ఈ కోర్సు పూర్తిచేస్తే...

బీటెక్‌, ఎంబీఏ రెగ్యులర్‌గా పూర్తిచేశాను. ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రంలో రెండేళ్ల ఆన్‌లైన్‌ ఎంఏ ఎకనామిక్స్‌ కోర్సులో ప్రవేశం పొందాను.

Updated : 15 Feb 2024 00:21 IST

బీటెక్‌, ఎంబీఏ రెగ్యులర్‌గా పూర్తిచేశాను. ఆంధ్రా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రంలో రెండేళ్ల ఆన్‌లైన్‌ ఎంఏ ఎకనామిక్స్‌ కోర్సులో ప్రవేశం పొందాను. ఈ కోర్సు పూర్తిచేస్తే.. ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీకీ, ఇండియన్‌ ఎకనామిక్స్‌ సర్వీస్‌ పరీక్షకూ అవకాశం ఉంటుందా?

ఐశ్వర్య

ఆంధ్రా యూనివర్సిటీకి న్యాక్‌ గ్రేడింగ్‌ ఆధారంగా యూజీసీ గ్రేడ్‌ వన్‌ అటానమస్‌ హోదా కల్పించారు. దీనివల్ల యూనివర్సిటీకి కొత్త కోర్సుల రూపకల్పనకు అవసరమైన స్వయంప్రతిపత్తి ఉంటుంది. ఏదైనా యూనివర్సిటీ నిర్వహించే దూరవిద్య, ఆన్‌లైన్‌ ప్రోగ్రాంలకు యూజీసీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బ్యూరో (డెబ్‌) అనుమతి తప్పనిసరి. సాధారణంగా, ప్రభుత్వ యూనివర్సిటీలు జారీచేసే డిగ్రీల విషయంలో నియామక సంస్థలకు ఎలాంటి అనుమానాలూ ఉండవు. ఏదైనా పోటీ పరీక్షకు డిగ్రీ అనేది ఒక విద్యార్హత మాత్రమే. రాత పరీక్షలో, ఇంటర్వ్యూలో చూపే ప్రతిభపైనే మీ ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. మీరు యూనివర్సిటీ నుంచి డెబ్‌ జారీ చేసిన అనుమతి పత్రాన్ని తీసుకొని భద్రపర్చుకోండి. భవిష్యత్తులో ఏదైనా ఇంటర్వ్యూలో అవసరం అయితే ఉపయోగపడవచ్చు. మీరు ప్రస్తుతం చదువుతున్న ఆన్‌లైన్‌ ఎంఏతో పీహెచ్‌డీ, ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌లతో పాటు అన్ని పోటీ పరీక్షలకూ అర్హులవుతారు. జాతీయ విద్యావిధానం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక రెగ్యులర్‌, డిస్టెన్స్‌, ఆన్‌లైన్‌ డిగ్రీలు అన్నింటికీ ఒకే రకమైన గుర్తింపు ఉండే అవకాశాలు ఉంటాయి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని