ఏఐ, రోబోటిక్స్‌ ఒకటేనా?

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నా. ఇంజినీరింగ్‌లో రోబోటిక్స్‌ తీసుకోవాలనుంది. అమ్మానాన్నలు ఏఐ చదవమంటున్నారు. స్నేహితులేమో ఈ రెండూ ఒకటేనంటున్నారు. ఏ కోర్సు మెరుగైనది?  

Updated : 07 Dec 2023 04:06 IST

ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నా. ఇంజినీరింగ్‌లో రోబోటిక్స్‌ తీసుకోవాలనుంది. అమ్మానాన్నలు ఏఐ చదవమంటున్నారు. స్నేహితులేమో ఈ రెండూ ఒకటేనంటున్నారు. ఏ కోర్సు మెరుగైనది?  

జి. జ్యోతి

ఈ సందేహం మీలాంటి చాలామంది విద్యార్థులకూ, తల్లిదండ్రులకూ చాలా సందర్భాల్లో కలిగేదే! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ/ కృత్రిమ మేధ) అంటే మనుషులకు ఉన్న మేధా సామర్థ్యముండే యంత్రాలను అభివృద్ధి చేసే కోర్సు. రోబోటిక్స్‌ అంటే ఆటోమేషన్‌, ఇన్నోవేషన్‌లను మెరుగుపరిచే డిజైన్లను చేసి, రోబోలను తయారుచేసే శాస్త్రం. ఈ రెంటి మధ్యా మరో ముఖ్యమైన తేడా ఉంది. రోబోటిక్స్‌లో సొంతంగా కదులుతూ, పరిసరాలతో సంబంధాలు పెట్టుకోగలిగే యంత్రాలను తయారుచేసే విధానాలు నేర్చుకుంటారు. ఏఐలో డేటా ప్రాసెసింగ్‌, అల్గారిథమ్స్‌ డిజైన్‌ గురించి నేర్చుకుంటారు. పునరావృతమయ్యే సూచనలను అనుసరించి రోబోలు వివిధ రంగాల్లో ఉత్పాదకతను మెరుగుపర్చేలా ప్రోగ్రామ్‌ చేస్తారు. ఏఐని కూడా వివిధ సందర్భాల్లో ఉపయోగించగలిగినప్పటికీ, ఇది రోబో కంటే మరింత చలనశీలంగా (డైనమిక్‌) ఉంటుంది. ఈ తేడాలను పక్కన పెడితే, ఈ రెండు కోర్సులూ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. రోబోల పనితీరును మెరుగుపరచడానికి కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. ఇవి రెండూ ఆటోమేషన్‌, డేటా అనాలిసిస్‌, డెసిషన్‌ మేకింగ్‌ లాంటి క్లిష్టమైన పనుల్ని సులభతరం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఈ రెండింటితో పాటు మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సుకు కూడా ఉన్నత విద్య, ఉపాధి, పరిశోధనావకాశాలు ఉన్నాయి. మీ అభిరుచి, ఆసక్తులను బట్టి సరైన కోర్సును ఎంచుకోండి. దీంతోపాటుగా ఆ కోర్సును సరిగా అర్థం చేసుకుని చదవడం, చదివిన విషయాల్ని ప్రాక్టికల్‌గా ఎలా ఉపయోగించాలో తెలియడం కూడా చాలా అవసరం.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని