మంత్రి ఎంపిక.. రాజు ప్రశంస!

మగధ రాజ్యానికి సువర్ణుడు రాజు. ఒకరోజు ఖజానా లెక్కలు చూసే ఉద్యోగి అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో రాజ్యానికి కోశాధికారిగా కొత్తవారిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ బాధ్యతను మంత్రికి అప్పగించాడు రాజు. రాజు ఆజ్ఞ ప్రకారం మంత్రి రాజ్యంలో చాటింపు వేయించాడు...

Updated : 21 Mar 2021 01:02 IST

గధ రాజ్యానికి సువర్ణుడు రాజు. ఒకరోజు ఖజానా లెక్కలు చూసే ఉద్యోగి అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో రాజ్యానికి కోశాధికారిగా కొత్తవారిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ బాధ్యతను మంత్రికి అప్పగించాడు రాజు.
రాజు ఆజ్ఞ ప్రకారం మంత్రి రాజ్యంలో చాటింపు వేయించాడు. అర్హత ఉన్న యువకులందరికీ వివిధ పరీక్షలు నిర్వహించాడు. అందులో ప్రతిభ చూపి, నమ్మకంగా కనిపించిన ఇద్దరు యువకులను ఎంపిక చేశాడు. వారి పేర్లు జయశీలుడు, అనంతుడు. వారిద్దరిలో కోశాధికారి ఉద్యోగానికి అర్హుడెవరో నిర్ణయించేందుకు ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించాడు మంత్రి. మరుసటి రోజు వారిద్దరినీ సభకు పిలిపించాడు.
రాజు సమక్షంలో జయశీలుడికి, అనంతుడికి మంత్రి చెరొక సంచి ఇచ్చి ‘వీటిలో కొన్ని బంగారు నాణేలు ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయో కచ్చితంగా లెక్కించి తీసుకురండి’ అని చెప్పాడు. జయశీలుడు, అనంతుడు వేర్వేరుగా కూర్చొని జాగ్రత్తగా నాణేలను లెక్కించసాగారు.
అనంతుడు ముందుగా లెక్కించి వచ్చి ‘రాజా! ఈ సంచిలో వంద బంగారు నాణేలు ఉన్నాయి’ అని చెప్పి మంత్రికిచ్చాడు. జయశీలుడు మాత్రం కొంత ఆలస్యంగా వచ్చి ‘రాజా! నాకిచ్చిన సంచిలో 93 బంగారు నాణేలు మాత్రమే ఉన్నాయి’ అని చెప్పాడు.
‘మంత్రి రెండు సంచుల్లో వంద నాణేలు వేసి ఇచ్చాడు. అనంతుడు నిజం చెప్పాడు. మరి, జయశీలుడికి తక్కువ ఎలా వచ్చాయి? ఏమైనా దొంగిలించాడా?’ అని మహారాజుతో సహా అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. మంత్రి ఏమాత్రం కంగారు పడకుండా ‘రాజా! కోశాధికారిగా జయశీలుడిని ఎంపిక చేయండి’ అని అన్నాడు. ‘అదెలా? ఇచ్చిన సమయంలో కచ్చితంగా లెక్కించి న్యాయంగా సంచిలో ఎన్ని నాణేలున్నాయో చెప్పిన అనంతుడిని కాదని జయశీలుడిని ఎంపిక చేయడం ఏమిటి?’ అని ప్రశ్నించాడు రాజు.
‘చిత్తం మహారాజా! ఆ వివరణ ఏమిటో జయశీలుడి మాటల్లోనే వినండి’ అని అతడి వైపు చూశాడు మంత్రి. జయశీలుడు వినయంగా నమస్కరించి ‘రాజా! మా ఇద్దరికి ఇచ్చిన సంచుల్లో నూరు నాణేలు ఉన్నాయి. కానీ, వాటిని నిశితంగా పరిశీలించి చూడగా అయిదు నాణేలు నకిలీవి, రెండు మీ రాజముద్ర లేకుండా ఉన్నట్లు గుర్తించాను’ అని చెప్పాడు.
‘అవి నకిలీవని ఎలా గుర్తించావు?’ అని ప్రశ్నించాడు రాజు. ‘రాజా.. బంగారు నాణేలన్నీ ఒకే బరువుతో, ఒకే మెరుపుతో ఉన్నాయి. కానీ, నకిలీవి మాత్రం ఇనుముతో తయారు చేసి బంగారు పూత పూయడంతో బరువు తక్కువగా ఉన్నాయి. అందువల్ల వాటిని గుర్తించగలిగాను. రెండు నాణేలపై రాజముద్ర కాకుండా వేరే ముద్ర ఉంది కనుక అవి చెల్లవు. మొత్తంగా వందలో ఏడింటిని మినహాయిస్తే తొంభై మూడే బంగారు నాణేలు’ అని సమాధానమిచ్చాడు జయశీలుడు. ‘లెక్కించే సమయంలో తొందరపాటు, అశ్రద్ధ ఉండకూడదని అనంతుడి కన్నా కొంత ఎక్కువ సమయం తీసుకున్నాను. నేను ఇక్కడికి కోశాధికారి ఉద్యోగానికి వచ్చాను కాబట్టి దానికి ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో ఆ విధంగానే ప్రయత్నించాను’ అని ఆలస్యానికి వివరణ ఇచ్చాడు. వెంటనే సభ చప్పట్లతో మారుమోగింది. రాజు సైతం జయశీలుడి సునిశిత దృష్టికి, తీక్షణ శక్తిని మెచ్చుకొని రాజ్య కోశాధికారిగా నియమించాడు. సరైన వ్యక్తిని ఎంపిక చేసినందుకు మంత్రిని అభినందించాడు.

- గెడ్డం సుశీలరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని