు. ఐటీఐ కోర్సు ఇంటర్మీడియట్‌కి సమానం కాదు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఐటీఐ తరువాత లాంగ్వేజ్‌ బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేస్తే ఇంటర్మీడియట్‌ తత్సమాన సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ కచ్చితంగా చదివి ఉండాలి. ఐటీఐ చేసినవారికి ప్రత్యేక ప్రవేశపరీక్ష ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమాలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. మీరు బీటెక్‌ చేయాలనుకుంటే, రెండు సంవత్సరాలు డిప్లొమా చదివి, ఈసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంలో నేరుగా ప్రవేశం పొందవచ్చు. విదేశాల్లో చదవాలంటే ముందుగా ఇక్కడ ఏదైనా డిప్లొమా కానీ, డిగ్రీ కానీ పూర్తి చేయండి. ఉద్యోగావకాశాల విషయానికొస్తే, ఐటీఐ చదివినవారికి చాలా రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, బీహెచ్‌ఈఎల్‌, ఓఎన్‌జీసీ, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌, బీఈఎల్‌, డీఆర్‌డీవో, ఐఓసీఎల్‌, హెచ్‌పీసిఎల్‌, సింగరేణి, కోల్‌ ఇండియా, ఎలక్ట్రిసిటీ బోర్డ్‌ లాంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రైవేటు రంగానికొస్తే- సిమెంట్‌, స్టీల్‌, ఇతర మెటల్‌ కంపెనీలూ, ట్రాన్స్‌ఫార్మర్‌, ఎనర్జీ, నిర్మాణ సంస్థల్లో, ఎలక్ట్రికల్‌ వస్తువుల తయారీ, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల్లో, రిఫ్రిజరేెషన్‌, ఇతర మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీల్లో ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని