తాతయ్య కల

పుణ్యగిరి అటవీ ప్రాంతం దట్టమైన చెట్లతో నిండి ఉండేది. ఆ అడవిలో అనేక జంతువులు, పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలో ఉన్న కోతుల గుంపునకు కేసరి అనే కోతి నాయకత్వం వహించేది. కొంత కాలానికి కేసరి ముసలిది కావడంతో చెట్లు ఎక్కలేక, ఎక్కడికీ వెళ్లలేక అక్కడే ఉన్న ఒక గుహలో ఉండ సాగింది.

Updated : 23 Jul 2021 00:49 IST

పుణ్యగిరి అటవీ ప్రాంతం దట్టమైన చెట్లతో నిండి ఉండేది. ఆ అడవిలో అనేక జంతువులు, పక్షులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలో ఉన్న కోతుల గుంపునకు కేసరి అనే కోతి నాయకత్వం వహించేది. కొంత కాలానికి కేసరి ముసలిది కావడంతో చెట్లు ఎక్కలేక, ఎక్కడికీ వెళ్లలేక అక్కడే ఉన్న ఒక గుహలో ఉండ సాగింది. అప్పుడప్పుడూ బయటకు వచ్చి పక్కనే ఉన్న చెట్టు కింద చేరి కాస్త సేదదీరేది. చెట్టుమీద పక్షులు, ఉడతలు పడవేసిన పళ్లను, గింజలను తిని కడుపు నింపుకునేది.
తన పిల్లలు, మనవలు కళ్లముందే ఆడుతూ, గెంతుతూ పండ్లు, కాయలు తినేవారు. కానీ కేసరిని మాత్రం పట్టించుకునేవారు కాదు. తన వారితో మాట్లాడాలని, మనవల ముద్దుముద్దు మాటలు వినాలని వారితో ముచ్చటించాలని ఎంతో కోరికగా ఉండేది కేసరికి. పిలిచినా వచ్చేవి కాదు. ‘నువ్వు ముసలిదానివి మాతో ఆడలేవు’ అని పరుగులు తీసేవి పిల్ల కోతులు. ‘అంతేలే’ అని మనసులో అనుకుని బాధ పడేది.
ఇలా ఇంకొంతకాలం గడిచింది. ఆహారం లేక కేసరి బాగా నీరసించిపోయింది. ఒకరోజు చిన్న కోతిపిల్ల అంజు ఆడుకుంటూ ఆడుకుంటూ చెట్టు కింద ఉన్న కేసరి దగ్గరకు వచ్చి ‘ఎవరు నువ్వు?’ అని అడిగింది. ‘నేను నీ ముత్తాతను’ అంది. ‘ముత్తాత అంటే?’ అని గుడ్లు మిటకరించుకుంటూ అడిగింది అంజు. ఆ ముని మనవరాలితో మాట్లాడుతూ ఉంటే చెప్పలేనంత ఆనందం కలిగింది కేసరికి. ‘పోనీలే వాళ్లకంటే నువ్వే మంచి దానివి’ అని దగ్గరకు తీసుకుని ముద్దులాడింది. ‘తాత అంటే  నాన్నకు తండ్రి’ అని, ఎన్నో కబుర్లు చెప్పింది కేసరి. తన కల నెరవేరిందేమో కాసేపటికి అలా నేలకొరిగింది. అంజుకు ఏమీ అర్థం కాలేదు. అటూ ఇటూ కదిపింది. ముఖాన్ని తన వైపు తిప్పుకుంది. ‘ఎందుకలా పడుకున్నావులే’ అంటూ లేపసాగింది. ఎంతకూ లేవకపోవడంతో పరుగున వెళ్లి అమ్మానాన్నకు చెప్పింది. కోతుల గుంపు మొత్తం వచ్చింది చుట్టూ చేరి ఎంతో బాధపడ్డాయి. అదే చెట్టుమీద ఉన్న మైనా వీటన్నింటినీ చూసి ‘ఇప్పుడు ఏడ్చి ఏం లాభం. ఇంతకాలం గుక్కెడు నీళ్లు పొయ్యలేదు. ఎలా ఉందో పట్టించుకోలేదు’ అంది. ‘ఇంతకూ నువ్వెవరు?’ అని నిలదీశాయి మిగతా కోతులు.
‘నేను మీకు ఏమీకాను. కేసరిలాగే వయసు పైబడ్డ దాన్ని. ఇదిగో ఇదే నా మనవరాలు నా బాగోగులు చూసుకుంటోంది’ అంది గొప్పగా. ఆ సమయంలో పిల్ల మైనా ఆహారాన్ని తీసుకువచ్చి ముసలి మైనా నోట్లో పెడుతోంది. ఆ ఆహారాన్ని ముసలి మైనా అందుకోలేక, తినలేక జారవిడుస్తోంది. అలా కింద పడ్డ ప్రతీసారి విసుక్కోకుండా ఆహారాన్ని తెచ్చి మళ్లీ నోట్లో పెడుతోంది పిల్ల మైనా. ‘చూశారా నా పరిస్థితి ఆహారం తెచ్చిపెట్టినా తినలేకపోతున్నాను. ఏ పనీ చేసుకోలేను. అందుకే ఈ వయసులో మాకు ఆదరణ అవసరం. నన్ను విడిచిపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటోంది నా మనవరాలు. మేము మీతో సమానంగా ఆడలేకపోవచ్చు కానీ వాటిలో మెలకువలు చెప్పగలం. మీతో సమానంగా కష్టపడలేకపోవచ్చు కానీ కష్టం విలువ, కాలం విలువ చెప్పగలం’ అంది చెమర్చిన కళ్లతో ముసలి మైనా.
ఇదంతా విన్న అంజు ఒక్క ఉదుటన పరుగు తీసింది. దగ్గరలో ఉన్న వాగు దగ్గరకు వెళ్లి తామరాకును డొప్పగా చేసి నీళ్లు పట్టి తెచ్చి కేసరి ముఖంపై చల్లింది. కాసేపటికి స్పృహలోకి వచ్చింది. దొప్పలో నీళ్లు తాగి తెప్పరిల్లింది. తనవారినందరిని చూసి పొంగిపోయింది కేసరి.
తమ తప్పును తెలుసుకున్న కోతులన్నీ కేసరిని క్షమించమని వేడుకున్నాయి. ఇక మీదట వయసు పైబడిన వారి ఆలనాపాలనా చూసుకుంటామని ప్రమాణం చేశాయి. కనువిప్పు కలిగించిన మైనా కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేశాయి. అంజు తెలివితేటలను కోతులన్నీ మెచ్చుకున్నాయి.

- కాశీ విశ్వనాథం పట్రాయుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని