శాంతి సైన్యం

మగధ చక్రవర్తి విజయసింహుడు. వాళ్ల నాన్న రాజ సింహుడు అనేక రాజ్యాలను జయించి మగధను విస్తరింపజేశాడు. సైనిక, ఆర్థిక, భౌగోళిక పరంగా మగధ బలమైన దేశంగా రూపుదిద్దుకుంది. ఇతర రాజులు ఎవరూ మగధ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేసేవారు కాదు. విజయసింహుడు శాంతికాముకుడు. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించేవాడు. ప్రతి ఏడాది సైన్యం కోసం దాదాపు కోటి వరహాలు...

Updated : 08 May 2021 01:02 IST

గధ చక్రవర్తి విజయసింహుడు. వాళ్ల నాన్న రాజ సింహుడు అనేక రాజ్యాలను జయించి మగధను విస్తరింపజేశాడు. సైనిక, ఆర్థిక, భౌగోళిక పరంగా మగధ బలమైన దేశంగా రూపుదిద్దుకుంది. ఇతర రాజులు ఎవరూ మగధ వైపు కన్నెత్తి చూసే ధైర్యం చేసేవారు కాదు.
విజయసింహుడు శాంతికాముకుడు. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించేవాడు. ప్రతి ఏడాది సైన్యం కోసం దాదాపు కోటి వరహాలు అదనంగా ఖర్చు చేస్తున్నట్లుగా విజయసింహుడు గ్రహించాడు. ఆ ధనంతో అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు. తద్వారా ఇంకా తన ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అని ఆలోచించాడు విజయ సింహుడు.
వెంటనే తన ఆలోచన అమలు చేయడం గురించి చర్చించడానికి మహామంత్రి మాధవ శర్మను పిలిపించి, తన ఆలోచనను వివరించాడు.
చక్రవర్తి ఆలోచన గ్రహించిన మహామంత్రి.. ‘మహారాజా..! రాజ్య సంక్షేమం కోరి మీరు చేసిన ఆలోచన గొప్పది. కానీ రాజకీయపరంగా మాత్రం కాదు. ఎందుకంటే ఒక నాయకుడు ఎప్పుడూ సైన్యాన్ని నడిపించే సారథిగా బలంగా ఉండాలి. బలహీనమైన రాజు ఎంతటి సమర్థుడైనప్పటికీ, ఎంత సజ్జనుడైనా సరే.. ఆ రాజ్యం పరాధీనం కాక తప్పదు. అలా వేరే వాళ్ల చేతిలోకి వెళితే, ప్రజలు స్వాతంత్య్రం కోల్పోతారు. అది ప్రజలకు పెద్ద శాపం. ఉదాహరణకు ఒక విషయం చెబుతాను మహారాజా.. మృగరాజు సింహం, ఆకలి అయినప్పుడు మాత్రమే వేటాడుతుంది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో దాని చుట్టుపక్కల ఎన్నో జంతువులు తిరుగుతుంటాయి. కానీ దాని దగ్గరకు పోలేవు. దానికి కారణం సింహానికి ఉన్న బలం. దాని జోలికి వెళ్తే చీల్చి చెండాడుతుందని వాటికి ముందే తెలుసు కాబట్టి అవి ఆ ధైర్యం చేయవు. చక్రవర్తి కూడా ఆ విధంగానే ఉండాలి. చక్రవర్తి అయిన తమరు శాంతినే కాంక్షించాలి. కానీ, సైన్యపరంగా మిగతా రాజులకన్నా మీకే అధిక బలగం ఉండాలి. బలిష్టంగా ఉన్న రాజే శాంతిని బోధించగలడు. బలహీనుడైన రాజు శాంతిని కోరుకుంటాడు. కానీ ఇతర రాజులు అతనికి అశాంతిని కలుగజేస్తారు. శాంతి, సైన్యం రెండూ ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగినవి.
మరొక విషయం మహారాజా! తమరు వారసత్వంగా పొందింది విశాలమైన రాజ్యాన్ని మాత్రమే కాదు. అనేక మంది శత్రువుల్ని కూడా.. కాబట్టి వాళ్లను బలంగా ఎదుర్కోవాలి. అందువల్ల తమరు శాంతిని కోరుకుంటే కచ్చితంగా సైనికపరంగా బలవంతులు కావాల్సిందే’ అని ముగించాడు.
మహామంత్రి చెప్పిందంతా విన్నాక, కాసేపు ఆలోచనలో పడ్డ చక్రవర్తి, ‘నిజమే మహా మంత్రీ.. మీరు చాలా చక్కగా చెప్పారు’ అంటూ ఆ మాటల్ని అంగీకరించాడు.

- సి.వి.ఎస్‌. ఉషా కృష్ణప్రియ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని