Updated : 08 Dec 2022 20:00 IST

విదేశాల్లో ఫలిస్తున్న ఎంబీబీఎస్‌ కల!

స్వదేశంలో మెడికల్‌ సీట్లు పరిమితంగా ఉండి, ప్రవేశాలకు భారీ పోటీ ఉన్న నేపథ్యంలో విదేశీ వైద్యవిద్య సులువైన ప్రత్యామ్నాయంగా మారింది. ఎందుకంటే ప్రవేశపరీక్ష రాయనక్కర్లేదు; డొనేషన్లు కట్టాల్సిన అవసరమూ లేదు. ఫీజు, ఇతర ఖర్చులతో 15- 30 లక్షల రూపాయిల్లోపు వెచ్చించగలిగితే చాలు. విద్యాభ్యాసం పూర్తిచేసుకుని ఎంబీబీఎస్‌ పట్టా పొంది, స్వదేశానికి తిరిగివచ్చి వైద్యసేవలను అందించవచ్చు! ఈ మార్గం ఎంచుకునే విద్యార్థులు ఏయే విషయాలు గమనించాలి? ఎలా ముందడుగు వేయాలి?

నదేశంలో వైద్యవిద్య చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్న ప్రతి విద్యార్థికీ అది తీరే అవకాశం లేదు. బీఏ, బీకాం, బీఎస్‌సీ.. దేనిలో చేరాలన్నా సీటు దొరుకుతుంది; అందుబాటులోనే కళాశాలలుంటాయి. ఇంజినీర్‌ అవ్వాలంటే సొంత జిల్లా కూడా దాటక్కర్లేదు. కానీ ఇంటర్మీడియట్‌ జీవశాస్త్రంలో 99 శాతం మార్కులు వచ్చినా వైద్యవిద్య అర్హత పరీక్షకు సిద్ధమై, భారీ పోటీని ఎదుర్కోవాల్సిందే.

నిన్నటిదాకా ఎంసెట్‌... ఇప్పుడు నీట్‌! ఇంటర్‌ బైపీసీలో 90 శాతం దాటిన విద్యార్థి కూడా నీట్‌లో కనీసం అర్హత కూడా సాధించలేకపోయినవారు లక్షల్లో ఉన్నారు. మెడికల్‌ సీట్లు బాగా తక్కువ ఉండటం వల్ల భారీ వడపోత అనివార్యమైపోయింది.

ఎంతో మంచి ర్యాంకు రానపుడు యాజమాన్య కోటాకు తగ్గ ఆర్థిక స్థితి లేనపుడు వైద్యవిద్యపై ఆశలు వదిలేసుకోవాల్సివచ్చేది.

ఈ పరిస్థితుల్లోనే విదేశీ వైద్యవిశ్వవిద్యాలయాలు మధ్యతరగతి విద్యార్థులకు భరోసాగా నిలిచాయి. ప్రవేశాల కోసం వారిని సాదరంగా ఆహ్వానిస్తూ వస్తున్నాయి. మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల్లో జార్జియా, ఫిలిప్పీన్స్‌, చైనా, కిర్గిస్థాన్‌, ఉక్రెయిన్‌, రష్యా, మధ్య అమెరికా ఖండాల్లోని కొన్ని దేశాలు, కరేబియన్‌ దీవులు ముఖ్యమైనవి. వాటిలో మౌలిక సదుపాయాలూ, బోధనా ప్రమాణాలూ సంతృప్తికరంగా ఉంటున్నాయని అక్కడ చదువుతున్న విద్యార్థులు చెపుతున్నారు.

విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించడం కోసం చాలా సంవత్సరాల నుంచి మన విద్యార్థులు వెళ్తున్నారు. కాలక్రమంలో విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించేవారిలో నాణ్యతా ప్రమాణాల కోసం కఠినమైన నిబంధనలను భారత వైద్యమండలి (ఎంసీఐ) తీసుకువచ్చింది. ముఖ్యంగా.. కోర్సు పూర్తిచేసి, స్వదేశంలో ప్రాక్టీస్‌ చేయాలంటే ఎఫ్‌.ఎం.జి.ఇ. (ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ ఎగ్జామ్‌) ను తప్పనిసరి చేసింది. దీన్నే స్క్రీనింగ్‌ టెస్టుగా వ్యవహరిస్తున్నారు. కోర్సు ఆరంభం నుంచీ ఈ పరీక్షపై అవగాహన పెంచుకుంటే ఈ పరీక్షలో నెగ్గటం కష్టమేమీ కాదనేది విజేతలైన విద్యార్థుల అనుభవం.

విదేశాల్లో కళాశాలల ఎంపిక
మారిన నిబంధనల ప్రకారం కళాశాలల ఎంపికకు కొన్ని ముఖ్యమైన సూచనలను విద్యార్థులు గమనించాలి.

1) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వైద్య నిఘంటువులో నమోదైవున్న కళాశాలలను మొదట చూసుకోవాలి.

2) వెళ్తున్న దేశంలో చదవాలనుకుంటున్న కళాశాలకు ఆ దేశ ప్రభుత్వ గుర్తింపు ఉన్నదనేది నిర్ధారించుకోవాలి

3) చేరబోయే కళాశాల ఉన్న దేశంలో భారత ప్రభుత్వ ఎంబసీ ఉందేమో గమనించాలి. అక్కడ కళాశాలల పట్ల మన ఎంబసీ ఏమైనా సూచనలు చేసివుంటే వాటిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి.

4) స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. అందుకని ఎంపిక చేసుకున్న కళాశాలలో ఆంగ్ల మాధ్యమ బోధన ఉన్నదీ లేనిదీ ధ్రువీకరించుకున్నాకే చేరాలి.

ఇందుకు సంబంధించి ఇతర వివరాల కోసం, తాజా సమాచారం కోసం ఎంసీఐ అధికారిక వెబ్‌సైట్‌www.mciindia.orgను క్షుణ్ణంగా పరిశీలించడం మేలు.

ప్రత్యేక జాగ్రత్తలు
* విదేశాల్లో వైద్యవిద్య ప్రవేశాల కోసం ఎక్కువమంది విద్యార్థులు కన్సల్టెన్సీలపైనే ఆధారపడుతున్నారు. తగిన కన్సల్టెన్సీని ఎంచుకోవటం, తాము చదవదల్చిన దేశంలో కోర్సు పూర్తిచేసుకుని, ఇక్కడ ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యులను అడిగి అన్ని విషయాలూ తెలుసుకోవడం ముఖ్యం.
పూర్వ విద్యార్థుల నుంచి తెలుసుకోవాల్సినవి:
* కళాశాలలో విద్యాబోధన నాణ్యతా ప్రమాణాలతో ఉందా?
* ఆంగ్ల మాధ్యమ బోధన ఉందా? అది సులువుగా అర్థమయ్యేలా ఉందా?
* క్యాంపస్‌లో ఎంసీఐ స్క్రీనింగ్‌ టె®ü్టపై ప్రత్యేక శిక్షణకు ఏర్పాట్లున్నాయా?
* ఆ దేశంలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం జాగ్రత్తలు అవసరం?
* శాంతి భద్రతలూ, వసతి గృహాల్లో రక్షణ చర్యలు బాగున్నాయా?
* భారతీయ విద్యార్థుల ఆహారపు అలవాట్లకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా?
* కొన్ని కళాశాలలు విద్యార్థులను చేర్పించేందుకు ఒక్కరికి మాత్రమే అధికారిక ప్రతినిధిగా గుర్తింపునిస్తాయి. మరికొన్ని కళాశాలలు ఒకరికి మించి ఎందరికో గుర్తింపు పత్రాలను జారీచేస్తాయి. ఇక్కడే విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు కళాశాలల వెబ్‌సైట్లలో సంబంధిత సమాచారం ఉండే అవకాశం ఉంది.
* అమెరికా, బ్రిటన్‌, కెనడా, న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో వైద్యవిద్యలో పీజీ పూర్తిచేస్తే మనదేశంలో ఎంసీఐ ఆ డిగ్రీకి గుర్తింపునిస్తుంది. మిగతా ఇతర దేశాల్లో పీజీ చదివితే మాత్రం ఆ డిగ్రీని గుర్తించదు.

ఉపయోగపడే వెబ్‌సైట్లు
*www.mciindia.org/MediaRoom/ ListofChinaColleges.aspx
*http://avicenna.ku.dk/database/ medicine
*www.wdmos.org

స్క్రీనింగ్‌ పరీక్ష కష్టమేమీ కాదు! 

‘మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు మాత్రమే చదివి పరీక్ష రాస్తే ఫలితం తలకిందులవుతుంది. అందుకనే పాఠ్యపుస్తకాలు బాగా చదవండి. ప్రాక్టికల్స్‌ మిస్‌ కాకండి’ అంటూ మా సీనియర్లు పదేపదే చెప్పేవారు. ఆ సలహా నా మీద బాగా పనిచేసింది. పుస్తకాలను ఇష్టంతో నవలల మాదిరిగా చదివాను. అందుకే ఎంసీఐ స్క్రీనింగ్‌ టెస్టు రాసిన మొదటిసారే మంచి మార్కులతో పాసయ్యాను.

- డా. టి. మనోజ, మెదక్‌
‘మొదటి సెమిస్టర్‌ నుంచే పరీక్ష పట్ల పూర్తి అవగాహనతో మా కళాశాలలో చదువుతూవచ్చాను. భారతీయ ప్రొఫెసర్లను రప్పించి ఎంసీఐ పరీక్ష శిక్షణ తరగతులు నిర్వహించేలా కన్సల్టెన్సీ వారు సహకరించారు. దీంతో కాస్త భారం తగ్గింది. సులువుగా పరీక్షకు సిద్ధమయ్యాను. దీంతో రాసిన మొదటిసారే పరీక్షలో నెగ్గగలిగాను.
- డా. రాజ్‌కుమార్‌ కె, హైదరాబాద్‌

భారతీయ వైద్యులతో సమానమేనా? 

విదేశీ వైద్యవిద్యకు సంబంధించి విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో కొన్ని సందేహాలూ, అపోహలూ ఉంటున్నాయి. వాటి నిజానిజాలు చూద్దాం.

* విదేశాల్లో వైద్యవిద్య చదవటానికి ఏ అర్హతలు ఉండాలి?
ఎంసీఐ పేర్కొన్న వయసు, మార్కుల నిబంధనలను విద్యార్థులు తప్పకుండా పాటించాలి. 1) ఈ ఏడాది విదేశీ వైద్యవిద్యలో చేరాలనుకునే విద్యార్థికి ఈ డిసెంబర్‌ 31 నాటికి 17 సంవత్సరాలు పూర్తికావాలి. 2) జీవశాస్త్రంలో ఇంటర్మీడియట్‌/ తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు. అందులో 50%కు తక్కువ కాకుండా మార్కులను సాధించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ/ వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు 40% తెచ్చుకుంటే సరిపోతుంది. జీవశాస్త్ర, రసాయన, భౌతికశాస్త్రాల్లో వచ్చిన మార్కులను మాత్రమే పరిగణిస్తారు. ఆంగ్ల బోధనాంశం తప్పనిసరి.

*కళాశాలలో చేరేముందు ఎంసీఐ అనుమతి అవసరమా?
అవసరమే. ఎంసీఐ వెబ్‌సైట్‌లో ఉన్న ఎలిజిబిలిటీ దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. దాన్ని పూర్తిచేసి, యూనివర్సిటీ నుంచి వచ్చిన అడ్మిషన్‌ లెటర్‌నూ, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత మార్కుల జాబితానూ జతచేసి పంపాలి. దరఖాస్తు ప్రాసెస్‌ చేయడానికి ఏమైనా చెల్లింపులుంటే ఆ మొత్తాన్ని చెల్లించాలి.

* విదేశాల్లో మెడిసిన్‌ చదవాలంటే ఏయే పత్రాలు కావాలి?
స్టడీ సర్టిఫికెట్లు, పదో తరగతి, ఇంటర్‌ మార్కుల జాబితాలు. కొన్ని కళాశాలలు బోనఫైడ్‌, పుట్టిన తేదీ ధ్రువపత్రాలు కూడా అడుగుతాయి.

* విజిటింగ్‌ వీసా మీద విదేశీ వైద్యకళాశాలలో చేరవచ్చా?
చదువుకోవడానికి వెళుతున్నందువల్ల విజిటింగ్‌ వీసా అని కాకుండా స్టూడెంట్‌ వీసా మాత్రమే ఉండాలి. అయితే కొన్ని దేశాలు విజిటింగ్‌ వీసా మీద కూడా విద్యాభ్యాసానికి అనుమతిస్తున్నాయి.

*విదేశాల్లో ఇచ్చే ఎంబీబీఎస్‌ డిగ్రీకీ, మనదేశంలో ఇచ్చే ఎంబీబీఎస్‌ డిగ్రీకీ ఏమైనా తేడా ఉందా?
మనదేశంలో ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులయ్యాక విద్యార్థులు తాము చదివిన వైద్య కళాశాలలోనే ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేస్తారు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన తర్వాత మనదేశంలోనే ఇంటర్న్‌షిప్‌ చేయాల్సివుంటుంది. అందుకు స్క్రీనింగ్‌ టెస్టులో నెగ్గాల్సివుంటుంది. ఇదొక్కటే తేడా. ఈ స్క్రీనింగ్‌ టెస్టులో ఉత్తీర్ణులై, హౌస్‌ సర్జన్సీ ఏడాది పూర్తయిన తర్వాత ఆ డాక్టరు భారతీయ డాక్టరుతో సమానమవుతారు.

* ఐదేళ్ళ కోర్సు అనీ, ఆరేళ్ళ కోర్సు అనీ... ఎంబీబీఎస్‌ ఇన్ని సంవత్సరాల్లో పూర్తిచేయాలనే నిబంధన ఉందా?
అటువంటిదేమీ లేదు. స్థానిక ప్రభుత్వ గుర్తింపు, డబ్ల్యూహెచ్‌ఓలో నమోదు, భారతీయ ఎంబసీ అనుమతించిన కళాశాలల్లో వైద్యవిద్యను అభ్యసిస్తే అక్కడ కోర్సు వ్యవధికాలంతో పని లేదు.

* విదేశాల్లో ప్రైవేటు వైద్యకళాశాలలకూ, ప్రభుత్వ వైద్య కళాశాలలకూ గుర్తింపులో కానీ, నాణ్యతలో కానీ తేడా ఏమైనా ఉందా?
దాదాపు అన్ని దేశాల్లోనూ వైద్య కళాశాలల నిర్వహణ బాధ్యతను ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తోంది. నాణ్యతా ప్రమాణాలూ, మౌలిక వసతులూ, అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందీ కేవలం ప్రభుత్వ రంగంలో నడిచే వైద్యకళాశాలల్లోనే ఉంటాయనుకోవడం అపోహే. ఎన్నో దేశాల్లో ప్రైవేటురంగంలోనే విద్యావ్యవస్థ నడుస్తోంది. ఉదా: నేపాల్‌, ఫిలిప్సీన్స్‌. చైనాలో, సీఐఎస్‌ (ఒకప్పటి సోవియట్‌ రష్యా ప్రాంత) దేశాల్లో చాలామట్టుకు ప్రభుత్వ కళాశాలలే ఉంటాయి. ఉదా: ఉక్రెయిన్‌, బెలారస్‌ లాంటివి. మరికొన్ని దేశాల్లో రెండు రంగాల్లోనూ వైద్యకళాశాలలుంటాయి. ఉదా: భారత్‌, కిర్గిస్థాన్‌ మొదలైనవి.

* ఎంబీబీఎస్‌ కళాశాలలో పీజీ ఉంటేనే యూజీకి గుర్తింపు ఉంటుందా?
అది అపోహ మాత్రమే. ఈ రెండూ వేర్వేరు కోర్సులు. దీనికీ, దానికీ సంబంధం లేదు.

* స్క్రీనింగ్‌ టెస్టు చాలా కష్టమనీ, ఉత్తీర్ణత శాతం బాగా తక్కువనీ విన్నాం. నిజమేనా?
కొంతవరకూ వాస్తవమే! కానీ ఏ విద్యార్థీ ఏ పరీక్షకూ భయపడకూడదు. ప్రత్యేక తర్ఫీదు, క్యాంపస్‌లో తగిన శిక్షణ ఉంటే ఎంసీఐ స్క్రీనింగ్‌ టెస్టు ఉత్తీర్ణత పెద్ద కష్టం కాదు.. కోర్సు పూర్తిచేసుకుని, ఈ పరీక్షను తొలిసారే ఉత్తీర్ణత సాధించినవారు చాలామందే ఉంటున్నారు.

* వైద్యకళాశాలలకు సంబంధించి ఏదైనా సమాచారం భారతీయ ఎంబసీ వెబ్‌సైట్లలో లభిస్తుందా?
లభించే అవకాశం ఉంది. ఆయా దేశాల్లో ఆ కళాశాలల పట్ల స్థానిక ప్రభుత్వం ఏదైనా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే ఆ సమాచారాన్ని ఎంబసీ వారు తమ సైట్లలో తెలుపుతారు. ఏవైనా హెచ్చరికలు ఉంటే అవి కూడా అవే సైట్లలో పొందుపరుస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని