నా ఎంపిక సరైనదేనా?

పీయూసీ రెండో ఏడాది చదువుతున్నాను. తర్వాత మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివి.. యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావాలనుకుంటున్నాను.

Published : 29 Feb 2024 00:21 IST

పీయూసీ రెండో ఏడాది చదువుతున్నాను. తర్వాత మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివి.. యూపీఎస్సీ పరీక్షకు సిద్ధం కావాలనుకుంటున్నాను. నా ఎంపిక సరైనదేనా? ఎప్పటినుంచి పరీక్షకు సన్నద్ధం కావాలి?

ఆర్‌.శ్యామ్‌సుందర్‌

మీరు మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన తరువాత యూపీఎస్సీ పరీక్షకు సన్నద్ధం అవ్వాలని ఉందన్నారు. మీ దృష్టిలో యూపీఎస్సీ పరీక్ష అంటే సివిల్సా, ఇంజినీరింగ్‌ సర్వీసా అనేది చెప్పలేదు. పీయూసీ చదివేప్పుడే భవిష్యత్తు కెరియర్‌ గురించి ఆలోచించడం, యూపీఎస్సీ పరీక్ష లాంటి అత్యున్నత లక్ష్యాన్ని ఎంచుకోవడం అభినందనీయం! అయితే, మీరు ఇప్పుడు చదువుతున్న పీయూసీపై శ్రద్ధ పెట్టి, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని, ఇంజినీరింగ్‌ కోర్సును ఉత్తమ విద్యా సంస్థ నుంచి చదివే ప్రయత్నం చేయండి. ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం నుంచి యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధత మొదలు పెట్టండి.

యూపీఎస్సీ పరీక్షలకూ, బోర్డ్‌/ యూనివర్సిటీ పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. బోర్డ్‌/ యూనివర్సిటీ పరీక్షల్లో ప్రశ్నల్ని నేరుగా ఇస్తే, యూపీఎస్సీలో అప్లికేషన్‌పై ఎక్కువగా అడుగుతారు. యూపీఎస్సీ సిలబస్‌లో జనరల్‌ స్టడీస్‌, కరెంట్‌ అఫైర్స్‌లు కూడా భాగం. కాబట్టి, ఇంజినీరింగ్‌ పుస్తకాలతో పాటు వార్తా పత్రికలను చదవడం మీ రోజు వారి జీవితంలో భాగం చేసుకోండి. యూపీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నలు ఆలోచనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా, సృజనాత్మకంగా, సమస్య- పరిష్కార పద్ధతుల్లో ఉంటాయి. మీరు పరీక్షలకు చదివేప్పుడు బట్టీ పట్టి చదవడం కాకుండా, అర్థం చేసుకొని, సొంతంగా నోట్సు రాసుకుంటూ చదవాలి. అప్పుడే విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. యూపీఎస్సీ పరీక్షలో రాణించాలన్న బలమైన ఆశయం ఉండి, ప్రణాళికయుతంగా కొన్ని సంవత్సరాల పాటు కృషి చేస్తే, మీ కలను నెరవేర్చుకోవడం అసాధ్యం కాదు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు