సర్కారీ కొలువు సాధించేదెలా?

రెండేళ్ల కిందట బీటెక్‌ పూర్తిచేశాను. ఏడాదిపాటు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలనుంది. దాని కోసం ఎలా సన్నద్ధం కావాలి?

Updated : 27 Feb 2024 01:35 IST

రెండేళ్ల కిందట బీటెక్‌ పూర్తిచేశాను. ఏడాదిపాటు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలనుంది. దాని కోసం ఎలా సన్నద్ధం కావాలి?

రమణ

మీరు బీటెక్‌లో ఏ బ్రాంచి చదివారో, సాఫ్ట్‌వేర్‌లో ఏ ఉద్యోగం చేశారో చెప్పలేదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే, ఇంజినీరింగ్‌కు సంబంధించినదా? గ్రూప్స్‌ లాంటిదా? ఏ ప్రభుత్వ కొలువుకు అయినా చాలా పోటీ ఉంటుంది కాబట్టి, ప్రణాళికాబద్ధంగా, పట్టుదలతో సమయపాలనను పాటిస్తూ సన్నద్ధం అవ్వాలి. అప్పుడు సర్కారీ ఉద్యోగం పొందడం కష్టం కాదు. మీ విద్యార్హతతో ఏయే ఉద్యోగాలకు అర్హులు అవుతారో, ఏ ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. ఆ తరువాత ఆ ఉద్యోగ పరీక్షకు సంబంధించిన పూర్వ ప్రశ్నపత్రాలను సేకరించండి. ఆ పరీక్షకు నిర్థరించిన సిలబస్‌ని చూసి ఎంత సన్నద్ధత అవసరమో అంచనా వేయండి. సిలబస్‌కు సంబంధించిన పాఠ్యపుస్తకాలూ, రిఫరెన్స్‌ పుస్తకాలూ కొనుగోలు చేయండి. ప్రతిరోజూ వార్తా పత్రికల్ని చదువుతూ, అందులోని సంపాదకీయ పేజీలో వచ్చే వ్యాసాల్లోని ముఖ్యాంశాలతో సొంత నోట్స్‌ తయారు చేసుకోండి. కరెంట్‌ అఫైర్స్‌పై కూడా దృష్టి పెట్టండి. సిలబస్‌కి అనుగుణంగా నోట్స్‌ తయారు చేసుకొంటూ, అర్థం చేసుకొని చదవడం అలవాటు చేసుకోండి. ఆ పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం చేస్తున్నవారిని సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోండి. అదే విధంగా, ఆ పోటీ పరీక్షకు సన్నద్ధం అవుతున్నవారితో చర్చిస్తూ సన్నద్ధతలో మెలకువలు నేర్చుకోండి. వీలున్నన్ని నమూనా పరీక్షలు రాస్తూ, పోటీ పరీక్ష రాయడంలో మీ వేగాన్ని పెంచుకోండి. చివరిగా, ఆర్థిక వెసులుబాటు ఉంటే, విశ్వసనీయత ఉన్న శిక్షణ సంస్థలో కోచింగ్‌ పొందే విషయాన్ని కూడా పరిగణించండి. వివిధ ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం పొందినవారి ఇంటర్వ్యూలను చూస్తూ ప్రేరణ పొందుతూ, ప్రభుత్వ కొలువు పొందాలన్న మీ ఆశయం నెరవేర్చుకోండి.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు