నీట్‌కు అర్హత ఉంటుందా?

నాగార్జున వర్సిటీ నుంచి దూరవిద్యలో బీఎస్సీ (బీజడ్‌సీ) గత ఏడాది పూర్తిచేశాను. ఇంటర్‌లో డిప్లొమా చేశాను. ఇప్పుడు నీట్‌ రాసి ఎంబీబీఎస్‌ చదవాలనుకుంటున్నా.

Published : 28 Feb 2024 00:05 IST

నాగార్జున వర్సిటీ నుంచి దూరవిద్యలో బీఎస్సీ (బీజడ్‌సీ) గత ఏడాది పూర్తిచేశాను. ఇంటర్‌లో డిప్లొమా చేశాను. ఇప్పుడు నీట్‌ రాసి ఎంబీబీఎస్‌ చదవాలనుకుంటున్నా. నాకు అర్హత ఉందా?

అశోక్‌ యాదవ్‌ 

మీరు డిప్లొమాలో ఏ సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. గత సంవత్సరం వరకు నీట్‌ రాయాలంటే, ఇంటర్మీడియట్‌లో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ కచ్చితంగా చదివి ఉండాలి. కానీ, జాతీయ విద్యావిధానం- 2020లో భాగంగా ఈ సంవత్సరం నుంచి నీట్‌ విద్యార్హతల్లో కొంత వెసులుబాటు కల్పించాలని నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వారు నిర్ణయించారు. అందులో భాగంగా.. ఇంటర్మీడియట్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ మాత్రమే చదివివుంటే, ఆ తర్వాత గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి అదనపు సబ్జెక్ట్‌గా బయాలజీ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించినవారినీ నీట్‌కు అనుమతించాలని నిర్ణయించారు. ఇలాంటి విద్యార్థులు విదేశాల్లో ఎంబీబీఎస్‌ చదవాలంటే, వారి విద్యార్హతలు నిర్థరిస్తూ నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వారు జారీ చేసే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్‌ అవసరం. నీట్‌ 2024 నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు మాత్రమే ప్రామాణికంగా తీసుకొని మీ అర్హతను నిర్థరించుకోండి. మీరు డిప్లొమాలో బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివివుంటే, ఆ డిప్లొమాని, ఇంటర్మీడియట్‌కు సమానంగా ప్రభుత్వం గుర్తించి ఉంటే, మీరు నీట్‌ రాయడానికి అర్హులు అవుతారు. ఒకవేళ, మీరు డిప్లొమాలో బయాలజీ చదివి ఉండకపోతే, దాన్ని అదనపు సబ్జెక్ట్‌గా చదివి, నీట్‌కి అర్హత సాధించండి. మీ ప్రస్తుత విద్యార్హతలతో నీట్‌ రాయడానికి అర్హత లేకపోతే, ఇంటర్మీడియట్‌ని బైపీసీతో పూర్తి చేసి  నీట్‌కి సన్నద్ధం కండి. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం నీట్‌ పరీక్ష రాయడానికి గరిష్ఠ వయః పరిమితి లేదు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని